కరోనా మహమ్మారిపై బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందనలు సమాజంపై కలిగించే ప్రభావాలను, ప్రముఖ ఆర్థికవేత్త ప్రొ.జయతీ ఘోష్‌ నెంబర్‌ 13′కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు …

నెంబర్‌ 13 : కరోనా-19 ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది?
జయతీ ఘోష్‌: కరోనా వైరస్‌ -19 తరువాత పరిస్థితి ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ సమయంలో అది ఎంత కాలం పాటు, ఎలావ్యాప్తి చెందుతుంది అనేది అస్పష్టంగా ఉంది. కానీ, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య స్థూల ఆర్థిక విధానాల ప్రతి స్పందనలలో తేడాలు ఉన్నాయి కాబట్టి, ఇది అసమానత లను పెంచబోతుంది అనేది స్పష్టం. అమెరికా, యూకే, అనేక యూరోపియన్‌ దేశాలు, జపాన్‌ లాంటి దేశాలు పెద్ద ఎత్తున ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాయి. కాబట్టి ఈ దేశాలు, మిగిలిన అనేక దేశాల్లో సంభవించిన విధంగా గాఢమైన మాంద్యాన్ని ఎదుర్కొనవు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించ లేదు. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రమే పెద్ద ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. భారతదేశం లాంటి దేశాలు దాదాపుగా ఏ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా దేశం మాంద్యం దిశగా అడుగులేయడాన్ని మనం గమనిస్తున్నాం .

నెం.13 : భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన కరోనా -19 ప్రభావం ఏ విధంగా ఉంటుంది?
జయతీ ఘోష్‌: భారతదేశంలో కరోనా-19 ప్రభావం పెద్దగా లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ విధానాల ప్రభావం ఉంది. వారు వైరస్‌ను నిందించడం ఆపేయాలి. ఈ పరిస్థితికి కరోనా వైరస్‌ కన్నా, ఆర్థిక వ్యవస్థను, ఉపాధిని, జీవనోపాధిని నాశనం చేసిన ప్రభుత్వ అనాలోచిత ‘లాక్‌డౌన్‌’ ప్రకటనే ప్రధాన కారణం .

నెం.13: ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన చర్యలపై మీ కామెంట్స్‌?
జయతీ ఘోష్‌: నేను వాటిని ఉద్దీపన చర్యలు అని కూడా అనను. నిలువరించడానికి వీలులేని విధంగా పడిపోయిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు ఆ చర్యలు ఉద్దేశించబడాలి. కానీ అవి ఏ మంచీ చేయలేదు. జీవనోపాధిని కోల్పోయిన వారి చేతిలో డబ్బు ఉంచి, ప్రతి ఒక్కరికి ఆహారాన్ని సమకూర్చడం మన ముందున్న తక్షణ కర్తవ్యం. తక్షణమే 80శాతం కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి నెలకు 10కేజీల చొప్పున ఆరు నెలలు ఇవ్వగలిగిన కనీసం 50 మిలియన్‌ టన్నుల మిగులు ఆహారధాన్యాల నిల్వలు మనకు ఉన్నాయి. అదే విధంగా 80శాతం కుటుంబాల్లో, ప్రతి కుటుంబానికి నెలకు రూ.7 వేల చొప్పున నగదు బదిలీ చేయాల్సింది. ఈ పేద ప్రజలు పని చేయడానికి ప్రభుత్వం అనుమతించక పోవడం వల్ల తమ ఆదాయాలను కోల్పోయారు. కాబట్టి వాటిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ప్రజలు ఇంత వరకు ఏ విధమైన సహాయాన్ని ఆదాయ రూపంలో పొందలేదు.

