సంగిరెడ్డి హనుమంత రెడ్డి

ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు యజమాని కాళ్లూచేతులు విరిగాయి. పూజచేయించి, నిమ్మ, మిరపకాయలు కట్టుకున్నా ప్రమాదమెలాజరిగింది? అవి చేయకపోతే మనిషే పోయేవాడని జవాబు. నేటి ప్రభుత్వ చర్యలు, ఫలితాలు ఇలాంటి దిష్టిచర్యలే.

మే 28కి గుజరాత్‌ కొవిడ్‌ రోగులు 15,575 మంది, చికిత్స పొందుతున్నవారు 6602, కోలుకున్నవారు 8003, మృతులు960, మరణాలు 6.17శాతం. 1,98,047 పరీక్షలు జరిగాయి. కరోనా బాధిత రాష్ట్రాల్లో గుజరాత్‌ది 2వ స్థానం. 65లక్షల జనాభా గల అహ్మదాబాద్‌లో 11,344 కేసులు, 780 మరణాలు. సగటున రోజుకు 250మందికి కోవిడ్‌ సోకుతోంది. రాష్ట్రంలోని 74శాతం కేసులు, 80శాతం మరణాలు ఈ నగరంలోనే జరిగాయి. పేదలప్రాంతాల్లో కరోనా ఉధతమైంది. గోడలు కట్టి ట్రంప్‌కు మురికి వాడలు కనిపించకుండా చేశారు. కానీ కరోనా కండ్లు కప్పలేకపోయారు. పరీక్షలు, కరోనా వాహకుల, రోగుల గుర్తింపు, గృహనిర్బంధ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైంది. విజరు రూపాణి వెంటిలేటర్ల బదులు కృత్రిమ శ్వాసయంత్రాలు కొన్నారు. వడోదర, సూరత్‌, ఆనంద్‌, మెహసానా, ఖేడా నగరాల్లోనూ కరోనా ప్రబలింది. ”రాష్ట్రం మునుగుతున్న టైటానిక్‌ ఓడ. ఆసియాలో పెద్దదైన అహ్మదాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి చెరసాల కంటే దారుణం. వెంటిలేటర్లులేక ఎక్కువ మంది చనిపోయారు. ప్రయివేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సగం పడకలు కరోనా రోగులకు కేటాయించండి. ఆస్పత్రిలో ఏం జరుగుతోందో ఆరోగ్యమంత్రికి తెలియదు.” అది హైకోర్టు ధర్మపీఠం వ్యాఖ్యానించింది.

రెండు నెలల దేశబందీ తర్వాత హైకోర్టు ఆదేశాలివ్వ వలసిరావడం విచారకరం. ఇది మొదటి ఆదేశం కాదు. ఇప్పటికి 11 ఆదేశాలిచ్చింది. ఇవన్నీ సుమోటో కేసులు, 15 ప్రజావ్యాజ్యాలు, 10 అభ్యర్థనల ఆధారంగా ఇచ్చిన ఆదేశాలు. ఇది లాభాల వ్యాపార సమయం కాదు. ప్రయివేటు ఆస్పత్రుల పరీక్ష రుసుము నియంత్రించండని మే 15న, అతిక్రమించిన ఆస్పత్రులపై నేరచర్యలు తీసుకొమ్మని మే 22న, వలస కార్మికులు కోవిడ్‌తో కాక ఆకలితో చచ్చేట్టున్నారని ప్రభుత్వం కచ్చిత ప్రణాళికలు చేపట్టాలని ధర్మపీఠం ఆదేశించింది. 28న ఆ న్యాయపీఠాన్ని ప్రధాన న్యాయమూర్తి విక్రంనాథ్‌ ఆధ్వర్యలోకి మార్చడం అలవాటైన విచిత్రం.

