లాక్‌డౌన్‌, కరోనా దెబ్బకు మూతపడుతున్న కంపెనీలు
కొత్త ఉద్యోగాల వేటలో కోట్లాదిమంది : బ్లూమ్‌బర్గ్‌ ఎకనామిక్స్‌ నివేదిక
పోయిన ఉద్యోగాలు తిరిగి రావటం కష్టమే..

వాషింగ్టన్‌ : మునుపెన్నడూ లేనంత స్థాయి ఆర్థికమాంద్యంలో అమెరికా కూరుకుపోయిందని వివిధ రకాల అధ్యయనాలు, మీడియా వార్తా కథనాలు వెలువడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను దాదాపు ‘జీరో’ శాతానికి తగ్గించింది. ” సంక్షోభ సమయాన కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయారు. వారు తిరిగి పాత స్థానాల్ని పొందే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఉపాధిరంగంలో వారికి కొంతకాలం స్థానం దక్కకపోవచ్చు. మేం తీసుకుంటున్న చర్యలు వారికోసమే ” అని ఫెడరల్‌ రిజర్వ్‌ జిరోమి పావెల్‌ అన్నారు.

ఫిబ్రవరి-మే మధ్యకాలంలో అమెరికావ్యాప్తంగా 50శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని ‘బ్లూమ్‌బర్గ్‌ ఎకానమిక్స్‌’ తాజా వార్తా కథనం పేర్కొన్నది. ఇలా ఉద్యోగాలు కోల్పోయినవారు ఏదో ఒక పనిని వెతుక్కునే నిమిత్తం దొరికిన ఉద్యోగంలో చేరుతున్నారు.

అయితే దీనిని ఉద్యోగాల కల్పనగా చూడలేమని, కార్మికరంగంలో కోట్లాది మంది అమెరికన్లు నిరుద్యోగులుగా మారారని వార్తా కథనం తెలిపింది.

మూసివేత దిశగా అనేక కంపెనీలు
అమెరికాలో పర్యాటకం, ఆతిథ్యం, వినోదరంగాల్లో, రిటైల్‌, విద్య, వైద్యం, వాహన…తదితర రంగాల్లో అనేక కంపెనీల ఆర్థిక పరిస్థితి ప్రమాదపుటంచున ఉన్నాయి. కంపెనీల ఆర్థిక వనరులు క్రమంగా కరిగిపోతున్నాయి. ఇప్పటివరకూ జరిగిన వివిధ రకాల సర్వేలు, పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి.

మే నెలలో కంపెనీలు మూతపడటం (లే ఆఫ్‌లు) 42శాతానికి చేరుకుందని ‘యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో’ అధ్యయనం వెల్లడించింది. ఇది శాశ్వతంగా కొనసాగే అవకాశముందని అందులో తెలియజేశారు. ప్రయివేటు సంస్థల ఆర్థిక వనరులపై పెద్ద ఎత్తున భారం పడుతున్నది. ట్రంప్‌ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం అంతంతమాత్రమేనని నివేదికలు పేర్కొన్నాయి.

ఉత్పత్తిని పెంచే మార్గాలు వెతకాలి
కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా…వాణిజ్య, వర్తక రంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టాలని ‘ద పీటర్సన్‌ ఇనిస్టిట్యూట్‌’ నివేదిక తేల్చింది. సాధారణ ఆర్థిక మాంద్యం ఉన్న సమయాన కార్మికులు ఎలా పనిచేసుకోగలుగుతారో అలాంటి పరిస్థితి కల్పించాలని, తద్వారా కొన్ని మంచి ఫలితాలు వస్తాయని నివేదిక అభిప్రాయపడింది. ఉత్పత్తి పెంచితే కంపెనీలకు వేతన సబ్సిడీలు, ఇన్సెంటీవ్స్‌ ఇస్తామని, కొత్త రుణాలు మంజూరుచేస్తామని ప్రభుత్వాలు ప్రకటిస్తే బాగుంటుందని నివేదిక సూచించింది.
ఆర్థికమాంద్యానికి తోడు…లాక్‌డౌన్‌ వల్ల అమెరికా ఉపాధి రంగంలో ఫిబ్రవరి-మే మధ్యకాలంలో 50శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఇది టెంపరరీ (తాత్కాలికం)కాదు…పర్మినెంట్‌(శాశ్వతం). ఉద్యోగాలు కోల్పోయినవారు పూర్వపు స్థానాలకు వెళ్లడం దాదాపు అసాధ్యం. వారి నైపుణ్యం, అనుభవం మరో చోట ఉపయోగించుకోవాల్సిందే. గరిష్టస్థాయిలో కదలాడుతున్న నిరుద్యోగం…ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదు. నైపుణ్యాల అభివృద్ధిపై ప్రభుత్వ వ్యయం పెరగాల్సిన అవసరముంది.
బ్లూమ్‌బర్గ్‌ ఎకనామిక్స్‌ పరిశోధన

Courtesy Nava Telangana