న్యూయార్క్‌: కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఆసియా, పసిఫిక్‌ దేశాలపై తీవ్రంగా పడనుంది. కరోనా ఆంక్షల కారణంగా ఉపాధి లేక తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో దాదాపు కోటి 10 లక్షల మంది పేదరికంలోకి జారిపోతారని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో మాంద్యం వస్తుందని, కిష్ట పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగే అవకాశముందని అభిప్రాయపడింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ 0.5 శాతం వరకు నష్టపొయే అవకాశాలు కనబడుతున్నాయని హెచ్చరించింది. గతేడాది 6.1 శాతంగా నమోదైన అభివృద్ధి 2.3 శాతానికి పడిపోచ్చని అంచనా వేసింది.

తూర్పు ఆసియా, పసిఫిక్‌ దేశాలన్ని ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోలేవని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. కర్మాగారాలపై ఆధారపడి పనిచేసే కుటుంబాలకు పెనుముప్పు పొంచివుందని తెలిపింది. థాయ్‌లాండ్‌, పసిఫిక్‌ దీవుల్లోని పర్యాటకంతో సహా.. వియత్నాం, కంబోడియాలోని ఉత్పత్తి రంగాలపై కరోనా ప్రభావం ఉంటుందని వెల్లడించింది. హెల్త్‌కేర్‌, మెడికల్‌ పరికరాలు తయారీ రంగాల్లో పెట్టుబడులు పెంచాలని సూచించింది. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన సామాన్యులకు సబ్సిడీలు ఇచ్చి ఆదురుకోవాలని కోరింది. 24 మిలియన్ల మంది మాత్రమే పేదరికం బారిన పడకుండా ఉంటారని అంచనా వేసింది. చైనాలోని 25 మిలియన్ల మందితో సహా దాదాపు 35 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలోనే ఉంటారని బ్యాంక్ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి 15 నెలల్లో 160 బిలియన్‌ డాలర్లు సహాయం అందిస్తామని వరల్డ్‌ బ్యాంకు ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు వరల్డ్‌ బ్యాంకు 14 బిలియన్‌ డాలర్ల సహాయాన్ని ఇప్పటికే ప్రకటించింది.