కొవిడ్‌-19కు చెక్‌ పెట్టే సురక్షితమైన, ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 పరిశోధక బృందాలు అహర్నిశలూ కృషిచేస్తున్నాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే మానవ పరీక్షల దశలో ఉన్నాయి. ఆ కొన్నింటిలోనూ యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ, అమెరికాకు చెందిన మోడెర్నా బయోటెక్‌ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్లు ముందంజలో ఉన్నాయని ప్రపం చ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. మన దేశంలో భారత్‌ బయోటెక్‌తో కలిసి ఐసీఎంఆర్‌ రూపొందిస్తున్న ‘కోవ్యాక్సిన్‌’కు మానవ పరీక్షలకు ఇప్పటికే అనుమతి వచ్చింది. అంతా అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఆ టీకా అందు బాటులోకి వస్తుందన్న ఆశాభావం ఉంది. ఇక, అంతర్జాతీయంగా ఇలా ఆశలు రేకెత్తిస్తున్న మరికొన్ని వ్యాక్సిన్లు..

ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ
ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన టీకా.. వెక్టర్‌ తరహా వ్యాక్సిన్‌. కరోనావైర్‌సపై ఉండే ప్రొటీన్‌ స్పైక్స్‌లోని జెనెటిక్‌ కోడ్‌ ఆధారంగా తయారుచేసిన వ్యాక్సిన్‌ ఇది. యూకేలో సమాంతరంగా 2, 3 దశల పరీక్షలు జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో మూడో దశగా వేలాదిమందికి ఇస్తున్నారు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఇది సురక్షితమైనదిగా భావిస్తున్నారు.

క్యాన్‌సినో
చైనాకు చెందిన క్యాన్‌సినో బయోలాజిక్స్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ కలిసి అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌.. రెండో దశ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలను ఇచ్చినట్టు సమాచారం. దీంతో, జూన్‌ 25 నుంచి ఏడాదిపాటు చైనా సైనికులకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చేందుకు ‘చైనా సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌’ అనుమతిచ్చింది. ఈ వ్యాక్సిన్‌తో కెనడాలో మానవులపై పరీక్షలు నిర్వహించడానికి అనుమతులు లభించాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ సంస్థ, అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ రెండూ ఒకే రోజు (మార్చి 16న) కరోనా వ్యాక్సిన్‌ రూపకల్పనకు నడుం బిగించాయి.

మోడెర్నా/ఎన్‌ఐఏఐడీ
అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్‌ కంపెనీ మోడెర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ కేండిడేట్‌ ‘ఎంఆర్‌ఎన్‌ఏ-1273’ ఫేజ్‌ 2 పరీక్షల దశలో ఉంది. జూలైలోనే 30 వేల మం దిపై తుదిదశ పరీక్షలను నిర్వహించనుంది.

బయోఎన్‌టెక్‌/ఫైజర్‌
జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌, అమెరికాకు చెందిన ఫైజర్‌ కలిసి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ (బీఎన్‌టీ162బీ1)పై తొలి దశ మానవ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్‌ను 24 మందికి ఇవ్వగా.. వారిలో 28 రోజుల త ర్వాత కూడా కొవిడ్‌-19 యాంటీబాడీలు అత్యధిక స్థా యిలో కనిపించాయి. తదుపరి దశలో 30 వేల మందిపై దీనిని ప్రయోగించనున్నారు. ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను పూర్తిగా అభివృద్ధి చేసి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు బయోఎన్‌టెక్‌, ఫైజర్‌ సిద్ధమవుతున్నాయి. 2021 డిసెంబరుకల్లా 120 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తారు.

ఇనోవియో.. ఐఎన్‌వో-4800
అమెరికాకు చెందిన ఇనోవియో పార్మా కంపెనీ రూపొందిస్తున్న డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ ‘ఐఎన్‌వో-480’ తొలి దశ ట్రయల్స్‌లో ఉంది. కానీ, ఈ వ్యాక్సిన్‌.. పరీక్షల్లో పాల్గొన్న వాలంటీర్లలో 94 శాతం మందిలో రోగనిరోధకవ్యవస్థను ఉత్తేజితం చేయగలిగింది. దీంతో, ఇనోవియో సంస్థ రెట్టించిన ఉత్సాహంతో ఫేజ్‌-2, 3 ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది.

ఆస్ట్రేలియా టీకా
యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌/మర్డోక్‌ చిల్డ్రన్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కలిసి అభివృద్ధి చేసిన టీకా మూడో దశ ట్రయల్స్‌ నడుస్తున్నాయి. వందేళ్లనాటి క్షయ వ్యాక్సిన్‌ ఆధారంగా రూపొందించిన టీకా ఇది. నేరుగా కొవిడ్‌-19 నిరోధానికి కాకుండా.. కేవలం రోగనిరోధక శక్తిని, రోగ నిరోధక వ్యవస్థ స్పందనస్థాయిని పెంచే వ్యాక్సిన్‌ ఇది.

జలుబు లాగానే..
కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. అది వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండేవారికి మాత్రమే అవసరమతువుందని, అందరికీ దాని ఇవ్వక్కర్లేదని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ సునేత్ర గుప్తా అభిప్రాయపడ్డారు. సాధారణ జలుబుకు మనం ఎలాగైతే భయపడమో దీని విషయంలో కూడా అలాగే ఉండాలని ఆమె సూచిస్తున్నారు.