ప్రపంచమంతా కరోనా కట్టడిలో ఉండగా గుజరాత్‌ ‘నమస్తే ట్రంప్‌’, రాజ్యసభ ఎన్నికల్లో స్థానాలు సాధించే పనుల్లో మునిగింది. అహ్మదాబాద్‌ మోతేరా స్టేడియంలో ట్రంప్‌-మోడీలు ఫిబ్రవరి 24న 1.25 లక్షల మందితో ప్రసంగించటానికి ఏర్పాట్లు జరిగాయి. జనవరి నుంచి మొత్తం యంత్రాంగం ఈ పనిలో ఉంది. అహ్మదాబాద్‌ ఆస్పత్రి రోగులు బస్‌ స్టాండ్‌లో శవాలుగా మారుతున్నారు. కోవిడ్‌ రోగులు ఈ ఆస్పత్రి ముందు భర్తీ కోసం గంటలకొద్దీ కూడు నీళ్ళు లేక పడిగాపులు కాస్తున్నారు. ఆస్పత్రిలో చనిపోయిన రోగుల సమాచారం బంధువులకు 10, 12 గంటల తర్వాత అందుతోంది. శవాల నగలు, నగదు, ఫోన్లు, గడియారాలు మాయమౌ తున్నాయి. వైద్యసిబ్బంది కొరత ఎక్కువ. వ్యక్తిగత రక్షణ పరికరాలూ కొరతే. గత రెన్నెళ్లలో100 మంది వైద్యులకు కొవిడ్‌ సోకింది. సీనియర్‌ డాక్టర్లు రోగభయంతో కరోనా చికిత్స చేయలేదు. ముఖ్యమంత్రి, ఆరోగ్యమంత్రి నితిన్‌ పటేల్‌ల భేదాభిప్రాయాలు రోగవ్యాప్తి కారణాల్లో ప్రధానం. పదేండ్ల క్రితమే ”అభివృద్ధి రాష్ట్రం”గా ప్రచారమై, మోడీ ప్రధాని కావటానికి కారణమైన గుజరాత్‌లో నేటిస్థితీ, గతీ ఇది. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి 30న కోవిడ్‌-19ను అంతర్జాతీయ ఆరోగ్య ఆత్యయిక పరిస్థితిగా ప్రకటించింది.

మార్చి 6-22 మధ్య అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో 6,000 మంది ప్రయాణీకులు దిగారు. రైళ్లు, బస్సుల్లో వచ్చేవారిపై నిఘాలేదు. మార్చి 24 అర్థరాత్రి నుంచి దేశబందీ ప్రకటించారు. ఫిబ్రవరి 24-మార్చి 31 మధ్య శాసనసభ 26సార్లు సమావేశమైంది. మార్చి 13న శాసనసభ వాయిదావేయమని కాంగ్రెస్‌ కోరింది. 23 వరకు శాసనసభ జరిగింది. రోగుల సంఖ్య ఉధృతంగా పెరిగినా కరోనా పరీక్షలు తగ్గాయి. ప్రయివేట్‌ ప్రయోగశాలల్లో పరీక్షకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేశారు. అనుమతి ఇవ్వటంలో జాప్యం జరుగుతోంది. దీనపై వైద్యుల సంఘం హైకోర్టులో ప్రజావ్యాజ్యం వేసింది. రోగులు పరీక్ష కోసం రోజుల తరబడి నిరీక్షించాలి. వెంటిలేటర్ల మీది రోగులూ వారం రోజులు పరీక్ష లేకుండా ఉన్నారు. పరీక్ష జరిగిన వారానికి ఫలితాలు వస్తాయి. ఈ లోపు పలువురు రోగులు మరణించారు. రోగుల సంఖ్య తగ్గించి చెప్పడం ప్రభుత్వ ఉద్దేశమేమో! భావనగర్‌ వైద్యుని అక్రమ బదిలీకి నిరసనగా 11మంది రాజకోట్‌ ప్రభుత్వ వైద్యులు రాజీనామా చేశారు. దేశ కరోనా సమస్య పరిష్కార యంత్రాంగం ఈ రాష్ట్రానికే చెందిన కేంద్ర గృహమంత్రి అమిత్‌ షా అధీనంలో ఉంది. ప్రతిపక్ష రాష్ట్రాలకు పర్యవేక్షకులను పంపే అమిత్‌ షా సొంతరాష్ట్రంలో అహ్మదాబాద్‌ను ఎందుకు పట్టించుకోరు?

