అమరావతి: కరోనా వైరస్‌ గాలి ద్వారా సోకదని, తుమ్మినా, దగ్గినా తుంపర్లు కొంచెం ఎక్కువ దూరం పోతాయని మాత్రమే చెబుతున్నారని కోవిడ్‌ ప్రత్యేక అధికారి డాక్టర్‌ ప్రభాకరరెడ్డి తెలిపారు. గాలి ద్వారా సోకితే ఇప్పటికే రాష్ట్రంలో సగం మందికి వ్యాపించేదని ఆయన పేర్కొన్నారు. అటువంటి ప్రచారాన్ని నమ్మొద్దని వివరించారు. అనవసర ప్రచారం వల్ల ప్రజల్లో భయం పెరుగుతుందని వివరించారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులనూ పెంచుతున్నామని, ఎక్కువ మందికి వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఆస్పత్రుల్లో అన్ని రకాల సదుపాయాలూ ఉన్నాయని, ఇంకా బెడ్ల సంఖ్యను పెంచుతున్నామన్నారు. ప్రతి జిల్లాలో కోవిడ్‌ కేర్‌ సెంటర్ల పేరుతో వెయ్యి పడకలను సిద్ధం చేశామన్నారు. వీటిని అవసరమైతే ఇంకా పెంచుతామని తెలిపారు. అదే సమయంలో కోవిడ్‌ వచ్చిన వారు ఇళ్లవద్దే ఉండి చికిత్స పొందే పద్దతికి అలవాటు పడాలని సూచించారు. వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకుంటారని, ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని వివరించారు. మరణాల సంఖ్య తక్కువగా ఉందని, మైల్డ్‌ కేసుల్లో హోం క్వారంటైన్‌ ముఖ్యమని తెలిపారు. మొత్తం రోగుల్లో 50 శాతం మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని, ఇంకా ఎక్కువగానే రికవరీలు ఉంటాయని తెలిపారు.

పాజిటివ్‌ అనుమానం ఉన్న వారు ప్రతి ఒక్కరూ టెస్టు చేయించుకోవచ్చని చెప్పారు. దీనివల్ల భయం తొలగడంతోపాటు ముందుగానే గుర్తిస్తే వ్యాప్తిని చాలా వరకూ నియంత్రించినట్లవుతుందని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. హోం క్వారంటైన్లో ఉన్న వారికి చుట్టుపక్కల వారూ సహకరించాలని, అవమానంగా చూడొద్దని పేర్కొన్నారు. అందరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలంటే వైద్యులపై ఒత్తిడి పెరుగుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ప్రభాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Courtesy Prajasakti