నెం.13: భారతదేశంలో పేద ప్రజలను, నిస్సహాయులను వదిలించుకోవడానికి కరోనా వైరస్‌-19ను ఉపయోగించు కుంటున్నారా?
జయతీ ఘోష్‌: ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందో వివరించడం కష్టం. క్రూరత్వం, కనికరం లేకపోవడం, ఇంకా పరహింసా ప్రకోపితానందం (సాడిజం) ఉన్నాయని అంటాను. ఈ ప్రపంచంలో ప్రజలకు ‘లాక్‌డౌన్‌’ ప్రకటనకు ఐదు గంటల ముందు నోటీసు ఇచ్చిన దేశం ఏదీలేదు. మనకు కొన్ని నగరాల్లో, కొన్ని రాష్ట్రాల్లోనే పది మరణాలు, కొన్ని పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ముందు నోటీసు ఇవ్వకుండా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించడం అనవసరమైన చర్య. ప్రజలు తమ సొంత ఇండ్లకు వెళ్ళేందుకు, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోడానికి వారం రోజుల ముందుగానే ప్రకటించి ఉండాల్సింది. ఆ విధంగా జరిగి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కష్టాలు, బాధలు, దురవస్థలతో పాటు ఆర్థిక సంక్షోభాలు కూడా తక్కువగా ఉండేవి.

నెం.13: వలస కార్మికుల సంక్షోభ పరిష్కారానికి భారత ప్రభుత్వం ఇంకా ఏ విధంగా బాగా చేసి ఉండాల్సింది?
జయతీ ఘోష్‌: మనకు కేరళ ఉదాహరణలు ఉన్నాయి. వాస్తవంగా కేరళ అప్పటికే ప్రాంతాల వారీగా పరిమితులు విధించింది. ప్రారంభంలో కేరళ ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తూ, రక్షణ కల్పిస్తూ, కొంత ఆదాయాన్ని సమకూరుస్తూ వచ్చింది. కేరళ ముఖ్యమంత్రి 20వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పుడు, పై చర్యలన్నీ ఆ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. అక్కడ వలస కార్మికులకు కేరళ ప్రభుత్వం ఆదాయాలను సమకూరుస్తూ వచ్చింది. పని చేయడానికి అవకాశంలేని కాలానికి ఆహారాన్ని కూడా సమకూర్చింది. అది కేంద్ర ప్రభుత్వం చేసి ఉండాల్సిన కనీస మౌలిక కర్తవ్యం. ఈ పని చేయలేక పోతున్నామని ప్రభుత్వం తెలుసుకున్నప్పుడైనా, వలస కార్మికులను తమ స్వస్థలాలకు పంపేందుకు రవాణా ఏర్పాట్లు చేయాల్సింది. అనేక దేశాల్లో ఈ చర్యలను ప్రభుత్వాలే చేపట్టినాయి. ఇలాంటి చర్యలు మన దేశంలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే చేపట్టారు.

నెం.13: ప్రభుత్వ ప్రతిస్పందనలో పరహింసా ప్రకోపితానందం (సాడిజం) గురించి మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది? దానికి ఓట్ల సమస్య లేదా?
జయతీ ఘోష్‌: ఇప్పటి నుంచి ఆరు నెలల్లో ఎన్నికలు ఉండి ఉంటే ప్రతి విషయం భిన్నంగా ఉండెడిది. కానీ వారికి ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉందని తెలుసు. ఎన్నికలు వారికి పెద్ద సమస్యే కాదు, ప్రజలు దేన్నైనా మరచిపోతారని వారికి తెలుసు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు తరువాత వారు విమర్శలను తప్పించుకున్న తీరు దాన్ని ధృవపరిచింది. వారు ప్రజలను మోసం చేస్తారు. ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని వారికి తెలుసు. మీడియా, వాస్తవాలను తెలుసుకోవడంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్న కారణంగా ఆర్థిక వ్యవస్థ, కరోనా వ్యాధి రెండూ ఒక భయంకరమైన మార్గంలో వెళ్తుండడం దురదృష్టకరం. వాటిని (ఆర్థికవ్యవస్థ, వ్యాధి) భయపెట్టడం, మోసం చేయడం లేదా మాయచేయడం కుదరదు. కానీ పాలకులు ఈ చర్యలన్నీ ప్రజలపై ప్రయోగించగలరు. ప్రజలను భయపెట్టి, జైళ్ళలో నిర్భంధించ గలరు. కరోనాను అదుపు చేయగల, ఆర్థిక వ్యవస్థను నిర్వహించగల సామర్థ్యం ఈ ప్రభుత్వానికి లేదు.

