-ఊపిరి ఆడటం లేదు..
– వెంటిలేటర్‌ పెట్టట్లేదు
– మొన్న మనోజ్‌.. నేడు రవి
– కోవిడ్‌ ఆస్పత్రుల్లో సర్కారు నిర్లక్ష్యం

హైదరాబాద్‌: కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఏం జరుగుతున్నది? అక్కడి పేషెంట్లకు అందుతున్న చికిత్స ఏంటీ? రోగులకున్న సౌకర్యాలు ఏపాటివి? పేషెంట్ల వెంట అటెండెంట్లూ లేరు. అన్నీ తామై ఆస్పత్రి సిబ్బందే చూసుకోవాలి. అలా చూస్తున్నారా…నిర్లక్ష్యం వహిస్తూ, పేషెంట్ల ప్రాణాలు హరిస్తున్నారా? మొన్న గాంధీ ఆస్పత్రిలో జర్నలిస్ట్‌ మనోజ్‌ మాటలు, నేడు ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో మరో కరోనా వైరస్‌ బాధితుడు రవి వీడియో సందేశం అనేక ప్రశ్నల్ని, అనుమానాలనూ లేవనెత్తుతున్నాయి. వీరిద్దరూ తమ ఆవేదనను బాహ్యప్రపంచానికి చెప్పి, మరణించినవారే. వైద్యుల సేవలు గొప్పగా ఉన్నా, సర్కారు వైఫల్యాలు ఆయా ఆస్పత్రులకు చెడ్డ పేరును తెస్తున్నాయి.

శ్వాస అందట్లేదు.. వెంటి లేటర్‌ పెట్టమని మూడు గంటల పాటు రవి అనే కరోనా రోగి ప్రాధే యపడితే, సిబ్బంది పట్టించుకోలేదు. ఫలితంగా ఆ వ్యక్తి తన తండ్రికి వీడియో సందేశం పంపి, కన్నుమూ యడం దురదృష్టం. వారి మరణవాంగ్మూలా లకూ విలువలేకుండా పోవడం మరింత బాధాకరం. ”నాకు ఊపిరి ఆడటం లేదు డాడీ.. వద్దన్నా వినకుండా ప్రభు త్వ ఆస్పత్రిలో చేర్పించారు. మూడు గంటలుగా బతిమిలాడుతున్నా సిబ్బంది వెంటిలేటర్‌ పెట్టడం లేదు. గుండె ఆగిపోతుంది. చనిపోతున్నా.. ఇక బారు డాడీ” అంటూ కరోనా పాజిటివ్‌ యువకుడు తన తండ్రికి వీడియో సందేశంలో ఆస్పత్రిపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ మృతి చెందాడు.

ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌ నగరంలోని ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రిలో ఆదివారం జరిగింది. నగరంలో జవహార్‌నగర్‌లోని బీజేఆర్‌ నగర్‌కు చెందిన ఓ యువకునికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఈ నెల 24న ఎర్రగడ్డ లోని చెస్ట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 26న ఆస్పత్రి సిబ్బంది వెంటిలేటర్‌ను తొలగించారు. వెంటిలేటర్‌ను తొలగించొద్దని రోగి వేడుకున్నా వారు వినలేదు. తనకు ఊపిరి ఆడటం లేదనీ, వెంటి లేటర్‌ పెట్టాలని మూడు గంటల పాటు సిబ్బందిని బతిమిలాడాడు. ఇక చేసేదేమీ లేక తన బాధంతా ఆ వ్యక్తి తన తండ్రికి వీడియో సందే శం పంపించాడు.

‘గుండె ఆగిపోతుంది.. ఇక నా వల్ల కావడం లేదు.. బారు డాడీ’ అంటూ కన్నుమూశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అటు వైద్యులతోపాటు ప్రభుత్వంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులను సరిగా చూసుకోవడం లేదని జర్నలిస్టు మనోజ్‌ తన ఆవేదనను వాట్సాప్‌ ద్వారా తన స్నేహితులకు చెప్పాడు. ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది కోవిడ్‌ రోగులను పట్టించుకోవడం లేదంటూ గాంధీ ఆస్పత్రిలోని దుస్థితిని వీడియోలతో సహా మనోజ్‌ బయటపెట్టాడు. ఐసీయూలో కూడా పరిస్థితులు సరిగా లేవనీ, ఆక్సిజన్‌ కూడా పెట్టడం లేదనీ, తనను ప్రయివేటు ఆస్పత్రికి తరలించాలని కోరుతూ తన సన్నిహితులతో చాట్‌ చేశాడు. అప్పట్లో మనోజ్‌ చాటింగ్‌ సోషల్‌ మీడియాలో వైరలైంది. ప్రస్తుతం అలాంటి మరో ఘటన చోటు చేసుకోవడంతో అసలు సర్కారు కోవిడ్‌ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వైద్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సరైన వైద్యం అందించాం: మహబూబ్‌ఖాన్‌, ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌
మృతుడికి మేం సరైన వైద్యం అందించాం. అతడికి గుండె, ఊపిరి సంబంధిత సమస్యలున్నాయి. దీంతో పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఇందులో ఆస్పత్రి నిర్లక్ష్యం ఏమీ లేదు. వెంటిలేటర్‌ పెట్టలే దనడం అవాస్తవం.

Courtesy Nava Telangana