తంగళ్లపల్లి : ‘‘నాకు కరోనా లక్షణాలున్నాయి. కాలేజీకి వెళ్తున్న సమయంలో బస్సులో నా పక్కన కూర్చున్న వారి నుంచి ఈ వ్యాధి సోకి ఉంటుంది. దాన్ని నా కుటుంబ సభ్యులకు అంటించకూడదనుకుంటున్నా. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా. అన్నా.. అమ్మను బాగా చూసుకోవాలి’’ అని సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టిన ఓ బీటెక్‌ విద్యార్థిని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఉదంతమిది. ఈ సంఘటన రాజన్న-సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో చోటుచేసుకుంది. దాసరి బాలయ్య-లక్ష్మి దంపతుల కుమార్తె  స్రవంతి(20) సిద్దిపేట జిల్లా ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతోంది. ఆమె తండ్రి గల్ఫ్‌లో పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పనులకు వెళ్తుంది. సోదరుడు వంశి హైదరాబాద్‌లో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా.. తన కూతురికి కరోనా లక్షణాలేవీ లేవని స్రవంతి తల్లి లక్ష్మి అన్నారు.

Courtesy Andhrajyothi