నెం.13: ఈ సంక్షోభం మరిన్ని అసమానతలకు దారి తీస్తుందా?
జయతీ ఘోష్‌: చాలా భారీగా అసమానతలు పెరుగుతాయి. ఇది ఇప్పటికే ఉన్న వర్గ విభజనను, అసమానతలను దృఢ పరిచి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వ్యాధి అదుపు చర్యలు మధ్య తరగతి, ఉన్నత వర్గాల ప్రజలు మాత్రమే ఆచరించ గలుగుతారు. పట్టణాల్లోని మురికి వాడల్లో, గ్రామాల్లో ఊరికి దూరంగా నివసిస్తున్న ప్రజలు భౌతిక దూరాన్ని పాటించలేరు. ఉపాధిని కోల్పోవడం అనేది అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులతో పాటుగా ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, మహిళలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇప్పటికే ఉనికిలో ఉన్న భ్రంశ రేఖలన్నీ (ఫాల్ట్‌ లైన్స్‌) మరింత తీవ్రమయ్యాయి.

నెం.13: ఈ సమస్యలపై ప్రభుత్వ విధానాలను మీరు పరిశీలిస్తున్న తీరు పట్ల ప్రభుత్వం తన ఉదాసీనతను కొనసాగిస్తుందని మీరు అనుకుంటున్నారా?
జయతీ ఘోష్‌: నేను ఈ ప్రభుత్వాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నాన్ని వదిలేశాను. వారు ద్వేషపూరితంగా ఉంటూ, ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నారని విశ్వసించడం ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వం గురించి చెప్పగలం. ప్రభుత్వం ముందుగా తన విధానాలను ప్రకటించినప్పుడే నేను నమ్మలేదు. ఈ ఆర్థిక వ్యవస్థకు ఏదో అపాయకరమైన పరిస్ధితులను సృష్టించే తలంపు ఈ ప్రభుత్వానికి ఉందని నాకు తెలుసు. ఆ సమయంలో కూడా వారు ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారని ఊహించలేదు. వారు ఏదో ఒకటి చేస్తారని అనుకున్నాను. కానీ వారు ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి ఏమీ చేయలేదు. వారు ఆ విధంగా చేయడానికి నిర్లక్ష్యవైఖరి, ధైర్యం కూడా అవసరం.

నెం.13: తమ స్వగ్రామాలకు వెళ్లిన అనేక మంది ప్రజలు, ముఖ్యంగా వలస కార్మికులు పట్టణాలకు తిరిగి రావడం లేదు. ఎందుకంటే పట్టణాల్లో వారికి ఏ విధమైన లాభం కలగడం లేదు. ఈ పరిస్థితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేస్తుందని మీరు అనుకుంటున్నారా?
జయతీ ఘోష్‌: ప్రభుత్వం స్పందించిన తీరుపైనే ఏదైనా ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకు ప్రభుత్వం కేటాయింపులను పెంచి, డిమాండ్‌కు తగిన విధంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని అనుమతించి ఉండి ఉన్నట్లైతే, ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను అనుమతించి, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పునరుద్ధరణకు గాను వాటికి తగిన ప్యాకేజీని సమకూర్చి ఉన్నట్లైతే, అప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలిగేది. వలసలంటే సంతోషించే విషయం కాదు. కుటుంబాన్ని పిల్లలను, తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉండటం, వారు లేని సమయంలో తమ తల్లిదండ్రులను కోల్పోవడం సరదా విషయం కాదు. కానీ ప్రజలు నిరాశా, నిస్ప్రహల్లో ఉండటం వల్ల వలస వెళ్లుతున్నారు. కానీ మనం మౌలిక సామాజిక ఒప్పందాన్ని బద్దలు కొట్టాం. ఒక వలస కార్మికుడిగా, రాత్రికి రాత్రే నీవు నీ ఉపాధిని కోల్పోయావు, నీ నష్టపరిహారం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. నీకు రక్షణ లేదు, నీకు నీ స్వస్థలానికి తిరిగి వెళ్ళడాన్ని మేము అడ్డుకుంటాం. ఆ రకమైన ద్రోహం వల్ల, పట్టణ ప్రాంతాల్లో పని చేయడానికి తిరిగి వెళ్ళడం క్షేమం అని కొద్ది మంది మాత్రమే భావిస్తారు.

