నాగరిక అంతఃపరిశీలనకు ఇది సమయం. రానున్న నెలల్లో ఆకలి పెరుగుతుంది, ఉద్యోగాలు తగ్గుతాయి, పిల్లలు పాఠశాలల నుంచి పనిలోకి నెట్ట బడతారు, పేద ప్రజలు బెడ్లు, వెంటిలేటర్లులేని ఆస్పత్రుల్లో మరణిస్తారు. పేద ప్రజలకు ఏమీ లేకుండా చేసి వెళ్ళగొట్టిన సామాజిక నేరంలో మన సమిష్టి బాధ్యత ఉందని అంగీకరిస్తామా? ఈ వైఫల్యంతో మనం క్షేమంగా ఉంటామా? హీనస్థితికి దిగజారిన మన నైతిక కేంద్రీకరణను మనం గుర్తిస్తామా? చివరకు మనం సంఘీభావం, సమానత్వం, సమన్యాయం పాఠాలను నేర్చుకుంటామా?

వేదనా భరితమైన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కాలం, పేద శ్రామికుల నుంచి ఎడబాటైన ప్రత్యేక హక్కులు, ప్రయోజనాలు కలిగిన ప్రజల గురించి అనేక ఇబ్బందికరమైన నగసత్యాలు మన ముందుంచింది. ఆ నగసత్యాలు, ఈ ప్రజలు అసాధారణంగా అసమానతలతో సౌకర్యవంతంగా ఉంటున్న సమాజం గురించి తెలియ చేశాయి. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ప్రవచించిన మన రాజ్యాంగంలోని ఆధునికత, అభ్యుదయ, సమానత్వ విలువలు పైపై పూతల లాగా కనిపించేవిగా మిగిలి ఉన్నాయి.

ఈ వ్యాసకర్తనైన నేను రచించిన, ”లుకింగ్‌ అవే: ఇనీక్వాలిటీ, ప్రిజుడిస్‌ అండ్‌ ఇన్‌ డిఫరెన్స్‌ ఇన్‌ ఇండియా” అనే రచనలో, భారతీయ ధనిక, మధ్య తరగతి వర్గం ప్రపంచంలో కష్టాలను, బాధలను పట్టించుకోని వర్గంలో ఉన్నారని వివరించాను. ఈ ధనిక, మధ్య తరగతి వర్గ ప్రజలు ఇంకా కులం, వర్గ క్రూరత్వాలలో చిక్కుకొని అన్యాయం, బాధలు, కష్టాలను చూసి ముఖాలు పక్కకు తిప్పుకొని పోతున్నారు. పేద ప్రజలు మన మనస్సాక్షి, స్పృహ నుంచి వెలివేయబడిన విషయం గురించి నేను రాసాను. ఈ వెలివేత నిస్సందేహంగా ఎంత క్షమించరానిదో ఈ లాక్‌డౌన్‌ బహిర్గత పరిచింది. మధ్య తరగతి కుటుంబాలలో పెరిగిన ఏ యువకునికైనా పేద ప్రజలు ప్రతీచోటా, ప్రతీసారి కనిపిస్తారు. కానీ మన ప్రతీ అవసరాన్ని తీర్చే సేవకులుగా ఉన్న ఆ పేదలు, వారి అవసరాలలో మాత్రమే మనుషులుగా కనిపిస్తారు. ఈ మధ్యతరగతి యువకులకు, ఈ పేదలు తమ సహ విద్యార్థులుగా, సహౌద్యోగులుగా, లేక పనిలో పోటీదారులుగా, లేదా ఆట స్థలాలు, సినిమా థియేటర్లలో స్నేహితులుగా మాత్రం తెలియదు.

కరోనా వైరస్‌ మహమ్మారి మనను దెబ్బ తీసినప్పుడు, పేద కార్మికులను వైరస్‌ను వ్యాపింపజేసే ప్రమాదకారులుగా మనం పరిగణించాం. మనం వారిని మన దగ్గరకు చేరకుండా దూరంగా ఉంచాం. మనలను అపాయంలోకి తీసుకొని పోయింది పేద ప్రజలు కాదనే వాస్తవాన్ని మనం పట్టించుకోలేదు. కానీ, పేద ప్రజలు మన వద్దకు వచ్చినప్పుడు వారిని అపాయంలోకి నెట్టి వేసింది మనం. విమానయాన టిక్కెట్లు కొనుగోలు చేయగలిగిన పెద్ద వారే మన భారతదేశానికి కొత్త కరోనా వైరస్‌ను తీసుకొని వచ్చారు.

