న్యూయార్క్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ ఇప్పట్లో ఆగేలా లేదు. కోవిడ్‌-19 వ్యాప్తి అంతకంతకు విస్తరిస్తోంది. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తాజా గణాంకాల ప్రకారం 201 దేశాలు, టెరిటరీస్‌కు ఈ మహమ్మారి విస్తరించింది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో చైనా(82,093), ఇటలీ(80,539), అమెరికా(68,334), స్పెయిన్‌ (56,188), జర్మనీ(42,288) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

వరల్డ్‌ మీటర్స్‌ ఇన్ఫో లెక్కల ప్రకారం ఇప్పటివరకు కరోనా బారిన వారి సంఖ్య ఆరు లక్షలకు చేరువ (5,97,262)లో ఉంది. వీరిలో ఐదు శాతం అంటే 23,559 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం అంటే 4,12,975 మంది ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంది. మరణాల సంఖ్య 27 వేలు దాటేసింది. ఇప్పటివరకు 27,365 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 1,33,363 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు.

ఇటలీలో మరణమృదంగం
కరోనాతో కకావికలమైన ఇటలీలో మరణాలు ఆగడం లేదు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం(మార్చి ) ఒక్కరోజే 919 మంది మృత్యువాడ పడ్డారు. అంతకుముందు రోజు (గురువారం) 712 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సగటుతో పోలిస్తే రికవరీ రేటు స్వలంగా మెరుగుపడుతుండటం ఇటలీ వాసులకు ఊరట కల్పిస్తోంది.