parabhath panaik

కార్పొరేట్ల ఆదాయం దేశ జిడిపిలో సుమారు నాలుగో వంతు. ఆ లెక్కన రూ.4.5 లక్షల కోట్లు జిడిపి తగ్గినప్పుడు కార్పొరేట్ల ఆదాయం అందులో నాలుగో వంతు-అంటే సుమారు రూ.1.1 లక్షల కోట్లు తగ్గుతుంది. కాని వారికి లభించిన పన్ను రాయితీ రూ.1.5 లక్షల కోట్లు. అంటే దేశం జిడిపి తగ్గినా, కార్పొరేట్ల లాభం మాత్రం రూ.40,000 కోట్లు పెరుగుతుంది. సంక్షోభం ఓ పక్క, కార్పొరేట్ల లాభాలు ఇంకోపక్క పెరుగుతూనే ఉంటాయన్నమాట. మరోవిధంగా చెప్పాలంటే సంక్షోభం పెరిగితే ప్రజల మీద భారాలు పెరుగుతాయే తప్ప కార్పొరేట్లకు లాభాల పంట పండుతూనే ఉంటుంది.

పెట్టుబడిదారీ వ్యవస్థలో నియంతృత్వ ప్రభుత్వాలు, ఫాసిస్టు ప్రభుత్వాలు బడా పెట్టుబడిదారుల సంపూర్ణ సహకారంతో, మద్దతుతో అధికారాన్ని చెలాయిస్తాయి. వాస్తవానికి అటువంటి నియంతృత్వ శక్తులు అధికారంలోకి రావడం వెనక ఈ బడా పెట్టుబడిదారుల అండ ఒక ముఖ్య భూమికను పోషిస్తుంది. ఒకసారి తాము మద్దతు ఇచ్చిన శక్తులు అధికార పగ్గాలు చేపట్టగానే ఈ బడా పెట్టుబడిదారులు తాము అందించిన మద్దతుకు పూర్తి ప్రతిఫలాన్ని గుంజుకుంటారు. బడా బడా కాంట్రాక్టులు, రాయితీలు పొందుతారు. తమ లాభాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటారు. అయితే ఫాసిస్టు/నియంతృత్వ పాలకుల నుండి పొందే ప్రయోజనాలు బడా పెట్టుబడిదారులందరికీ ఒకే మోతాదులో అందవు. వీరిలో కొంతమంది ముఖ్యంగా కొత్తగా తలెత్తిన బడా పెట్టుబడిదారీ శక్తులు-ప్రభుత్వాల ముద్దు బిడ్డల మాదిరిగా ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయి. 1930 దశకంలో యూరప్‌లో పలు దేశాలలో ఫాసిస్టు పాలకులు వ్యవహరించిన తీరు పరిశీలిస్తే ఈ ట్రెండ్‌ మనకు స్పష్టంగా కనపడుతుంది. సాంప్రదాయ రంగాలైన జౌళి వంటి రంగాల పెట్టుబడిదారుల కంటే ఆయుధ తయారీ, భారీ పరిశ్రమలు వంటి రంగాల పెట్టుబడిదారులు అధిక ప్రయోజనాలు పొందారు. అదేవిధంగా జపాన్‌లో కూడా సాంప్రదాయ/పాత పెట్టుబడిదారులైన మిట్సుబిషి, సుమిటోమో లాంటి సంస్థలకన్నా భారీ పరిశ్రమలు, ఆయుధాల తయారీ రంగాల్లో విస్తరించిన నిస్సాన్‌ ఆ ప్రభుత్వం నుండి అధిక ప్రయోజనాలను పొందింది. కొరియా లోని ఖనిజ సంపదను కొల్లగొట్టింది. అక్కడ దారుణంగా వెనకబడి వున్న కార్మికుల శ్రమను యథేచ్ఛగా దోచుకుంది. ఖనిజ సంపద కరువైన జపాన్‌కు కావాల్సిన ఖనిజాలన్నింటినీ సరఫరా చేసింది. భారతదేశంలో సైతం 1970 దశకంలో ‘ఎమర్జెన్సీ’ కాలపు నియంతృత్వ ప్రభుత్వ హయాంలో (ఇందిరాగాంధీ కాలంలో) సాంప్రదాయ రంగాల పెట్టుబడిదారులను వెనక్కినెట్టి కొత్తవారు ఎక్కువ లాభపడ్డారు. ఇక ప్రస్తుత ప్రభుత్వ హయాం గురించి చూద్దాం. 2014 ఎన్నికలకు బాగా మునుపే మన దేశంలోని బడా కార్పొరేట్లంతా ‘ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌’ పేర శిఖరాగ్ర సమావేశం జరిపారు. ఇది మోడీ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్‌లో జరిగింది. ఆ సమావేశం ద్వారా 2014లో తామెవరికి దన్నుగా ఉండబోతున్నదీ చెప్పకనే చెప్పారు. ఆ మద్దతు 2019లో మరింత స్పష్టంగా ‘ఎన్నికల బాండ్లు’ చూపించాయి. ఒక స్వచ్ఛంద సంస్థ అంచనాల ప్రకారం 2019 ఎన్నికల్లో బిజెపి సుమారు రూ.27,000 కోట్లు ఖర్చు చేసింది. తక్కిన అన్ని బూర్జువా పార్టీలూ కలిపి చేసిన ఖర్చు కూడా ఇంత లేదు. ఒక్కో పార్లమెంటు నియోజక వర్గానికి సగటున రూ.50 కోట్లు ఖర్చు చేసింది. కార్పొరేట్లు ధారాళంగా విరాళాలిస్తే తప్ప ఇది సాధ్యం కాదు.

