• చెన్నై సహా 4 జిల్లాల్లో 19వ తేదీ నుంచి 30 వరకు అమలు
  • మహారాష్ట్రలో ఒకే రోజు 178 మంది మృతి

న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరు : రోజుకు దాదాపు 1,500 కేసులు.. పదుల సంఖ్యలో మరణాలు.. తమిళనాడు రాజధాని చెన్నైలో కరోనా విజృంభణ తీరిది. ఆ రాష్ట్రంలో మొత్తం 46 వేల కేసుల్లో 33 వేలు (71శాతం) చెన్నైవే. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం పళనిస్వామితో సమావేశమైన వైద్య నిపుణుల కమిటీ.. కరోనాను నియంత్రించాలంటే లాక్‌డౌన్‌ మినహాయింపులను కఠినం చేయాలని సూచించింది. దీంతో చెన్నై సహా పరిసర కాంచీపురం, తిరువళ్లూర్‌, చెంగల్పట్టు జిల్లాల్లో ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిప్రకారం నిత్యావసర, కూరగాయల దుకాణాలు, పె ట్రోల్‌ బంక్‌లు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య మాత్రమే తెరిచి ఉంటాయి. ప్రజలు ఇంటి నుంచి 2 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లకూడదు. అత్యవసర వైద్య సాయానికి మాత్రమే ఆటోలు, ట్యాక్సీలను అనుమతిస్తారు. హోటళ్లను ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య అది కూడా టేక్‌ అవే కోసమే తెరవాలి. పెళ్లిళ్లు, మరణాలు, వైద్యపరమైన అవసరాలకు చెన్నై వచ్చేవారికి ఈ పాస్‌లు జారీ చేస్తారు. అయితే, మధ్యలో రెండు ఆదివారాలు (21, 28న) ఎలాంటి మినహాయింపులు లేకుండా కర్ఫ్యూ అమలు చేస్తారు.

మూడో రోజూ 11 వేలపైగా కేసులు

దేశంలో కరోనా ఉధృతికి అద్దంపడుతూ వరుసగా మూడో రోజూ 11 వేలపైగా కేసులు.. 300 పైగా మరణాలు నమోదయ్యాయి. ఽఢిల్లీకి తోడు తమిళనాడులో వైరస్‌ తీవ్ర రూపం దాలుస్తోంది. తమిళనాడులో కొత్తగా 1,843 మందికి వైరస్‌ సోకింది. ఏకంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో దేశంలో 11,502 కేసులు నమోదయ్యాయని, 325 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కోలుకున్నవారి శాతం 51.07కు పెరిగిందని తెలిపింది. ఢిల్లీలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)కు చెందిన 39 మంది ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు కరోనా సోకింది. కర్ణాటకలోని 7 వేల పైగా కేసుల్లో మహారాష్ట్ర నుంచి వచ్చినవారే 4,471 మంది ఉన్నారు. మహారాష్ట్రలో సోమవారం ఏకంగా 178 మంది మృతి చెందారు. ఇందులో ముంబై మరణాలు 68. పాల్‌ఘర్‌ జిల్లాలో ఓ యువకుడికి వివాహమైన 3 రోజులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వధువుతో పాటు 63 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

Courtesy Andhrajyothi