నెం.13: తీసుకోవాల్సిన స్వల్ప, దీర్ఘకాలిక చర్యలను సూచిస్తారా?
జయతీ ఘోష్‌: స్వల్ప కాలంలో, తక్షణమే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పునరుద్ధరించాలి. అంటే మనం ఇప్పటి వరకూ డబ్బులేని ప్రజల చేతుల్లో డబ్బు ఉంచాలి. అది అసంఘటితరంగ కార్మికులందరికీ వర్తించాలి. వారికి నెలకు రూ.7 వేలు చెల్లించాలి. కుటుంబంలో ప్రతి వ్యక్తికి నెలకు 10 కేజీల చొప్పున కనీసం ఆరు నెలలు ఆహార ధాన్యాలను అందించాలి. యువకులందరినీ ఏ విధమైన పనిదినాల పరిమితి లేకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులకు అనుమతించాలి. పని దినాల పరిమితి లేకుండా ఏ యువకుడినైనా, తాను చేయగలిగిన పని చేయడానికి అనుమతించాలి. అదే విధంగా పట్టణ ఉపాధిహామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలి.

ప్రభుత్వం సంపద పన్నును కూడా విధించవచ్చు. జనాభాలో ఒకశాతంగా ఉన్న ఉన్నత వర్గాల వారి సంపద పైన 4శాతం పన్ను విధించవచ్చు. వారసత్వ పన్నును ప్రవేశ పెట్టడం, బహుళ జాతి కంపెనీలకు పన్నులు విధించడం కూడా జరగాలి. బహుళజాతి కంపెనీలు భారతదేశంలో పన్నులు చెల్లించకుండా ఉండడంలో సఫలీకృత మౌతున్నాయి. ఫేస్‌బుక్‌, గూగుల్‌, అమేజాన్‌ ఇతర సంస్థలు తమ లాభాలను భారతదేశం బయటకు పంపుతున్నాయి కాబట్టి ఆ సంస్థలు దాదాపు పన్నులు చెల్లించవు.

కరోనా వైరస్‌ ఒక మహమ్మారి. ఇంకా ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని మనకు తెలుసు. కాబట్టి అటువంటి విపత్తులను ఎదుర్కోడానికి ప్రభుత్వ ఖర్చును పెంచాలి. అదే విధంగా మన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పెట్టుబడులను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మనకు తగిన సంఖ్యలో ఆరోగ్య కార్యకర్తలు లేరు. ఆరోగ్య సంరక్షణ కోసం సరిపోయేన్ని పెట్టుబడులు లేవు. వాటన్నింటి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయానికి మనం ప్రయత్నాలు చేయాలి. దురదృష్టవశాత్తు, ఈ ప్రభుత్వం ‘ఇది మన భారతదేశం’ అనే సామాజిక అంగీకార భావనను కలిగించ లేదు. ఏదో ఒక రూపంలో దానిని తిరిగి తీసుకుని వచ్చేంతవరకు ఈ దేశం పునరుద్ధరించబడదు.

నెం.13: ఈ తరుణంలో పౌర సమాజం యొక్క కర్తవ్యం ఏమిటి?
జయతీ ఘోష్‌: మన పని మనను చేసుకోమని చెప్పే ప్రభుత్వాన్ని అనుమతించే బదులుగా, పౌర సమాజం ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేయాలి. ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణ ఒక మౌలిక సమస్య. ప్రజలను గందరగోళ పరచడం, మోసం, భయకంపితులను చేయడం, బలహీను లను గాయపరచడం ద్వారా ఆర్థిక పునరుద్ధరణ జరుగదు. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని, విపత్తుల నుంచి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పౌర సమాజంగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం మన బాధ్యత.

నెంబర్‌ 13′ సౌజన్యంతో
అనువాదం: బోడపట్ల రవీందర్‌

Courtesy Nava Telangana