ఈ మతతత్వ-కార్పొరేట్‌ శక్తుల కలయికతో కార్పొరేట్లు బ్రహ్మాండంగా లాభపడ్డారు. ఒకపక్క దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నది వాస్తవం. ఈ సంక్షోభానికి మూలం పెట్టుబడిదారీ వ్యవస్థ లోనే ఉందన్నదీ స్పష్టం. నయా ఉదారవాద విధానాలతో ఈ వ్యవస్థ ఇంకెంత మాత్రమూ ముందుకి పోలేదన్నదీ స్పష్టమే. అయినప్పటికీ ఇంత సంక్షోభంలోనూ మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ల ఆస్తులను పెంచుతూనే ఉంది. వారికి లాభాలు సమకూరుస్తూనే వుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను నామమాత్రపు ధరలకి అమ్మేసి కార్పొరేట్ల హస్తగతం చేస్తున్నారు. సంక్షోభంలో వృద్ధి రేటు సాధించాలంటే కార్పొరేట్లలో లాభాల వేటపై మరింత ‘ఊపు’ కలిగించాలన్న వాదన తెచ్చి గత బడ్జెట్‌లో నిర్ణయించిన పన్నులలో ఏకంగా రూ.1,50,000 కోట్ల మేరకు పన్ను రాయితీలిచ్చేశారు! కాని ఈ ‘రాయితీ’ వలన సంక్షోభం ఏమాత్రమూ తగ్గదు సరికదా మరింత పెరుగుతుంది. పన్ను రాయితీ ఇవ్వడం అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ఒదులుకోవడం. దీని ఫలితంగా ప్రజా సంక్షేమంపై ఖర్చు చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు తగ్గిపోతాయి. అప్పుడు ప్రజల సంక్షేమంపై కోత విధించాలి. లేదా సామాన్య ప్రజలపై విధించే పన్నులను పెంచాలి. ఈ రెండింట్లో ఏది జరిగినా ప్రజల కొనుగోలు శక్తి మరింత తగ్గుతుంది. పర్యవసానంగా ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమౌతుంది. సంక్షోభం తీవ్రమైనప్పటికీ కార్పొరేట్లు పొందే లాభాలు తగ్గవు సరికదా పెరుగుతాయి!

