– త్రిపురలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్‌
– లాక్‌డౌన్‌లో పిల్లలను పట్టించుకోని విప్లవ్‌దేవ్‌ ప్రభుత్వం
– బదులుగా నెలకు రూ.210 ఇచ్చి చేతులుదులుపుకున్న సర్కార్‌

అగర్తలా : కరోనా కారణంగా దేశంలో నిర్దిష్ట ప్రణాళిక లేకుండా కేంద్ర సర్కారు విధించిన లాక్‌డౌన్‌ కాలంలో పాఠశాలల్లో చదివే విద్యార్థులకు త్రిపురలోని బీజేపీ సర్కారు బువ్వ పెట్టలేదు. వారికి మధ్యాహ్న భోజనాన్ని (ఎండీఎం) అందించడంలో ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. లాక్‌డౌన్‌ విధించినా పాఠశాల విద్యార్థులకు ఎండీఎం అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినా రాష్ట్ర సర్కారు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. దీంతో పేద విద్యార్థులకు తినడానికి తిండి దొరక్క ఇబ్బందులు పడ్డారని ప్రముఖ ఆంగ్ల వెబ్‌పోర్టల్‌ ‘ది వైర్‌’ ఒక కథనంలో పేర్కొంది. మధ్యాహ్న భోజన పథకానికి బదులుగా రెండు నెలల పాటు దాన్ని నగదు రూపంలో అందజేశామని బీజేపీ సర్కారు చెబుతున్నా.. అదీ ఎంతమాత్రమూ ఆమోదయోగ్యంగా లేదనేది ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలే వెల్లడిస్తున్నా యి.

పోషకాహారలోపంతో బాధపడుతున్న చిన్నారుల్లో దాన్ని అధిగమించడానికి గానూ.. పాఠశాలల్లో వారికి వడ్డించే భోజనంలో సరిపడా పోషకాలను అందేలా చేసేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని కేంద్రం కొన్నేండ్లుగా అమలుచేస్తున్నది. ఇందుకయ్యే ఖర్చును ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం భరిస్తున్నాయి. కాగా, త్రిపురలోని 8 జిల్లాల్లో 4,32,379 (ప్రాథమిక-2,66,326, ఉన్నత- 1,65,953) మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుంది. ఎండీఎం స్కీం 2015, సెక్షన్‌ 9 ప్రకారం.. ఏదైనా పాఠశాల, ఆ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు ఏదైనా కారణంతో ఆహారం అందించకుంటే అందుకు సంబంధించిన మొత్తాన్ని వారికి నగదు రూపంలో అందజేయాలనే నిబంధన ఉంది.

ఇదిలాఉంటే లాక్‌డౌన్‌ విధింపుతో మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 17 దాకా త్రిపుర సర్కారు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న బోజనం అందించడానికి బదులుగా నెలకు రూ. 150 (ప్రాథమిక విద్యార్థులకు.. రోజుకు రూ. 5), రూ. 210 (ఉన్నతపాఠశాల విద్యార్థులకు.. రోజుకు రూ. 7) చొప్పున వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అంతకుముందు విద్యాశాఖ విద్యార్థులకు రూ. 225, రూ.315 చొప్పున జమచేయాలని అనుకున్నా.. ప్రభుత్వం దాన్నీ తగ్గిం చింది. భోజనం కోసమయ్యే పదార్థాలు, వంట ఖర్చు కలిపి విద్యార్థులకు నగదు రూపంలో అందజేశామని విప్లవ్‌ దేవ్‌ ప్రభుత్వం చెబుతుండటం విడ్డూరం. విద్యా ర్థులకు భోజనంలో వడ్డించే అన్నం, కూరగాయలు, గుడ్లు, పప్పుధాన్యాల విలువ మొత్తం కలిపితే రోజుకయ్యే ఖర్చు ప్రభుత్వం చెప్పిన లెక్కల కంటే ఎన్నో రెట్లు ఎక్కు వగా ఉన్నా.. బీజేపీ సర్కారు మాత్రం నామమాత్రంగా నగదు అందజేసి బాధ్యతల నుంచి తప్పించుకోవడం గమనార్హం. మరోవైపు లాక్‌డౌన్‌ కారణంగా కేంద్ర ప్రభు త్వం త్రిపురకు ఎండీఎం కింద విడుదల చేసిన రూ. 13.85 కోట్లు ఖర్చు చేయ కుండా విద్యాశాఖ వద్ద మూలుగుతూ ఉన్నాయని ది వైర్‌ పరిశోధనలో వెల్లడైంది. త్రిపురనే గాక ఉత్తరాఖండ్‌ కూడా లాక్‌డౌన్‌ కాలంలో విద్యార్థులకు ఎండీఎం అందించలేదని వైర్‌ ఇటీవలే ఓ కథనాన్ని వెలువరించిన విషయం విదితమే.

Courtesy Nava Telangana