– లాక్‌డౌన్‌ కారణంగా 50 శాతం మంది తల్లిదండ్రుల తిప్పలు
– సాధారణ వైద్య సేవలూ అందడం లేదు : ‘క్రై’ నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ : ఐదేండ్లలోపు చిన్నారుల ఎదుగుదలకు పౌష్టికాహారం చాలా అవసరం. అది వారిలో రోగ నిరోధకశక్తి పెరగడానికి దోహదపడుతుంది. కానీ దేశంలో కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించలేకపోతున్నారు. లాక్‌డౌన్‌తో బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం, దుకాణాలు కూడా మూసిఉండటంతో.. దాదాపు 50 శాతం మంది తల్లిదండ్రులు వారి బిడ్డలకు రోగనిరోధక శక్తిని పెరగడానికి తమకు తగినన్ని సేవలు అందుబాటులో లేవని తెలిపారు. ఈ మేరకు చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు (క్రై) అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సుమారు 1,200 మంది కుటుంబాలను వెబినార్‌ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఈ వివరాలు సేకరించినట్టు క్రై తెలిపింది.

నివేదికలో పేర్కొన్న అంశాలిలా ఉన్నాయి. ఉత్తర భారత్‌లో 63 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కొనుగోలు చేసే సేవలు తమకు అందుబాటులో లేవని తెలిపారు. దేశవ్యాప్తంగా చూస్తే ఈ సంఖ్య సుమారు 50 శాతంగా ఉంది. ఇక కరోనాతో తలెత్తిన ఆరోగ్య సంక్షోభం కారణంగా సాధారణ వైద్య సేవలు సరిగా లేనందున.. తమ పిల్లలకు వైద్య సదుపాయాలు అందలేదని 27 శాతం మంది తెలిపారు. ఈ తరహా కంప్లెయింట్లు ఉత్తర భారతం నుంచి 31 శాతం ఉండగా.. దక్షిణ భారతదేశంలో 21 శాతం ఉన్నాయి. ఇక కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూసేయడంతో దాని ప్రభావం చిన్నారుల చదువు మీద పడిందని 77 శాతం మంది చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా పిల్లల ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిందని 88 శాతం మంది తల్లిదండ్రులు వివరించారు. వారిలో 43 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌లో పిల్లలు ఏం వెతుకుతున్నారు..? అనేదానిమీద ఓ కన్నేసి ఉంచామని తెలిపారు.

Courtesy Nava Telangana