తెలంగాణలో మార్చి 22 నుంచి ఇప్పటి వరకు దాదాపు లక్ష కేసులు?
సిటీలో వారం రోజుల్లోనే నాలుగున్నరవేల కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో గృహహింస కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం పోలీసు అధికారులను ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గత మార్చి 22వ తేదీ నుంచి కరోనా రక్కసిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్‌ కాలంలోనే ఈ కేసులు పెరగటం విశేషం. కరోనా మహమ్మారిని వ్యాప్తి చెందనీయకుండా అడ్డుకునే విధుల్లో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా నిమగమై ఉంటే.. రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్తులపై నిఘా తగ్గి ఇతర నేరాలు పెరిగిపోయే ప్రమాదం ఉందని భావించారు. ఇందులో దొంగతనాలు, దోపిడీలు,చైన్‌స్నాచింగ్‌లు, దారి దోపిడీలు, హత్యలు, హత్యాయత్నాలతో ఇతర నేరాలు అనుమానించినంతగా పెరగలేదు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు కొంత సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అయితే మహిళలపై నేరాలు పెరగడం పట్ల ఆందోళనగా ఉన్నారని సమాచారం. అయితే మరో పక్క గృహహింస కేసులు పెద్ద ఎత్తున పెరిగి పోవడం మరింత ఆందోళన కలిగించే విషయంగా భావిస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగర కమిషనరేట్‌ పరిధిలోనే గత వారం రోజుల్లో 4500 కేసులు నమోదు కాగా ఈ కేసుల్లో సైబరాబాద్‌, రాచకొండ, వరంగల్‌, కమిషనరేట్‌లు తదుపరి స్థానాలను ఆక్రమించాని అధికార వర్గాలను బట్టి తెలుస్తోంది. కాగా కరోనా ప్రారంభమైన నాటి నుంచి ఏప్రిల్‌ చివరి నాటికే రాష్ట్ర వ్యాప్తంగా 80 వేలకు పైగా గృహహింస కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌లు మొదలుకుని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాని అధికార వర్గాలను బట్టి తెలిసింది. ముఖ్యంగా అత్తా కోడళ్ల మధ్య గొడవలు మొదలుకుని ఆస్తుల పంపకాలు, చివరికి సరిగా కూరలు వండలేదనే కారణాలతో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు మద్యం తాగి వచ్చి భార్యలను, పిల్లలను చితక బాదుతున్న భర్తల కేసులు వైన్‌షాపులు ప్రారంభించిన నాటి నుంచి ఎక్కువగా నమోదవుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇలాంటి కేసులపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తుంటంతో విధిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మిగతా సీఆర్‌పీసి, ఐపీసీ కేసుల కంటే గృహహింస కేసులు ఎక్కువగా నమోదు కావడానికి ఒక విధంగా కరోనా కూడా కారణమేనని అంచనా వేస్తున్నారు.

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల కారణంగా దాదాపుగా అన్ని కుటుంబాల వారు ఇండ్లలోనే ఉండటం.. కొందరిలో చాలా కాలంగా పేరుకు పోయిన ఆయా ఇండ్ల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ద్వేషాలు మొదలైన కారణాలు ఈ గృహహింసలకు దారి తీస్తున్నాయని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారని తెలిసింది. ఈ కేసుల్లో చాలా వరకు కౌన్సిలింగ్‌ ద్వారా పరిష్కరించే కేసులే ఎక్కువగా ఉ న్నాయని భావిస్తున్నారు. కాగా గత మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే ఎనభైవేల కేసులు కాగా ఈ మే 15వ తేదీ నాటికి ఆ సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా లక్ష దాటి ఉండొచ్చని తెలుస్తోంది. దీనిపై వివరాలను జిల్లాల నుంచి అధికారులు సేకరిస్తున్నారని సమాచారం.

Courtesy Nava Telangana