– బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మరో నిర్ణయం
– నాడు పర్యావరణ అనుమతుల కోసం నిబంధన..
– నేడు బాధ్యత నిధిని రద్దుచేసిన మోడీ సర్కార్‌

కేంద్రంలో అధికారం మారితే తలరాతలు మారుతాయని జనం అనుకుంటుంటే…బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్పొరేట్ల సేవే పరమావధిగా భావిస్తున్నది. కార్మికహక్కులు..కర్షక..శ్రామిక జీవితాలకు తూట్లు పొడిచే నిబంధనలే కాదు. బడాపారిశ్రామికవేత్తలు కోరిన వెంటనే జీహుజూర్‌ అంటున్నది మోడీ సర్కార్‌ . అడవినే నమ్ముకున్న గిరిజనాన్ని తరిమేయటమే కాదు. పర్యావరణానికి కేంద్రం ముప్పు తలపెట్టింది. తాజాగా కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత నిధి అనేది తప్పనిసరి కాదంటూ మార్చిన నిబంధన ఇప్పుడు అగ్గిరాజేయనున్నది. 

న్యూఢిల్లీ : బడా కార్పొరేట్లకు మేలు చేకూర్చేవిధంగా మోడీ సర్కార్‌ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నది. పర్యావరణ అనుమతులు తీసుకోవటంలో ‘కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత’ అన్నది తప్పనిసరి కాదనీ… నిబంధనలు మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సంస్థ అయినా..బడా కార్పొరేట్‌ కంపెనీ అయినా…కొత్తగా ఏదైనా భారీ ప్రాజెక్ట్‌ చేపడుతున్నప్పుడు ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం, ‘కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత'(సీఈఆర్‌) కింద కొన్ని పనులు చేపట్టాలి. అప్పుడే పర్యావరణ అనుమతులు మంజూరవుతాయి. ఏమేమి చేస్తామని కంపెనీ వాగ్దానం చేసిందో, అది నెరవేర్చకపోతే స్థానిక ప్రజలు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించవచ్చు. అయితే కేంద్రం తాజా ఉత్తర్వులతో అదంతా మారిపోనున్నది. ప్రతిఏటా సీఈఆర్‌ కోసం బడ్జెట్‌ కేటాయింపులు జరుపుతూ, ప్రతి కంపెనీ (ప్రభుత్వమైనా, ప్రయివేటుదైనా) నిధులు ఖర్చు చేయాలి. ఆదాయ శాఖకు సైతం ఈ వివరాలు అందజేయాలి. ఒక ప్రాజెక్ట్‌ స్థాపన ద్వారా సమీపంలోని పర్యావరణానికీ, ప్రజలకు ఎంతో కొంత నష్టం జరుగుతుంది. దీనిని సరిదిద్దడం కోసం ఆ కంపెనీ చెట్ల పెంపకాన్ని చేపట్టడం, అక్కడి పౌరుల కోసం విద్య, వైద్యం, తాగునీరు..వంటి సదుపాయాలు కల్పించాలి. సంక్షేమ కార్యక్రమాలు నిధులు కేటాయించి ప్రతి ఏటా ఖర్చు చేయటం..ఇదంతా కూడా సీఈఆర్‌ కిందకే వస్తుంది. మోడీ సర్కార్‌ తాజా నిర్ణయంతో ఇదంతా కూడా రద్దవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

సీఈఆర్‌ కింద 0.125 శాతం నుంచి రెండు శాతం వసూలు చేయాలని చట్టం ఉంటే ఇప్పుడు దాన్ని తొలగించారు. పర్యావరణానికి నష్టం కలిగించి ప్రజలకు రోగాలు రావడానికి కారకులైన కంపనీల యజమానులు తాము చేసే నష్టానికి నష్టపరిహారం కట్టకుండా ఇప్పుడు తప్పించుకుంటున్నారు. ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.సీఈఆర్‌ తప్పనిసరి కాదని, దీనిని పాటించటం ‘ఆప్షనల్‌’ మాత్రమేనని పేర్కొంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఇటీవల ఆదేశాలు చేయటం పర్యావరణవేత్తల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పర్యావరణ అనుమతులు పొందటమనేది ఇకపై నామమాత్రంగా మారుతుందనీ, పర్యావరణ పరిరక ్షణకు కట్టుబడి ఉంచే నిబంధనలన్నీ ఎత్తేశారని వారు విమర్శించారు. ఈ దేశంలో పర్యావరణ నిబంధనలు పాటించేలా ఒక సాధికారిక యంత్రాంగం లేదని ఆందోళన చెందుతున్నవేళ, ఎంతో కొంత కట్టుబడి ఉండే సంస్థలను సైతం తాజా నిర్ణయం ప్రభావితం చేస్తుందని పర్యావరణవేత్తలు అన్నారు.

