లాక్‌డౌన్‌ నుంచి గట్టెక్కేందుకు తాకట్టు
రూ.వేలల్లో కరెంటు బిల్లులు, మూణ్నెల్ల ఇంటద్దె భారం
బ్యాంకుల ఈఎంఐలు, డ్వాక్రా రుణాల కిస్తీల లొల్లి
ఆన్‌లైన్‌ క్లాసులతో ఫీజుల మోత

కరీంనగర్‌: మూన్నెళ్ల లాక్‌డౌన్‌ కష్టాలు జూన్‌మాసంలో ఒక్కసారిగా సామాన్యుడి నెత్తిమీదపడ్డాయి. రూ.వందల్లో వచ్చే కరెంటు బిల్లులు రూ.వేలల్లో రావడం, వాయిదా పద్ధతిలోనైనా అద్దె కట్టాలని ఇంటి యజమానులు ఒత్తిళ్లు చేయడం, బ్యాంకులు మారటోరియం ఎత్తేయడంతో ఈఎంఐల టెన్షన్‌.. వెరసి సామాన్యుడి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. డ్వాక్రా కిస్తీలలొల్లి ఇంకా కొనసాగుతుండగా చీటిడబ్బుల కోసం నిర్వాహకుల వేధింపులెక్కువయ్యాయి. సందట్లో సడేమియా అన్నట్టు ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట ఫీజుల మోతమోగిస్తున్నారు.

లాక్‌డౌన్‌తో ఆర్థికరంగం కుదేలై ఎందరో ఉద్యోగాలు కోల్పోవడంతో చేతిలో చిల్లిగవ్వలేక పేద, మధ్య తరగతివాసులు విలవిల్లాడిపోతున్నారు. కొంతమంది ఇంట్లో దాచుకున్న బంగారాన్ని బ్యాంకుల్లో కుదవకు, మార్వాడి కొట్టుల్లో తాకట్టు పెడుతున్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్ర శివారు అల్గునూర్‌కు చెందిన మల్లయ్యకు చెందిన రెండు గదుల ఇంటికి రూ.2340 కరెంటు బిల్లు వచ్చింది. ప్రతినెలా రూ.200దాటని బిల్లు మూన్నెళ్లకు కలిపి యావరేజీ పేరుతో యూనిట్‌స్లాబ్‌ పెంచి రూ.2వేలకుపైగా రావడంతో కంగుతినడం మల్లయ్య వంతైంది.

కరీంనగర్‌ జిల్లాలోని 3,48,732 కరెంటు సర్వీసులు ఉన్న ఇండ్లల్లో ప్రతినెలా 100యూనిట్లలోపు విద్యుత్‌ వాడుకుని రూ.200చెల్లించే కుటుంబాలే సగానికిపైగా ఉన్నాయి. వారందరికీ ఒక్కసారిగా వచ్చిన రూ.2వేల నుంచి రూ.3వేల వరకు కరెంటు బిల్లులు మోయలేని భారంగా మారాయి. దీనికితోడు మూన్నెళ్ల ఇంటి అద్దె ఒక్కసారే కట్టాలని, లేదంటే వాయిదా పద్ధతిలో అయినా ఇవ్వాలని యజమానుల ఒత్తిళ్లు తోడయ్యాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో సగటు ఇంటి కిరాయి రూ.4వేల నుంచి రూ.6వేల మధ్య ఉంది. ఈ లెక్కన మూన్నెళ్ల అద్దె రూ.15వేలవుతోంది.

ఆస్తి పన్ను వసూళ్లూ ఇప్పుడే..
మున్సిపాలిటీ సంఖ్య, పరిధి పెంచుకున్న ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పక్కనబెట్టి ఆస్తిపన్నుల వసూలుకు శ్రీకారం చుట్టింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట సహా కొత్త మున్సిపాలిటీలు చొప్పదండి, కొత్తపల్లిలో పన్ను వసూళ్లు ముమ్మరం చేసింది. ఏయేటికాయేడు మున్సిపల్‌ బడ్జెట్‌ను పెంచుతూ వస్తున్న ప్రభుత్వం నికరంగా ఆస్తిపన్ను వసూళ్లపైనే దృష్టి సారించింది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఈ ఏడాది 2020-21 బడ్జెట్‌ రూ.230కోట్లుగా రూపొందించగా అందులో రూ.41.30కోట్లు ఆస్తిపన్ను రాబడి కింద లెక్కగట్టింది. మార్చిలోనే మొదలుపెట్టిన ఆస్తిపన్ను వసూళ్లను జూన్‌ మొదటివారంలో మరింత వేగిరం చేసింది.

ఉన్నవే కట్టలేరు.. రుణాలిస్తూ మళ్లీ వడ్డా..?
లాక్‌డౌన్‌ రోజుల్లోనూ బ్యాంకులు డ్వాక్రా రుణాల కిస్తీలను ముక్కుపిండి వసూలు చేశారు. చేతిలో చిల్లిగవ్వలేక, బయట అప్పులూ పుట్టక కిస్తీలు కట్టేందుకు నానాఆగచాట్లు పడ్డారు. ఇప్పుడు కరోనా కారణంగా వ్యాపారాలు, జీవనోపాధి దెబ్బతిని ఇబ్బందు లు పడుతున్న స్వశక్తి సంఘాలను గుర్తించి మెప్మా ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేస్తున్నారు. కోవిడ్‌ సువిధ, కోవిడ్‌ రిలీఫ్‌, కోవిడ్‌ మహిళా నేస్తం, క్రెడిట్‌ లోన్‌ పేరుతో కరీంనగర్‌ జిల్లాలోని మున్సిపాలిటీల్లో 6,582 సంఘాలకు రూ.50వేల చొప్పున మంజూరు చేస్తున్నారు. ఒక్కో సభ్యురాలికి వచ్చేది రూ.5వేలే అయినా దానికి నెలకు రూ.600చొప్పున కిస్తీ కట్టాలని బ్యాంకర్లు చెబుతున్నారు.

మారటోరియం పెంచాలి
బ్యాంకుల్లో తీసుకున్న రుణాల చెల్లింపునకు మారటోరియం మరో ఆర్నెళ్లు పొడిగించాలి. ఇప్పుడిప్పుడు మార్కెట్‌ కుదుటపడుతుంది. మామూలు స్థితికి రావాలన్నా మరో ఆర్నెళ్లు పట్టేలా ఉంది. ఇంటి, షాపు అద్దెలు కట్టేందుకు అయినా ప్రభుత్వం సాయం చేయాలి.
– నరేష్‌, మెకానిక్‌ షెడ్డు నిర్వాహకుడు, ఆటోనగర్‌

ఆస్తిపన్ను మాఫీ చేయాలె
లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయాం. ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. ఈ సమయంలో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు మాఫీ చేయాలే. డ్వాక్రారుణాల చెల్లింపునకు గడువు పెంచాలే. కరోనా సాయం కింద కనీసం రూ.20వేల వరకైనా రుణాలు ఇవ్వాలే.
– శంకర్‌, ఆర్టీసీ కార్మికుడు, భగత్‌నగర్‌

Courtesy NavaTelangana