సోమవారం 27.34%.. మంగళవారం 29.24%
జూన్‌లో 31వేల పరీక్షలు.. 21.58% పాజిటివ్‌
వైరస్‌ను నియంత్రించకుంటే ఇంకా పెరుగుతాయి
పరీక్షల సంఖ్యను మరింత పెంచాలి: నిపుణులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు పెరిగే కొద్దీ ఇన్ఫెక్షన్‌ బారినపడిన వారి సంఖ్యా పెరుగుతోంది. ఈక్రమంలోనే గత ఆరు రోజులుగా రికార్డు స్థాయిలో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన ప్రతి గంటకు కొత్తగా 35-40 మందికి కరోనా సోకుతోంది. వాస్తవానికి టెస్టులు పెంచేకొద్దీ పాజిటివ్‌ రేటు తగ్గాలి. కానీ తెలంగాణలో మాత్రం సేకరించిన నమూనాల్లో పాజిటివ్‌ రేటు భారీ స్థాయిలో నమోదవుతుండటం కంగారుపెట్టిస్తోంది. మంగళవారం రోజు పాజిటివ్‌ రేటు ఏకంగా 29.24కు చేరింది. అంతకుముందు సోమవారం 27.34, ఆదివారం 22, శనివారం 17, శుక్రవారం 20గా పాజిటివ్‌ రేటు నమోదైంది. ప్రస్తుతం కరోనా కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాలపై దృష్టిపెడితే తొలుత పాజిటివ్‌ రేటు పెరిగినా… తర్వాత క్రమంగా తగ్గుతుందని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. వైరస్‌ నియంత్రణకు కట్టడి చర్యలు తీసుకోకుంటే పాజిటివ్‌ రేటు మరింత పైపైకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.

ముందు పెంచి… ఆ తర్వాత తగ్గించి
మార్చి 2న తొలికేసు నమోదైనప్పటి నుంచి రాష్ట్రంలో కాంటాక్టు ట్రేసింగ్‌ కూడా విస్తృతంగా చేశారు. తొలినాళ్లలో భారీగానే నమూనాలు సేకరించి టెస్టులు చేశారు. మార్చిలో మొత్తం 97 కేసులు నమోదయ్యాయి. మర్కజ్‌ వ్యవహారంతో ఏప్రిల్‌లో 941 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 19 నాటికి రాష్ట్రంలో మొత్తం 14962 టెస్టులు చేశారు. ఆ రోజుకు 858 మంది వైరస్‌ బారినపడగా, పాజిటివ్‌ రేటు 5.73గా నమోదైంది. సూర్యాపేటలో కేసులు రావడంతో అక్కడ భారీగా కరోనా టెస్టులు చేశారు. దాంతో ఏప్రిల్‌ 20 నుంచి కరోనా పాజిటివ్‌ల ప్రైమరీ కాంటాక్టులకే టెస్టులు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ పది రోజులు నామమాత్రంగా పరీక్షలు చేయడంతో 180 కేసులే వచ్చాయి.

ఒత్తిడితో టెస్టులు పెంచారు..
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కొన్ని కాలనీలు, ప్రాంతాల్లో ఒక్కసారిగా కరోనా జడలు విప్పుకుంది. దీంతో టెస్టులు నిర్వహించాలంటూ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలపై స్థానికులు ఒత్తిడి పెంచారు. అదే సమయంలో హైకోర్టు కూడా పరీక్షల సంఖ్యను పెంచాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. ఈనేపథ్యంలో మే నెలలో 11,597 మందికి టెస్టులు చేస్తే 1,485 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఏప్రిల్‌ 19 నాటికి 5.74గా ఉన్న పాజిటివ్‌ రేటు ఒక్క మే నెలలోనే ఏకంగా 14.31కి చేరింది. లాక్‌డౌన్‌ సడలింపుతో వైరస్‌ విజృంభణ కొనసాగింది. టెస్టులు చేయడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తడంతో జూన్‌లో సర్కారు పరీక్షల సంఖ్యను పెంచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల 4 జిల్లాలో కలిపి 50 వేల పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించడంతో అప్పటి దాకా వందల్లో ఉన్న పరీక్షల సంఖ్య ఏకంగా వేలల్లోకి చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 23 వరకు 63249 టెస్టులు చేస్తే అందులో దాదాపు 50 శాతం పరీక్షలు జూన్‌లోనే జరిగాయి. దాంతో మొత్తం కరోనా పాజిటివ్‌ల సగటు 15.10కు చేరింది. ఒక్క జూన్‌లోనే 23వ తేదీ వరకు 31757 టెస్టులు చేసింది. అందులో 6855 మంది వైరస్‌ బారినపడగా, పాజిటివ్‌ రేటు 21.68గా నమోదైంది.

నేడో రేపో ఆ వివరాలు..
ఏప్రిల్‌లో కేవలం 5.9గా ఉన్న పాజిటివ్‌ రేటు మే నాటికి ఏకంగా 14.31కి చేరింది. ఈ మాసంలో అయితే 21.58గా నమోదైంది. గత ఐదు రోజులుగా పాజిటివ్‌ రేటు 22 శాతంగా నమోదైంది. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌లలో రోజుకు 2290 టెస్టులు చేసే సామర్థ్యమే ఉంది. మరో వారం పదిరోజుల్లో వాటి సామర్థ్యం పెరిగితే రోజుకు 6600 టెస్టులు చేయవచ్చు. ప్రైవేటులోని 18 ల్యాబ్‌లలో రోజుకు 2340 టెస్టులు చేయొచ్చు. 4 రోజుల నుంచి ప్రైవేటులోనూ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు సగటున 8 వేల పరీక్షలు జరిగాయని, అందులో 10ు మందికి పాజిటివ్‌ వచ్చి ఉంటుందని, నేడో రేపో ఆ వివరాలు తమ వెబ్‌సైట్‌కు వస్తాయని అధికారులు చెబుతున్నారు.

ప్రభావిత ప్రాంతాలపై దృష్టిపెట్టాలి
కరోనా కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాలపై దృష్టిపెట్టాలి. వైర్‌సకు అక్కడే బ్రేక్‌ వేయాలి. ఒక పాయింట్‌ నుంచే ఎక్కువ కేసులు నమోదైతే భయపడాల్సిన పనిలేదు. ముంబైలోని ధారావిలో పెద్ద ఎత్తున కేసులొచ్చాయి. కానీ దానిపై దృష్టిపెట్టడంతో ఇప్పుడు తగ్గాయి. అదే సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది.
– డాక్టర్‌ మాదల కిరణ్‌, హెచ్‌వోడీ, క్రిటికల్‌ కేర్‌, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌

ఇప్పుడు పెరిగినా.. తర్వాత తగ్గుతుంది
మనదగ్గర ప్రాథమికంగా తగినన్ని పరీక్షలు చేయలేదు. దాంతో వైరస్‌ వ్యాప్తి పెరిగింది. ఇప్పుడు ఇన్ఫెక్షన్‌ లక్షణాలు ఉన్నవాళ్లంతా వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. దీంతో పాజిటివ్‌ రేటు పెరుగుతోంది. ఎంత త్వరగా కరోనా పాజిటివ్‌లను గుర్తిస్తే అంత త్వరగా వ్యాప్తిని నియంత్రించవచ్చు. ఇప్పుడు పాజిటివ్‌ రేటు పెరిగినా… తర్వాత తగ్గుతుంది. పరీక్షలు విస్తృతంగా చేయాలి.
– డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి, ప్రెసిడెంట్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా

Courtesy Andhrajyothy