ఇదెలా సాధ్యమో చూద్దాం. రూ.1.5 లక్షల కోట్లు పన్ను రాయితీ ఇచ్చినందు వల్ల ప్రభుత్వానికి ఆ మేరకు ఆదాయం తగ్గుతుంది. అంటే ప్రభుత్వం పెట్టే ఖర్చు రూ.1.5 లక్షల కోట్లు తగ్గుతుంది. దీనివలన స్థూల జాతీయోత్పత్తి రూ.4.5 లక్షల కోట్లు తగ్గుతుంది. (స్థూలంగా ఖర్చుకు జిడిపి మూడు రెట్లు ఉంటుందని అంచనా ప్రాతిపదికన లెక్కవేస్తే) కార్పొరేట్ల ఆదాయం దేశ జిడిపిలో సుమారు నాలుగో వంతు. ఆ లెక్కన రూ.4.5 లక్షల కోట్లు జిడిపి తగ్గినప్పుడు కార్పొరేట్ల ఆదాయం అందులో నాలుగో వంతు-అంటే సుమారు రూ.1.1 లక్షల కోట్లు తగ్గుతుంది. కాని వారికి లభించిన పన్ను రాయితీ రూ.1.5 లక్షల కోట్లు. అంటే దేశం జిడిపి తగ్గినా, కార్పొరేట్ల లాభం మాత్రం రూ.40,000 కోట్లు పెరుగుతుంది. సంక్షోభం ఓ పక్క, కార్పొరేట్ల లాభాలు ఇంకోపక్క పెరుగుతూనే ఉంటాయన్నమాట. మరోవిధంగా చెప్పాలంటే సంక్షోభం పెరిగితే ప్రజల మీద భారాలు పెరుగుతాయే తప్ప కార్పొరేట్లకు లాభాల పంట పండుతూనే ఉంటుంది.

మొత్తంగా కార్పొరేట్‌ సంస్థలన్నీ లాభాలు పొందడం అంటే కార్పొరేట్‌ సంస్థలన్నింటికీ ప్రయోజనం ఒకే విధంగా లభిస్తుందని అనుకోవద్దు. మోడీకి ప్రియమైన కార్పొరేట్‌ కుటుంబాలు రెండు ఉన్నాయి. అదానీ, అంబానీల కుటుంబాలు. నరేంద్రమోడీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే అదానీ గుజరాత్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. 2014లో మోడీ ప్రధానిగా ప్రమాణం చేయడానికి ఢిల్లీ చేరుకున్నది అదానీ స్వంత విమానంలోనే. అదీ వారి సాన్నిహిత్యం. ఏమాత్రమూ పూర్వానుభవం లేని రక్షణ రంగంలో అనిల్‌ అంబానీ కంపెనీకి ప్రయోజనం కలిగించేలా రాఫెల్‌ ఒప్పందాన్ని మోడీ కుదుర్చుకున్న వైనం అందరికీ తెలిసిందే. ఇందుకోసం అనుభవం, నైపుణ్యం రెండూ ఉన్న హిందూస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ అనే ప్రభుత్వరంగ సంస్థను సైతం పక్కన పెట్టేసిన తీరు కూడా అందరూ చూశారు. ఇక ముకేష్‌ అంబానీకి చెందిన ‘జియో’ సంస్థ కోసం బిఎస్‌ఎన్‌ఎల్‌ను ఏవిధంగా నాశనం చేస్తున్నదీ ప్రస్తుతం చూస్తూనే వున్నాం.
అదానీ, అంబానీల పట్ల మోడీ కనపరిచే ఈ ప్రత్యేక అభిమానాన్ని జీర్ణించుకోలేకనే మరో కార్పొరేట్‌ దిగ్గజం రాహుల్‌ బజాజ్‌ ఒక సమావేశంలో అమిత్‌ షా సమక్షంలోనే బాహాటంగా ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందుకు బిజెపి మూకలు అతనిపై సోషల్‌ మీడియాలో దాడి చేస్తే పలువురు కార్పొరేట్‌ ప్రతినిధులు అతనిని అభినందించారు కూడా. చరిత్రలో ఫాసిస్టు తరహా ప్రభుత్వాలు నడిచిన తీరులోనే మోడీ ప్రభుత్వం నడక తీరు ఉంది.