మానసిక ఆరోగ్యంపై లాక్‌డౌన్‌ ప్రభావం

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం దేశంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎక్కువవుతున్నట్టు ఇండియన్‌ సైకియాట్రీ సొసైటీ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. లాక్‌డౌన్‌ తర్వాత మానసిక సమస్యలకు సంబంధించిన నిపుణులను సంప్రదించేవారి సంఖ్య 50 శాతం పెరిగిందని పేర్కొంది. కేసుల సంఖ్య కూడా 20 శాతం పెరిగినట్టు తెలిపింది. ఐసోలేషన్‌, సామాజిక దూరం, ఉద్యోగాల్లో అనిశ్చితి, కరోనా వైరస్‌ సోకుతుందేమోననే భయం, ఆందోళన దీనికి కారణమని సైకియాట్రీ సొసైటీ సర్వేలో తేలింది. ప్రాక్టో వెబ్‌సైట్‌లో సైకియాట్రీ నిపుణుల వద్ద ఆన్‌లైన్‌ కన్సల్టేషన్‌ కోసం సంప్రదించేవారి సంఖ్య వారంలో రెట్టింపు అయింది. మెట్రో నగరాలతోపాటు, ఇతర పట్టణాల్లో కూడా ఈ కేసులు పెరుగుతున్నట్టు సర్వే పేర్కొంది. ముఖ్యంగా 21-30 ఏళ్ల మధ్య వయసున్నవారు ఎక్కువగా మానసిక సమస్యల గురించి ఆరాతీస్తున్నారు. తర్వాత 60 ఏళ్లు, అంతకు మించిన వయసున్నవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. మొత్తంగా మానసిక సమస్యల గురించి సంప్రదిస్తున్నవారిలో 74 శాతం పురుషులు, 26 శాతం మహిళలు ఉన్నారు. మెట్రో నగరాల్లో గడచిన రెండువారాల్లో వీరి సంఖ్య 80 శాతం పెరిగినట్టు ప్రాక్టో వెల్లడించింది. నగరాల విషయానికొస్తే… ఎక్కువగా న్యూఢిల్లీ, తర్వాత బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌, కోల్‌కతా, చెన్నైల నుంచి ఎక్కువగా సంప్రదిస్తున్నారు. ఒంటరితనం, ఆందోళన, ఒత్తిడి, వైరస్‌ సోకే అవకాశాల గురించి ఎక్కువమంది ప్రశ్నలు అడుగుతున్నట్టు సర్వే పేర్కొంది.

Courtesy Andhrajyothi