పేదలపై ప్రభావం
ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం, పర్యావరణ అనుమతుల కోసం ఒక కంపెనీ చట్టపరంగా కొన్ని నిబంధనలు పాటించాలి. స్థానికంగా ఉండే ప్రజలు, ఆవాసాలు, జీవాలు నష్టపోకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆ కంపెనీ రాతపూర్వకంగా హామీ ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా కాగితాలకే పరిమితం కానుంది. మోడీ సర్కార్‌ తాజా ఉత్తర్వుల ప్రకారం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత కంపెనీపై అక్కడి ప్రజలు న్యాయపరంగా పోరాడే అవకాశం చాలా తక్కువ.

కేంద్రమే అడ్డదారి చూపుతున్నది..:పర్యావరణవేత్తలు
ఒక ప్రాజెక్ట్‌పై పర్యావరణ అనుమతులు పొందడానికి కేంద్రమే ఆయా కార్పొరేట్లకు దగ్గరిదారి(షార్ట్‌ కట్‌) చూపింది. పర్యావరణ అనుమతుల కోసం ప్రతి కంపెనీ మొదట ఎన్నో వాగ్దానాలు చేస్తుంది. కాలుష్యాన్ని నివారిస్తాం. స్థానికంగా నివసించేవారి పట్ల అది చేస్తాం..ఇది చేస్తామని చెబుతారు. పాఠశాల పెడతాం, నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుచేస్తామంటారు. తాగునీటి వసతి కల్పిస్తామంటారు. చదువులో మెరుగ్గావుండే విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ ఇస్తామంటారు. ఇలాంటివన్నీ కూడా ‘సీఈఆర్‌’ కిందకే వస్తాయి. ‘కంపెనీ తమకు వాగ్దానం చేసింది. మాట తప్పింది’ అని స్థానిక ప్రజలు ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అయితే తాజా ఉత్తర్వులతో ఈ హక్కును కూడా మోడీ సర్కార్‌ లాగేసుకుంది.

అసలేం జరుగుతున్నది..?
పెట్టుబడిదారీ వర్గాలు పారిశ్రామిక అభివృద్ధి పేరు పెట్టి… నవ సమాజమంటూ ప్రకృతి సంపదను కొల్లగొట్టడం ఆనవాయితీగా మారుతున్నది. ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జల విద్యుత్‌ ప్రాజెక్టులు, పురుగుమందు ఫ్యాక్టరీలు ఇలా ఎన్నో పరిశ్రమలు వెలుస్తున్నాయి. పర్యావరణాన్ని విష వాయువులతో, కాలకూట కాలుష్యాలతో నిండిపోతున్నది. మితిమీరిన స్వార్థం.. ధనార్జనే ధ్యేయంగా… కార్పొరేట్‌ శక్తులు మానవ సంబంధాలను వ్యాపార వస్తువులుగా మార్చేస్తున్నారు. అలా ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెట్‌ చేసుకుంటూ అపర కుబేరులుగా సమాజంలో కనిపిస్తున్నారు. నయా ఉదారవాదం పేరిట తమ అనుకూలమైన కార్పొరేట్లకు కేంద్రంలో కొలువయ్యే ప్రభుత్వాలు కుమ్మక్కవుతున్నాయి. ఫలితంగా విచ్చలవిడిగా అటవీ సంపదను కొల్లగొడుతున్నారు. ఇలా అడ్డు ఆపు లేకుండా అనేక ప్రకృతి కీలక వనరులను కబళిస్తూ పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటంటే.. కార్పొరేట్‌ వర్గాలతో చేతులు కలిపిన క్యాబినెట్‌ మంత్రులు ఆస్తులు మొదలుకుని అన్నీ కూడబెట్టుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు.

Courtesy Nava Telangana