ప్రపంచంలో అతి పెద్ద, అత్యంత వేదనా భరితమైన, అత్యంత తక్కువ ఉపశమన ప్యాకేజీ పొందిన లాక్‌డౌన్‌ను మనం స్వాగతించాం. మనందరం ఇంట్లో తలుపులు బిగించుకొని, సురక్షితంగా ఉన్నామని అనుకున్నాం. ఇంటి పనులు చేసేవారు లేక కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నాం. కానీ, మన సంక్షేమం కోసం ఇష్టపూర్వకంగానే సర్దుకుపోయాం. ఇంటి నుంచే పని చేయడానికి కూడా సర్దుకుపోతే మన జీతాలు, పొదుపులు మనను గట్టెక్కించాయి. పంపు కింద వచ్చే నీటితో మనం ప్రతీ రోజు చేతులు శుభ్రం చేసుకున్నాం. ఖరీదైన ఆస్పత్రుల్లో మన వైద్యానికి అయ్యే ఖర్చు మన ఆరోగ్య భీమా చెల్లిస్తుంది కాబట్టి, మనకు ఏ ఇబ్బందీ లేదు. మనం అప్పుడప్పుడు ఏమిచేయాలో తోచక, నిరాశా నిస్పహలకు గురయ్యాం. కానీ అదే సమయాన్ని, మనం మన కుటుంబ బంధాలను పునర్నిర్మించుకోడానికి కూడా ఉపయోగించుకున్నాం.

లాక్‌డౌన్‌ మిలియన్ల సంఖ్యలో ఉన్న పేద కార్మికుల జీవితాలపై ఒక ఉల్కాపాతంలా పడినప్పుడు మనం ఉదాసీనంగా ఉన్నాం. ఇంతకు ముందు ప్రభుత్వ సహాయం లేకుండానే వారు పూర్తిగా వారి వత్తుల్లో ఉన్నారు. కొన్ని సంవత్సరాలు వనరులు సరిగాలేని చోటఉండి, గ్రామీణ ప్రాంతాల్లో కుల అణచివేత, పేదరికం నుంచి తప్పించుకునేందుకు వారు చాలా దూరం ప్రయాణించి వచ్చారు. పట్టణ ప్రాంతాలు వారి రాకను ఆహ్వానించలేదు. ప్రభుత్వం వారికి తల దాచుకునేందుకు ఏ విధమైన ఇండ్లు ఏర్పాటు చేయలేదు, కార్మికులుగా వారి హక్కులకు రక్షణ కల్పించలేదు. దానికి బదులుగా వారికి ప్రతికూలంగా, విరుద్ధంగా ఉండి, మురికివాడల్లో ఉన్న వారి చిన్న చిన్న గుడిసెలు, రోడ్డు పక్కన ఉన్న బడ్డీకొట్లను అక్రమంగా కూల్చి వేశారు. అన్యాయంగా వ్యవహరించి, వారి గురించి పట్టించుకోకున్నా మిలియన్ల సంఖ్యలో ఉన్న పేద కార్మికులు తమ సమస్యలను అధిగమించి, పట్టణాలను తీర్చిదిద్ది, వారి కుటుంబాలను నిలబెట్టుకున్నారు.

లాక్‌డౌన్‌ రాత్రికిరాత్రే వారు నిలబెట్టుకున్న జీవితాలను నాశనం చేయడం తప్ప, వారికి ఒనగూర్చిందేమీ లేదు. భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా రక్షణ పొందడం అనేది బాగా మురికిగా ఉండే, రద్దీగా ఉండే మురికి వాడల్లో అసాధ్యమైన విషయం. ప్రభుత్వ విధానం ద్వారా వారి జీవనోపాధిని నాశనం చేయడంతో, వారు పట్టణాలకు వచ్చేటప్పుడు తప్పించుకున్న ఆకలిని నేటి కష్టకాలంలో భరించేందుకు వారిపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ఇంత జరిగినప్పటికీ ప్రభుత్వం చెప్పిన విధంగా మన మధ్య తరగతి వర్గాలు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి, ఆనందంగా వంటపాత్రలు మ్రోగించడం ద్వారా లాక్‌డౌన్‌కు మద్దతు తెలియజేసాం.