తన 13ఏండ్ల పాలనలో ముఖ్యమంత్రి మోడీ అబివృద్ధి, దేశభక్తి, జాతీయత ముసుగులో కార్పొరేట్‌ అనుకూల నిరంకుశత్వ పాలన సాగించారు. గుజరాత్‌లో ఇప్పటికీ మరుగుదొడ్లులేని ఇండ్లున్నాయి. కార్మికుల జీవన ప్రమాణాలు, జీతభత్యాలు, కొనుగోలుశక్తి తక్కువ. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లులేవు. ఇవన్నీ ఆరోగ్యహీనతకు కారణం. మానవాభివృద్ధి సూచీలో గుజరాత్‌ స్థానం 21. గుజరాత్‌ ప్రజారోగ్యం అధ్వాన్నం. కొవిడ్‌ మరణాల్లో 60శాతం గుండెవ్యాధులు, మధుమేహం, రక్తపోటు రోగులవే. ఆరోగ్య వ్యవస్థ ప్రయివేట్లపరం. 84.9శాతం బాహ్యరోగులు, 73.8శాతం ఆస్పత్రి రోగులు ప్రయివేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లక్ష మందికి 143 ఆస్పత్రి పడకలు, 123 మంది వైద్యులు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత మరణాలు 34శాతం, శిశు మరణాలు 43శాతం. 2016లో రోగనిరోధక వ్యవస్థ 50.4శాతం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గుజరాత్‌ స్థానం 36. శిశు పోషకాహార సమస్య అతితీవ్రంగా ఉంది. ఎదుగుదల తక్కువ పిల్లలు 38.5శాతం, కృశించిన పిల్లలు26.4శాతం, బరువు తక్కువ పిల్లలు 39.3శాతం. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సంఖ్యలు వరుసగా 29శాతం, 34శాతం, 32శాతం. గత దశాబ్దంలో ప్రజల్లో స్థూలకాయం, అధికబరువు, క్షయ, నిరుద్యోగం, పేదరికం పెరిగాయి. సామాజిక సూచీలు పతనమయ్యాయి. ఎక్కడ ప్రభుత్వ రంగం బలహీనంగా ఉంటుందో, రాజ్యం సామాజిక ప్రయోజనాల కోసంకాక వ్యాపార, అధికారవర్గాల ప్రయోజనాల కోసం పనిచేస్తుందో అక్కడ వైరస్‌ విజంభణ, ప్రజావినాశం జరుగుతాయి.

మోడీ ప్రతి పనికి ఒక లక్ష్యం, ప్రతి దుర్లక్ష్యంలో ఒక ప్రయోజనం ఉంటాయి. గుజరాత్‌ నిర్లక్ష్యరహస్యం ఏమిటో? మా సమయస్ఫూర్తి, సమర్థ చర్యల వల్ల కరోనా ఆగింది. లేకుంటే పెరిగేది అనటం దిష్టియంత్ర ఛాందస సూత్రం. బీజేపీ ప్రత్యామ్నాయ నాయకుల్లో కొందరు భౌతికంగా, కొందరు మానసికంగా మరణించారు. షా సంపూరకమే. ప్రతిపక్షాలు గుణపాఠాలు నేర్చుకోలేదు. గుజరాత్‌ నమూనా పాఠం, గుణపాఠం సామాన్యులకు అర్థమైతే పోరాడగలరు. మార్పుకు యత్నించగలరు. ఇప్పుడు ప్రజా చైతన్యమే కర్తవ్యం.

Courtesy Nava Telangana