వ్యాక్సిన్‌ తయారీ.. అంత వీజీ కాదు
భారత్‌ బయోటెక్‌తో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నట్టు భారత వైద్య మండలి ప్రకటించిన 52 రోజులకల్లా ఆ టీకా మానవ పరీక్షల దశకు వచ్చేసింది! మరో 3 నెలల్లో అందుబాటులోకి వస్తుందని భారత సంయుక్త డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఈశ్వర్‌ రెడ్డి చెప్పారు. ఇది ఎలా సాధ్యమైంది? మామూలుగా అయితే ఒక ఔషధాన్ని తయారుచేసి, మార్కెట్లో విడుదల చేయడానికి 12 ఏళ్లు.. వ్యాక్సిన్‌కైతే 8 ఏళ్లు పడుతుందని వైద్యనిపుణులు చెబుతారు. కానీ, భారత్‌ బయోటెక్‌గానీ, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృ ద్ధి చేస్తున్న టీకా ఇంత త్వరగా మానవ పరీక్షల దశ కు ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు వైద్యనిపుణులు, పరిశోధకుల సమాధానమిది.

ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌: ఈ దశలో పరిశోధకులు రూపొందించిన వ్యాక్సిన్‌ను జంతువులపై ప్రయోగిస్తారు.

ఫేజ్‌ 1: అతి కొద్ది మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు. సురక్షితమా కాదా? రోగ నిరోధక వ్యవస్థను పరిశీలిస్తారు.

ఫేజ్‌ 2: వందల మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తారు. పిల్లలు, వృద్ధులపై ఎలా ఉంటుంది? తదితర విషయాలు తెలుసుకుంటారు.

ఫేజ్‌ 3: వేలాది మందికి వ్యాక్సిన్‌ను ఇస్తారు. ఏ తరహా జన్యుసమూహాలపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతోంది? వ్యాక్సిన్‌ ఎంత సమర్థం? వంటి అంశాలపై అవగాహన వస్తుంది. కొన్నిసార్లు ఔషధ నియంత్రణ సంస్థలు మరింత భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని కోరతాయి. కానీ.. కరోనా లాంటి మహమ్మారులు విలయం సృష్టిస్తున్న సందర్భాల్లో ఔషధ నియంత్రణ సంస్థలు ట్రయల్స్‌ను వేగంగా చేయడానికి అనుమతిస్తాయి. వాటిని వేగవంతమైన పరీక్షలు(యాక్సిలరేటెడ్‌ ట్రయల్స్‌)గా వ్యవహరిస్తారు. మొదటి దశలో వాక్సిన్‌ ఎంతవరకూ సురక్షితం అనే అంశంపై, రెండో దశలో ఎంత డోసేజ్‌ ఇవ్వాలి అనే అంశంపై దృష్టి సారిస్తారు.

అత్యవసర సమయాల్లో..
ఫేజ్‌ 1: 50-100 మందిపై పరీక్షలు.. నాలుగు నెలల సమయం

ఫేజ్‌ 2: 500-1000 మందిపై పరీక్షలు.. 4 నెలల సమయం

అత్యవసర సందర్భాల్లో ఈ రెండు దశలనూ సమాంతరంగా సాగిస్తారు. ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పరీక్షలు ఇలాగే సాగుతున్నాయి. యాక్సిలరేటెడ్‌ ట్రయల్స్‌ మూడో దశలో భాగంగా వ్యాక్సిన్‌ సమర్థతను వేర్వేరు జన్యుసమూహాలపై భారీ స్థాయిలో పరీక్షలు (మాస్‌ ట్రయల్స్‌) నిర్వహిస్తారు. 3 దశలూ పూర్తయ్యాక ఫలితాలను నియంత్రణ సంస్థకు సమర్పించేందుకు 6 నెలలు పడుతుంది.

పద్ధతులు వేరైనా.. పని ఒక్కటే!
వ్యాక్సిన్‌ అని మనం నోటిమాటగా అనేస్తాం కానీ.. వ్యాక్సిన్లన్నిటినీ ఒకేరకంగా అభివృద్ధి చేయరు. తయారుచేసే విధానాన్ని బట్టి రకరకాల పేర్లతో వ్యవహరిస్తారు. పద్ధతులు వేరైనా అవి చేసే పని మాత్రం వైరస్‌ నిర్మూలన. అవేంటంటే..

జెనెటిక్‌ వ్యాక్సిన్స్‌: ఏ వైరస్‌ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్నారో ఆ వైర్‌సకు చెందిన జన్యుభాగాలను సేకరించి, వాటి ఆధారంగా తయారుచేసే వ్యాక్సిన్లను జన్యు వ్యాక్సిన్లుగా వ్యవహరిస్తారు.

వైరల్‌ వెక్టర్‌ వ్యాక్సిన్స్‌: ఒక వైరస్‌ తాలూకూ జన్యువులను వేరే వైరస్‌ ద్వారా కణాల్లోప్రవేశపెడితే.. వాటిని వైరల్‌ వెక్టర్‌ వ్యాక్సిన్స్‌ అంటారు.

ప్రొటీన్‌ ఆధారిత వ్యాక్సిన్‌: ఏ వైర్‌సను లక్ష్యంగా చేసుకుని వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారో ఆ వైర్‌స ప్రొటీన్లను/ప్రొటీన్‌ భాగాలను ఉపయోగించి రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేసే పద్ధతి.

హోల్‌ వైరస్‌ వ్యాక్సిన్స్‌: లక్ష్యిత వైర్‌సను పూర్తిగా బలహీనం చేసి (లేదా) దాన్ని అచేతనం (ఇన్‌ యాక్టివేటెడ్‌) చేసి అప్పుడు ఆ వైర్‌సను శరీరంలోకి ప్రవేశపెట్టే పద్ధతి. పోలియోను ఈ తరహా వ్యాక్సిన్‌తోనే నిర్మూలించారు.

Courtesy AndhraJyothy