అనేక మంది స్త్రీ, పురుషులు భారంగా నడుస్తూ, సైకిళ్ళ పైన తమ స్వగ్రామాలకు ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తూ, రైలు పట్టాలపై చనిపోతూ, ఆహారం, నీళ్ళులేక ఆకలితో, నీరసంగా రైళ్ళలో ప్రయాణం చేసే వారంతా 15-30ఏండ్ల మధ్య వయస్సులో ఉన్నవారన్న విషయం గమనంలో ఉంచుకోవాలి. వారు పొరపాటున పేదలుగా పుట్టినారు కానీ, లేకుంటే వారు కూడా ఉన్నత పాఠశాల లేక యూనివర్సిటీలో ఆన్‌లైన్‌ విద్యను అభ్యసించడం లేదా వారి సురక్షితమైన ఇండ్ల నుంచి పని చేసుకోవడం, మితిమీరిన నెట్‌ ఫ్లిక్స్‌ వల్ల అలసట, అసహనంతో పోరాడి ఉండే వారు.

పక్షపాతం: ప్రభుత్వ సిగ్గుమాలిన వర్గ పక్షపాతం మమ్ముల్ని ఏ మాత్రం ఇబ్బంది కలిగించలేదు. అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, అనేక మంది ప్రయివేటు రంగంలోని సంఘటిత ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారు. లాక్‌డౌన్‌ కాలానికి వారికి పూర్తి జీతాలు పొందారు. పేదలు రెండు రోజుల వేతనాలకు మించని కొద్దిపాటి ఆర్థిక సహాయం పొందాల్సి వచ్చింది. ప్రధానమంత్రి వేతనాలు చెల్లించాలని యాజమాన్యాలను కోరినారు. ప్రతిరోజు పేదలు వండిన ఆహారం కోసం బారులు తీరిన లైన్లలో గంటల పాటు నిలబడాల్సి వచ్చింది. అవసరమైనవి లేని చోటులోకి తోసి వేయడం, అప్పుడప్పుడు చేసే దానాలు పొందడంలో పేదలు అవమానించబడే విధానం ఉనికిలో ఉండే విధంగా ఒత్తిడి చేస్తున్నారు. అదేవిధంగా మనం మన ఇండ్లల్లో లేదా అద్దె హౌటల్‌ గదుల్లో సౌకర్యవంతంగా క్వారంటైన్‌లో ఉంటుంటే, మరొక వైపు పేద ప్రజలను బలవంతంగా కిక్కిరిసిన గదుల్లో ఉంచుతున్నారు. అక్కడ స్నానాలు చేసేందుకు వీలులేని బాత్రూమ్‌లు, తినడానికి వీలులేని విధంగా ఆహారం ఉంటుంది. వాటిని పేదలు జైళ్ళుగా పరిగణిస్తారు.

తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళాలనుకొనే వలస కార్మికుల పైన పాలకవర్గాలు క్రూరత్వాన్ని ప్రదర్శించాయి. విదేశాల్లో ఆగిపోయిన ప్రజలకు, హాస్టల్లోని విద్యార్థులకు, యాత్రికులకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులు, విమానాలను ఏర్పాటు చేసింది. వలస కార్మికుల విషయంలో రైళ్ళు, బస్సులను రద్దుచేసి, రాష్ట్ర సరిహద్దులను కూడా పూర్తిగా మూసి వేశారు. మిలియన్ల సంఖ్యలో వలస కార్మికులు భారమైన నడకతో, లేదా సైకిళ్ళపైన (పిల్లలను తోపుడు బండ్లలో పెట్టి) వందల కిలోమీటర్ల ప్రయాణం మొదలు పెట్టారు. అనేక మంది మార్గమధ్యంలో నీరసంతో, లేదా ప్రమాదంలో మరణించారు. చివరికి ప్రభుత్వం కొద్ది సంఖ్యలో రైళ్ళను అనుమతించింది. మూకుమ్మడి ఆగ్రహం వ్యక్తం చేసేంత వరకు వలస కార్మికులు రవాణా చార్జీలు చెల్లించ వలసి వచ్చింది. కానీ తరువాత సంక్లిష్టమైన నియమ నిబంధనలను విధించారు. ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, అధికారికంగా అభ్యంతరాలు లేవని ధృవీకరణ పొందాల్సి వచ్చింది. రైలులో సీటు దొరకడం అంటే లాటరీలో గెలవడం లాంటిది, ఈ సమాచారం ఆన్‌లైన్‌లో వచ్చేది. స్మార్ట్‌ఫోన్లులేని కార్మికులు మళ్ళీ తిరిగి, సహాయం నిరాకరించిన కాంట్రాక్టర్ల వద్దకు వెళ్ళి, ఈ గందరగోళంలో ఒక అంగీకారాన్ని కుదుర్చుకున్నారు. రైళ్ళు తరచుగా రద్దయ్యేవి, లేదా దారి తప్పేవి. దారిలో ఆహారం, నీళ్ళు లేవు. కొంత మంది ప్రయాణంలో డీహైడ్రేషన్‌, ఆకలితో మరణించారు.

