న్యూఢిల్లీ : ఉద్యోగాలు, ఉపాధి లేక…దేశంలో పేదల సంఖ్య మరింత పెరగనుందా? లాక్‌డౌన్‌ కారణంగా కోట్లాది కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థాయి ‘దారిద్య్రరేఖ దిగువకు’ పడిపోనుందా?…అంటే 12నగరాల్లో జరిగిన ప్రభుత్వ సర్వే అవుననే చెబుతున్నది. లాక్‌డౌన్‌కు ముందు దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న ఒక వర్గం ప్రజలు, ఆ తర్వాత పేదరికంలోకి కూరుకుపోయారని, ఇప్పటికే పేదరికంలో ఉన్న కుటంబాల ఆకలి, ఉపాధి సమస్యలు మరింత పెరిగాయని కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌’ సర్వే తాజాగా తేల్చింది. ఇందులో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..

దేశవ్యాప్తంగా 12నగరాల్లో నివసిస్తున్న 95.8శాతం బీపీఎల్‌(దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవి) కుటుంబాల ఆదాయం పడిపోయింది. తమ ప్రధాన ఆదాయ వనరు దెబ్బతిన్నదని 98.2శాతం స్వయం ఉపాధి కలిగిన కుటుంబాలు చెప్పాయి. ఇక రోజువారీ కూలిపని చేసుకునే కార్మికుల కుటుంబాల్లో 97.6శాతం ఆదాయాలు దెబ్బతిన్నాయి. అనంత్‌నాగ్‌, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్‌, ఇండోర్‌, జైపూర్‌, కాంచీపురం, కోల్‌కతా, ముంబయి, శ్రీనగర్‌ నగరాల్లో 24 ఏప్రిల్‌-7 మే మధ్య కాలంలో ఈ సర్వే జరిగింది. గృహనిర్మాణం, పట్టణ సంబంధాల కేంద్ర మంత్రిత్వశాఖలో స్వతంత్ర సంస్థ అయిన, ద నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ అఫైర్స్‌ (ఎన్‌ఐయూఏ), చెన్నైకి చెందిన ఎన్జీఓ సంస్థ ‘వరల్డ్‌ విజన్‌’ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. కోవిడ్‌-19 కారణంగా నగరాల్లోని మురికివాడలు, బస్తీల్లో నివాసముంటున్న వారి జీవితాలు, ఉపాధి ఏమేరకు ప్రభావితమైందన్న దానిపై సర్వే ప్రధానంగా దృష్టిసారించింది.

ఉపాధిపై ఊహించని దెబ్బ
లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల బీపీఎల్‌కు ఎగువన ఉన్న కుటుంబాల్లో 75.3శాతం, బీపీఎల్‌ కుటుంబాల్లో 91.4శాతముంది ఉపాధి కోల్పోయారు. మొత్తంగా 85.3శాతం కుటుంబాల ప్రధాన ఆదాయ వనరు దెబ్బతిన్నది. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబయిలలో ఉద్యోగాల నుంచి తీసేయటమేగాక, వేతనాలు పెండింగ్‌లో పెట్టారన్న ఫిర్యాదులున్నాయి. కొద్ది కొద్దిగా పొదుపు చేసుకున్న డబ్బులు ఖర్చు అయిపోయాయని 34.4శాతం మంది చెప్పారు. పీఎం గరీబ్‌ కల్యాన్‌ యోజన పథకం కింద 63శాతం ఉచిత ఆహారం అందుకున్నాయి. నగదు బదిలీ పథకంతో 40శాతం కుటుంబాలు లబ్దిపొందాయని సర్వే తేల్చింది.

పేదల సంఖ్య గణనీయంగా పెరిగింది
– న్‌ఐయూఏ ప్రొఫెసర్‌ దెబోలినా కుందా
నగరాల్లోని బస్తీ వాసుల ఆర్థిక, సామాజిక పరిస్థితి దయనీయంగా మారింది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దృష్టిసారించాలి. రెండు…మూడు నెలల కాలంలో కోట్లాది కుటుంబాల జీవన పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆహార సబ్సిడీ, నగదు బదిలీ పథకాల ద్వారా వీరిని ఆదుకోవాల్సి ఉంది.

Courtesy Nava Telangana