నిమ్స్‌, ఈఎస్‌ఐ వైద్యుల బృందం కొత్త ఫార్ములా

హైదరాబాద్‌: ప్రస్తుతం కరోనా రోగులకు నిర్ధారణ పరీక్ష నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల దాకా ఖర్చు చేస్తోంది. పరీక్షా ఫలితం రావడానికీ 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఈనేపథ్యంలో అరగంటలోనే కొవిడ్‌-19 టెస్ట్‌ ఫలితం వచ్చే సరికొత్త ఫార్ములాను నిమ్స్‌, ఈఎస్‌ఐ ఆస్పత్రుల సంయుక్త వైద్య బృందం రూపొందించింది. ఈ పద్ధతిలో పరీక్ష చేసేందుకు రూ.400 మాత్రమే ఖర్చవుతుండగా, ఫలితం అరగంటలోనే వస్తుంది. దీనితో ఇప్పటికే 50 టెస్ట్‌లు చేశామని, మరో 200 పరీక్షలు పూర్తయిన అనంతరం భారత వైద్యపరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) అనుమతి కోసం నివేదిక సమర్పిస్తామని వైద్య బృందంలోని డాక్టర్‌ మధుమోహన్‌ తెలిపారు.

ఐసీఎంఆర్‌ ఆమోదం పొందాకే.. ఆస్పత్రి నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు. పెద్ద ల్యాబ్‌లు, భారీ ఉపకరణాల అవసరం లేకుండానే.. పరీక్షలు నిర్వహించవచ్చన్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.

పరీక్షా పద్ధతి ఇదీ..
కరోనా ఇన్ఫెక్షన్‌ అనుమానితులు, లక్షణాలు ఉన్న వ్యక్తి నుంచి శాంపిళ్లు సేకరించి మాస్టర్‌ మిక్స్‌ ఉన్న ట్యూబ్‌(కిట్‌)లో వేస్తారు. అందులో లేత ఎరుపు రంగులో ఉండే బ్రోమోఫినాల్‌ రెడ్‌/బ్లూ ద్రావణాన్ని కలుపుతారు. ఈ కిట్‌ను 60 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉన్న వేడి నీటిలో అరగంటపాటు ఉంచుతారు. శాంపిళ్లలో వైరస్‌ ఉంటే.. లేత ఎరుపు రంగులోని బ్రోమోఫినాల్‌ పసుపు రంగులోకి మారిపోతుంది. ఒకవేళ ద్రావణం రంగు మారకుంటే ఆ వ్యక్తికి వైరస్‌ సోకనట్టే.

Courtesy Andhrajyothy