బస్సులు కొంత వరకు మేలు. ప్రయివేట్‌ సంస్థలు బాగా లాభపడినాయి. అవినీతి బాగా పెరిగింది. బస్సులపైన కూర్చొని ప్రయాణం చేసినాగానీ వలస కార్మికుల నుంచి వేల రూపాయలు వసూలు చేశారు. కిక్కిరిసిన బస్సుల్లో, ట్రక్కుల్లో భయానక ప్రయాణాలు చేసిన తర్వాత కొంత మంది రోగ క్రిముల నిరోధక రసాయనాలలో తడిసిపోయిన సంఘట నలు ఉన్నాయి. అనేక చెక్‌పోస్ట్‌ల వద్ద అధికారులు లంచాలు డిమాండ్‌ చేశారు, కార్మికులు కొన్ని సందర్భాల్లో విమాన ప్రయాణ చార్జీల కన్నా ఎక్కువ మొత్తంలో రవాణా చార్జీలను చెల్లించారు. గ్రామాల్లో ఇటీవల కాలం వరకు కుటుంబానికి అన్నీ సమకూర్చిన వలస కార్మికులు ఇంటికి వచ్చేందుకు కుటుంబ సభ్యులను డబ్బు కోసం అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు మళ్ళీ భారీగా కొత్తగా అప్పులు చేశారు.

ప్రభుత్వాలు, వ్యాపారస్తులు వారికేమీ సహాయం చేయలేదు. కార్మికులు వెళ్ళడం వారికి ఇష్టంలేదు కాబట్టి, వారిని ఏ మాత్రం పట్టించుకోలేదు. సేవా దక్పథంతో గానీ, మానవతా దక్పథంతో గానీ వారిని మానవులుగా కూడా చూడలేదు. వారు తిరిగి తమ సంస్థలను పునఃప్రారంభించి నప్పుడు ఒక్క పిలుపుతో వినయంగా అందుబాటులో ఉండే ఉత్పత్తి చేసే కూలీలు అనే దష్టితోనే వారిని చూశారు.

చివరకు కేంద్ర ప్రభుత్వం విమానాలను అనుమతించా లని నిర్ణయించినప్పుడు, ప్రయాణానికి ముందు క్వారంటైన్‌ తరువాత ఆరోగ్య ధృవీకరణ పత్రం ‘ఆచరణ సాధ్యం’ కాదని కేంద్రమంత్రి (కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్‌పైన ఒత్తిడి చేసినప్పటికీ) అన్నారు. అన్ని వనరులున్న విమాన ప్రయాణి కులకు ఆచరణ సాధ్యంకాని దానిని, సామాజిక పెట్టుబడి లేకుండానే పేద కార్మికులు తప్పనిసరిగా పాటించాలట.

నాగరిక అంతఃపరిశీలనకు ఇది సమయం. రానున్న నెలల్లో ఆకలి పెరుగుతుంది, ఉద్యోగాలు తగ్గుతాయి, పిల్లలు పాఠశాలల నుంచి పనిలోకి నెట్ట బడతారు, పేద ప్రజలు బెడ్లు, వెంటిలేటర్లులేని ఆస్పత్రుల్లో మరణిస్తారు. పేద ప్రజలకు ఏమీ లేకుండా చేసి వెళ్ళగొట్టిన సామాజిక నేరంలో మన సమిష్టి బాధ్యత ఉందని అంగీకరిస్తామా? ఈ వైఫల్యంతో మనం క్షేమంగా ఉంటామా? హీనస్థితికి దిగజారిన మన నైతిక కేంద్రీకరణను మనం గుర్తిస్తామా? చివరకు మనం సంఘీభావం, సమానత్వం, సమన్యాయం పాఠాలను నేర్చుకుంటామా?

హర్షమందిర్‌
”ద హిందూ” సౌజన్యంతో
అనువాదం :బోడపట్ల రవీందర్‌

Couretsy NavaTelangana