5 నిమిషాల్లోనే ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్ష
ఫలితం పాజిటివ్‌ వస్తే హైదరాబాద్‌కు
నెగెటివ్‌ అని తేలితే హోం క్వారంటైన్‌
25 వేల కిట్ల కోసం సర్కారు ఇండెంట్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో హాట్‌స్పాట్లలో పెద్దఎత్తున ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్షలు చేయనున్నారు. కేవలం ఐదు నిమిషాల్లో ఈ పరీక్ష నిర్వహించే కిట్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన తెప్పిస్తోంది. 25 వేల కిట్ల కోసం ఇండెంట్‌ పెట్టింది. నాలుగైదు రోజుల్లో అవి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చేతికి అందనున్నాయి. దీంతో మర్కజ్‌తో లింకు ఉండి ఎక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఈ పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష ద్వారా శరీరంలోని రోగ నిరోధక కణాల స్థాయిని అంచనా వేస్తారు. అవి ఎక్కువగా ఉంటే శరీరంలో వైరస్‌ ఉన్నట్లు అనుమానిస్తారు. ఎందుకంటే వైరస్‌ సోకినప్పుడే దాన్ని ఎదుర్కొనేందుకు రోగ నిరోధక కణాల ఉత్పత్తి జరుగుతుంది. ఆరోగ్య కార్యకర్తలు ఈ కిట్లతో ఇంటింటికీ వెళ్లి ఫ్లూ లక్షణాలున్న వారిని గుర్తించి అక్కడికక్కడే రక్త నమూనా సేకరించి పరీక్ష చేస్తారు. ఇందులో పాజిటివ్‌ వస్తే వెంటనే హైదరాబాద్‌లోని నిర్ణీత ల్యాబ్‌కు పంపిస్తారు. అక్కడ గొంతులోంచి స్వాబ్‌ తీసి రియల్‌టైం పాలిమరేస్‌ చైన్‌ రియాక్షన్‌ పరీక్ష నిర్వహిస్తారు. దానిలోనూ పాజిటివ్‌ వస్తే హైదరాబాద్‌లో చికిత్స చేస్తారు.

ర్యాపిడ్‌ పరీక్ష ఫలితం నెగెటివ్‌ వచ్చినా జ్వరం, జలుబు, దగ్గు ఉంటే కనుక వారిని హోం క్వారంటైన్‌లో 14 రోజులు ఉంచాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సూచించింది. వారికి లక్షణాలు అధికంగా ఉంటే హైదరాబాద్‌లో పీసీఆర్‌ పరీక్ష నిర్వహిస్తారు. ర్యాపిడ్‌ టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చిన వారి హోం క్వారంటైన్‌ పూర్తయ్యాక వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాకే బయటకు వెళ్లడానికి అనుమతించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల ఆధారంగా హాట్‌స్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ గుర్తిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ సహా వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో హాట్‌స్పాట్లను గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ గుర్తిస్తున్నారు. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ర్యాపిడ్‌ యాంటీబాడీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినా ఆయా ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని అంటున్నారు. హాట్‌స్పాట్ల బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు.

యాంటీబాడీ టెస్ట్‌ ