న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు దినకూలీల జీవితాల కాపాడేందుకు చర్యలకు ఉపక్రమించాయి. ఇంటి దగ్గర నుంచి పనిచేయించుకునే వెసులుబాటు లేని రోజువారి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని యాజమాన్యాలను మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇటువంటి కార్మికులకు నగదు బదిలీ చేయాలని యూపీ సర్కారు భావిస్తోంది.

ఎటువంటి ఉద్యోగ భద్రత లేని అసంఘటిత కార్మికులు దాదాపు 9.3 కోట్ల మంది 2017-18లో నిర్వహించిన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఎఫ్ఎస్)లో వెల్లడైంది. కోవిడ్-19 కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలంతో ఆ ప్రభావం ఎక్కువగా సామాన్య కార్మికులపై పడింది. వ్యవసాయంలో రంగంలో పనిచేస్తున్న నాన్-స్కిల్డ్ కార్మికులు 41 శాతం ఎక్కువ నష్టపోయారు. ఉద్యోగ ఒప్పందం, వేతనంతో కూడిన సెలవులు, సామాజిక భద్రత ప్రయోజనాలు ఉన్నాయా అని కార్మికులను ప్రశ్నించగా 98 శాతం అవేవి లేవని సమాధానం ఇచ్చారు. సామాజిక భద్రత ప్రయోజనాలు పొందలేదని 86 శాతం మంది చెప్పగా, వాటి గురించి అసలు తెలియదని 13 శాతం మంది కార్మికులు వెల్లడించడం గమనార్హం. ప్రావిడెండ్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ, వైద్య సంక్షరణ, మెటర్నిటీ సెలవులను సామాజిక భద్రత ప్రయోజనాలుగా సర్వేలో పేర్కొన్నారు. కరోనా లాంటి వ్యాధులు సంక్రమించినప్పుడు సామాజిక భద్రత ప్రయోజనాలను ఉద్యోగులకు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో సామాన్య కార్మికులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య కార్మికులను ఆదుకునేందుకు ఎక్కువగా నిధులు కేటాయించాలని దీన్ని బట్టి అర్థమవుతోంది. దినసరి కూలీలనే కాకుండా క్వారైంటన్, కంపెనీల మూసివేత కారణంగా ఉపాధి కోల్పోయిన వారందరినీ ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేతనాలకు ఉద్యోగాలు చేస్తున్న వారిలో కూడా 71 శాతం మందికి లిఖితపూర్వక ఉద్యోగ ఒప్పందాలు లేవు. 54 శాతం మంది వేతనాలతో కూడిన సెలవులకు 54 శాతం మంది అర్హులు కారు. 50 శాతం మంది ఉద్యోగులు సామాజిక భద్రత ప్రయోజనాలు లేవని సర్వే తేల్చింది.

కరోనా కారణంగా పతనమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహం అమలు చేయాలని ఓపీ జిందాల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇషాన్ అనంద్ అభిప్రాయపడ్డారు. పీఎం-కిసాన్, నరేగా నిధులను ముందుగానే అందజేయాలని సూచించారు. ఆధార్ తో సంబంధం లేకుండా వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు, మధ్యాహ్న భోజనం, రేషన్ సరుకులను ఇంటివద్దకే పంపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు.. ఉద్యోగులకు జీతాలతో కూడిన సెలవులు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు.