కొవిడ్‌ కష్టకాలంలో వ్యాపారుల దందాలు
కరోనా ప్రాణాధార మందులు బ్లాక్‌
కొవిఫర్‌ ఇంజక్షన్‌ ధర రూ.5,400
బ్లాక్‌ మార్కెట్లో అమ్మేది రూ.30 వేలకు
టొసిలిజుమాబ్‌ రూ.2 లక్షల దాకా
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు ఇవే కీలకం
ఆక్సిజన్‌ సిలెండర్లూ నల్లబజార్లో
కొవిడ్‌ బీమా చాటున సైబర్‌ నేరాలు
ప్లాస్మా దానం చేస్తామంటూ మోసాలు
ప్రభుత్వాసుపత్రుల నుంచి షిఫ్టింగ్‌ దందా
ప్రాణాపాయమంటూ రోగులకు గాలం
బార్‌ కోడ్‌తో బ్లాక్‌ మార్కెటింగ్‌కు చెక్‌

హైదరాబాద్‌: అసలే కరోనా కష్టకాలం… ప్రతీ ఒక్కరి జీవితంలో ఇది పరీక్షా సమయం…. అయినా, లాక్‌డౌన్‌ అమలు చేసిన మూడు నెలలూ దేశమంతా మానవత్వం పరిమళించింది. చిన్నా పెద్దా తమకున్నంతలో ఒకరినొకరు ఆదుకున్నారు. మన జీవితకాలంలో ఎరుగని ఉదారత్వం వెల్లువెత్తింది. డబ్బు వెంట పరుగులు తీయడం ఆగిపోయింది. పిట్‌పాకెటర్లు, గొలుసు దొంగలు, ఇళ్లు దోచేవారు కూడా అస్త్ర సన్యాసం చేసి ఇంట్లో కలొగంజో తాగి బతికేస్తున్నారు. మరోపక్క నిన్నటిదాకా నిక్షేపంగా కనిపించిన కుటుంబాలు కొవిడ్‌ దాడితో కుప్పకూలిపోతుంటే, మనవంతు రాకుండా జాగ్రత్త పడటంలోనే నిమగ్నమైపోయాం. ఇంతటి విషాదం, నిర్లిప్తత ఆవహించిన విపత్కర పరిస్థితుల్లోనూ కొన్ని రాబందులు ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకొని తెగబడ్డాయి.

బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారులు, మెడికల్‌ మాఫియా, సైబర్‌ నేరగాళ్ల రూపంలో మరింత రెచ్చిపోయి, అందిన కాడికి దోచుకుంటున్నాయి. ప్రపంచ ఔషధాల హబ్‌ అయిన తెలంగాణలో ప్రజలు బ్లాక్‌ మార్కెట్‌లో మందులను కొనాల్సి వస్తోంది. కొవిడ్‌కు తప్పకుండా పని చేస్తాయని భావిస్తున్న మందులన్నీ నల్లబజారుకు తరలిపోవడంతో ప్రాణపాయ స్థితికి చేరిన కొవిడ్‌ రోగి బతకాలా? వద్దా? అనేదాన్ని డబ్బు, పరపతినిర్ణయించే పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారికి వాడే కోవిఫర్‌ మందు మన హైదరాబాద్‌లోనే తయారవుతుంది. ఎమ్మార్పీ ధర రూ.5400 అయితే, దాన్ని దక్కించుకోవాలంటే పాతిక నుంచి ముప్పయి వేలు సమర్పించుకోవాలి. రూ.40,500 ధర ఉండే 400 ఎంజీ టొసిలిజుమాబ్‌ డోసు కోసం లక్షన్నర నుంచి రెండు లక్షలు వెచ్చించాలి. ఈ రేట్లకు కూడా మంత్రులు, ఆస్పత్రి అధిపతుల స్థాయి పరపతి, వారి కటాక్ష వీక్షణాలు ఉంటేనే మందు దొరుకుతుంది.

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కరోనా పాజిటివ్‌ బాధితుడు స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి తీవ్రమైంది. ‘టొసిలిజుమాబ్‌’ లేదా ‘కోవిఫర్‌’ అయితే బతుకుతాడని డాక్టర్లు చెప్పారు. తమదగ్గర మందులు లేవని, బయటి నుంచి తెచ్చుకోవాలని చెప్పారు. ఎన్ని మెడికల్‌ షాపులకు వెళ్లినా దొరకలేదు. బ్లాక్‌ మార్కెట్‌లో దొరుకుతుందని తెలుసుకున్నారు. అక్కడ.. వాళ్లు చెప్పిన ధర విని కళ్లు తిరిగిపోయాయి. దాంతో వారు ప్రజారోగ్య శాఖ డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేద్దామని టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్‌చేస్తే ఎవరూ లిఫ్ట్‌ చేయలేదు. చివరకు విజయవాడ నుంచి టొసిలిజుమాబ్‌ తెప్పించి పేషంట్‌కు అందించారు. ఇదీ.. ప్రస్తుతం రాష్ట్రంలో వందల మంది కరోనా వైరస్‌ పేషెంట్ల దయనీయ పరిస్థితి. ఎక్కడా కొవిడ్‌-19 మందులు దొరకడం లేదు. అమెరికా నుంచి కొద్ది మొత్తంలో వస్తున్న టొసిలిజుమాబ్‌ ఔషధంతో పాటు, హైదరాబాద్‌లోనే తయారవుతున్న కోవిఫర్‌ వంటి మందులు కూడా మార్కెట్‌లో లభించడం లేదు. మందులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నా.. ఈ దందా ఆగడం లేదు.

కరోనా పాజిటివ్‌లలో ఊపిరితిత్తుల్లో వైరల్‌ లోడ్‌ ఎక్కువగా ఉన్న వారికి రెండు మూడు రకాల మందులను వాడాల్సి ఉంటుంది. ప్రధానంగా హెటిరో హెల్త్‌ కేర్‌ తయారు చేస్తున్న ‘కోవిఫర్‌’ ఔషధం ఒకటి కాగా, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ‘టొసిలిజుమాబ్‌(ఆక్టెమ్రా)’ మరొకటి. ఒక్కో పేషంటుకు రోజుకు రెండు డోసుల చొప్పున మూడు రోజుల పాటు ఈ మందులను ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ధరలు మండిపోతుండడంతో మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇవి మార్కెట్లోకి వచ్చిన వెంటనే బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. వీటి ఉత్పత్తి తక్కువగా ఉండటం కూడా సమస్యకు మరో కారణం. రాష్ట్రంలోని ఐదు కంపెనీలు రోజుకు 50 వేల చొప్పున ఇంజెక్షన్లను తయారు చేస్తున్నాయి. వీటిని దేశమంతటికీ సర్దాలి. పైగా కొన్నింటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది. డిమాండ్‌ ఎక్కువగా ఉండి, ఉత్పత్తి తక్కువగా ఉండడంతో బ్లాక్‌ మార్కెటింగ్‌ పెరుగుతోంది. టొసిలిజుమాబ్‌(ఆక్టెమ్రా) 400 ఎంజీల వాయిల్‌ ధర రూ.40,500 ఉండగా, 200 ఎంజీల వాయిల్‌ ధర రూ.22 వేల వరకు ఉంది. వీటిని బ్లాక్‌ మార్కెట్‌లో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలకు విక్రయిస్తున్నారు. ఏపీలో ‘కోవిఫర్‌’ కొంత సులువుగానే లభిస్తోంది.

కానిఫెర్‌ అమ్ముతూ దొరికిపోయాడు
ఇటీవల హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మందుల బ్లాక్‌ మార్కెట్‌ రాకెట్‌ను బయటపెట్టారు. రూ.35 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఓ ఫార్మా కంపెనీ నుంచి సికింద్రాబాద్‌కు చెందిన ఓ కంపెనీ యజమాని వీటిని కొనుగులు చేసి, అధిక లాభానికి అమ్మాడు. వారు ఇతరులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఊపిరి పీల్చాలన్నా
కరోనా వైరస్‌ ప్రధానంగా ఊపిరితిత్తుల మీదే దాడి చేయడంతో వైద్యంలో భాగంగా ఆక్సిజన్‌ పెట్టడం తప్పనిసరి అయ్యింది. ఆక్సిజన్‌ సిలిండర్ల వినియోగం పెరగగానే నగరంలో కొరత వచ్చింది. బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారుల పంట పడింది. రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు లభించే ఆక్సిజన్‌ సిలిండర్ల ధరను రూ.13 వేల నుంచి రూ.20 వేలకు పెంచేశారు. గతంలో రూ.100 తీసుకుని 10 కేజీల సిలిండర్‌ నింపేవారు. మరో వంద అదనంగా తీసుకుని 40 నుంచి 50 కేజీల సిలిండర్లను నింపేవారు. ఇప్పుడు నింపడానికే రూ.200 నుంచి రూ.500 తీసుకుంటున్నారు. కాన్‌సన్‌ట్రేటెడ్‌ సిలిండర్ల ధరలు కూడా పెంచేశారు. వీటి ధర గతంలో రూ.40 వేలు కాగా.. ఇప్పుడు రూ.80 వేల నుంచి రూ.1.2 లక్షలకు చేరుకుంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారం రోజుల నుంచి దాడులు ఉధృతం చేస్తూ 10 మందిని అరెస్టు చేశారు. 500 సిలిండర్లను సీజ్‌ చేశారు.

నిర్వీర్యంగా సంయుక్త బృందాలు
ఆక్సిజన్‌ సిలిండర్లు, ఔషధాల బ్లాక్‌ మార్కెట్‌ నియంత్రణ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల రెండు సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌ డిప్యూటీ చీఫ్‌ కంట్రోలర్‌, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టరేట్‌ అధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఒక్క కేసును కూడా ఈ బృందాలు ఛేదించలేక పోయాయి. మందులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోయాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా అక్రమార్కులను గుర్తించడం లేదు. ఈ బృందాలు నిర్వీర్యంగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్లు, కరోనా టెస్టింగ్‌ కిట్స్‌, కోవిడ్‌ మందుల బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారి గురించి డయల్‌ 100 ద్వారా లేదా 9490616555 నెంబర్‌లో వాట్సా్‌పకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. మందులను వ్యక్తిగతంగా విక్రయించకుండా డాక్టర్లు, ఆస్పత్రులు, మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్లాస్మా దానం చేస్తామని
కరోనా రోగులకు ప్లాస్మా థెరపీకోసం వినియోగించే ప్లాస్మాను దానం చేస్తామని చెప్పి మోసాలకు తెగబడుతున్నారు. ఆన్‌లైన్లో డబ్బులిస్తేనే ప్లాస్మా దానం చేస్తామని బేరసారాలు సాగిస్తున్నారు. డబ్బులు ఖాతాలో పడ్డాక మొహం చాటేస్తున్నారు. కరోనాకు క్యాష్‌లెస్‌ బీమా పాలసీలు ఉన్నాయంటూ ఫోన్‌ చేస్తారు. ఇప్పటికే కరోనా వచ్చిన వారికీ వర్తిస్తాయని, వెంటనే పాలసీ అమల్లోకి వస్తుందని నమ్మబలుకుతారు. ఆన్‌లైన్‌లో ఫారం నింపుతున్నట్లు నటిస్తారు. చివరకు చెల్లింపు ఓటీపీ చెప్పమంటారు. అది చెప్పగానే ఖాతాలో సొమ్మును ఖాళీ చేస్తారు. కొందరు తమకు డబ్బులు పంపిస్తే గంటలో పాలసీ మెయిలుకు పంపిస్తామంటారు. హైదరాబాద్‌లో ఇలాంటి కాల్స్‌ చాలా మందికి వస్తున్నాయి. ఫిబ్రవరి మార్చి నెలల్లో కొవిడ్‌ పేరిట 42వేల డొమైన్‌లు రిజిస్టర్‌ అయ్యాయి. అందులో 1700 అనుమానాస్పదంగా ఉన్నాయి. వీటిల్లో 1200 డొమైన్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ప్రజలకు అనుమానాలు రాకుండా ఉండేందుకు కరోనా పేరుతో ఉన్న వెబ్‌సైట్‌ను వినియోగించుకుంటూ టెలీకాలర్స్‌ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.

మాస్కులు… శానిటైజర్లు
కరోనా రాకముందు మాస్కులు 1.50 నుంచి రెండు రూపాయలకు దొరికేవి. కొరత ఏర్పడటంతో కొన్నాళ్లు రూ.10 నుంచి రూ.40 వరకు విక్రయించారు. శానిటైజర్లనూ బ్లాక్‌లో అమ్మారు. చివరకు వాటికి నకిలీలు తయారు చేశారు. రెండింటికీ డిమాండ్‌ను గ్రహించి తయారీదారులు ఉత్పత్తి పెంచడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రాచకొండ కమిషనరేట్‌లో నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న రెండు కంపెనీలనుసీజ్‌ చేసిన పోలీసులు కోటి రూపాయలు విలువ చేసే నకిలీ శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో 40కి పైగా కేసులు నమోదు చేశారు.

షిఫ్టింగ్‌ దందా
ఇది మరీ ఘోరమైన వ్యవహారం. ప్రభుత్వాసుపత్రుల బయట రాబందుల్లా ప్రైవేటు ఆస్పత్రుల దళారులు ఉంటారు. ఆస్పత్రిలో చేరడానికి వచ్చిన వారిని, అప్పటికే చేరిన రోగులను ఆయా ఆస్పత్రుల సిబ్బందే మాయజేసి.. బయటకు తీసుకెళ్లి ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లకు అప్పజెబుతారు. నీకు ప్రాణాపాయ పరిస్థితి ఉందని బెదరగొడతారు. దళారుల కారణంగా సనత్‌నగర్‌కు చెందిన తెలుగుదేశం నాయకుడు పి.రామ్‌కుమార్‌ రెండు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయాడు. ఆయన న్యూమోనియా సమస్యతో ఛాతీ ఆసుపత్రిలో చేరాడు. తీవ్రంగా ఉందని డాక్టర్లు చెప్పారు. పైవ్రేట్‌ ఆస్పత్రికి వెళ్లాలని ఎర్రగడ్డ ఆస్పత్రి సిబ్బందే తమను ప్రేరేపించి, లీవ్‌ ఎగైనెస్ట్‌ మెడికల్‌ అడ్వయిజ్‌(లామా) సర్టిఫికెట్‌ ఇప్పించి.. డిశ్చార్చి చేయించారని రామ్‌కుమార్‌ బంధువులు చెబుతున్నారు. బయటకు వచ్చాక పదివేలు ఇస్తేనే బెడ్‌ దొరుకుతుందని బేరం పెట్టి, ఎక్కడా బెడ్‌ ఇప్పించలేక ఇంట్లో వదిలి వెళ్లారు. ఆయన రెండు రోజుల్లో మరణించాడు. ఇలాంటి దందాకు అవకాశమే లేదని ఛాతీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ మహబూబ్‌ ఖాన్‌ ఖండించారు.

బ్లాక్‌ మార్కెటింగ్‌కు ఇలా చెక్‌!
న్యూఢిల్లీ : బ్లాక్‌ మార్కెటింగ్‌కు చెక్‌ పెట్టేందుకు కేంద్రానికి కమ్యూనిటీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ లోకల్‌ సర్కిల్స్‌ లేఖ ద్వారా సూచనలు చేసింది. అత్యవసర ఔషధాలు లేదా వ్యాక్సిన్లపై సీరియల్‌ నెంబర్‌, బార్‌కోడ్‌ను ముద్రించడంతోపాటు అవి ఎక్కడ ఉన్నాయో గుర్తించేలా సిస్టమ్‌ ఆధారిత ట్రేసింగ్‌ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌తోపాటు అధిక ధరలకు విక్రయిస్తున్న సంఘటనలపై ఈ సంస్థ ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఇంజెక్షన్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ జరగకుండా, అధిక ధరలకు విక్రయించకుండా నిఘా పెంచాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని డ్రగ్స్‌ కంట్రోలర్లను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆదేశాలు జారీ చేసింది. కీలకమైన ఔషధాలు, వ్యాక్సిన్లపై ఫార్మా సంస్థలు సీరియల్‌ నెంబర్‌, బార్‌కోడ్‌ను ముద్రించడం తప్పనిసరిగా చేయాలని లోకల్‌సర్కిల్స్‌ కోరుతోంది. ఔషధ తయారీ సంస్థ నుంచి రిటైలర్‌ హాస్పిటల్‌కు లేదా రోగికి ఇచ్చే వరకు బార్‌కోడ్‌ను స్కానింగ్‌ చేసే విధానాన్ని అమలు చేయడం ద్వారా సంబంధిత ఔషధాలకు సంబంధించిన వినియోగ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

Courtesy AndhraJyothy