• సాధారణ బిల్లు, ప్యాకేజీలకు అదనంగా వసూలు..
  • రోగికి చేసే చికిత్స, ఆపరేషన్ల ఆధారంగా చార్జీ
  • సర్జరీ చేసే వైద్యుల పీపీఈ కిట్ల ఖర్చు బిల్లులోనే!
  •  రూ.5000 నుంచి రూ. 20,000 దాకా వసూలు
  •  బస్తీల్లోని ఆస్పత్రులోనూ రూ.5-6 వేల చార్జీలు!

హైదరాబాద్‌ సిటీ : కరోనా నేపథ్యంలో కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇప్పుడు కొత్త రుసుము వసూలు చేస్తున్నారు. రోగికి శస్త్రచికిత్స చేయడానికి వాడే గ్లవ్స్‌కు అయ్యే ఖర్చును బిల్లులో కలిపినట్టే.. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నుంచి రక్షణకు వైద్యులు వాడుతున్న పీపీఈ కిట్ల తాలూకూ ఖర్చును కూడా రోగుల బిల్లులోనే కలుపుతున్నారు. సాధారణంగా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేసే వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలకు నిర్ణీత ప్యాకేజీ రుసుము వసూలు చేస్తారు. దానికి ఈ బిల్లు అదనం. చేసే చికిత్సను బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా ఇలా వసూలు చేస్తున్నారు.

సర్జరీలో పీపీఈ కిట్లు…
ఒక సర్జరీ చేయాలంటే ఆపరేషన్‌ థియేటర్‌లో ముగ్గురు నుంచి పది మంది వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఇప్పుడు ఆపరేషన్‌ సమయంలో ఉండే ప్రతి ఒక్కరూ తప్పని సరిగ్గా పీపీఈ కిట్లు ధరిస్తున్నారు. ఇలా సర్జరీలో ఎంత మంది పాల్గొంటే అందరి పీపీఈ కిట్ల చార్జీలను లెక్కకట్టి ఆస్పత్రి వర్గాలు రోగి బిల్లులో వేస్తున్నాయి. ఆపరేషన్‌ను బట్టి ఈ మొత్తం మారుతుంటుంది. ఉదాహరణకు.. ఫైబ్రాయిడ్‌ చికిత్సకు రూ.70 వేల నుంచి 80 వేల వరకు సాధారణ బిల్లు అయితే దానికి అదనంగా పది వేలు కలుపుతున్నారు. యాంజియోగ్రామ్‌కు అదనంగా రూ.16  వేలు, ఇతర హృద్రోగ సర్జరీలకు రూ.20 వేలు, ల్యాప్రోస్కోపిక్‌కు అయితే రూ.15 వేలు, ఆర్థో సర్జరీలకు రూ.10 వేలు వసూలు చేస్తున్నారు.

ఐసీయూలో కూడా...
అత్యవసర విభాగం నుంచి ఐసీయూకు తరలించే రోగులను పరీక్షించడానికి వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాల్సి వస్తుంది. అక్కడ కూడా ఈ చార్జీలను అదనపు బిల్లులో కలుపుతున్నట్లు సమాచారం. రోగి వద్దకు ఎంత మంది వైద్యులు, నర్సులు, సిబ్బంది వెళ్తే అన్ని పీపీఈ కిట్ల చార్జీ వేస్తున్నారు.

ఐసోలేషన్‌ చార్జీ
కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానం ఉంటే.. రోగినిఐసోలేట్‌ చేస్తున్నారు. నిర్ధారణ పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకూ వారిని అక్కడే ఉంచుతున్నారు. ఇందుకు రోజుకు దాదాపుగా రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులో చేరినా.. రోగికి కరోనా పరీక్షలను ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయిస్తారు. పరీక్ష ఉచితమే అయినా.. నమూనాలను అక్కడికి తీసుకెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చు, ఇతరత్రా చార్జీల పేరిట రూ.రెండు-మూడు వేల రూపాయిలను బిల్లులో కలుపుతున్నారు. ఇక, కొన్ని ఆస్పత్రుల్లో బిల్లులను నేరుగా పీపీఈ కిట్ల కోసం వసూలు చేసినట్లు కాకుండా అదనపు చార్జీగా చూపిస్తున్నట్లు సమాచారం.

ఇతరత్రాసేవల పేరుతో ఈ చార్జీలను వసూలు చేస్తున్నారు. పేరొందిన ఆస్పత్రుల్లోనే కాదు.. బస్తీలు, కాలనీలో ఉండే నర్సింగ్‌హోమ్‌లు, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా పీపీఈ కిట్ల పేరుతో అయిదారు వేల రూపాయలను అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రసవాలు చేసే నర్సింగ్‌ హోమ్స్‌లో వీటిని తప్పని సరి చేశారు.

రోగి భద్రత కోసమే
కరోనా ముప్పు నేపథ్యంలో అత్యవసర రోగుల విషయంలో అప్రమత్తత తప్పదు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ప్రతి దశలోనూ వారిని కాపాడాల్సి ఉంటుంది. ఇందుకు వారి గదిని తరచూ శానిటైజ్‌ చేయాలి. అత్యవసర విభాగం, ఐసీయు, ఆపరేషన్‌ థియేటర్లలో ఎంత మంది సిబ్బంది ఉంటే అంతమందీ తప్పనిసరిగా పీపీఈ కిట్లు వినియోగించక తప్పట్లేదు. ఇది ఆస్పత్రులకు అదనపు భారమే. ఎంత వరకు పీపీఈ కిట్లు వినియోగించామో, అంత మేరకు చార్జీలు వసూలు చేయకతప్పట్లేదు. ప్రస్తుతం రోజుకు 3-4 అత్యవసర ఆపరేషన్లు మాత్రమే నిర్వహిస్తున్నాం.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రి వైద్యుడు

Courtesy Andhrajyothi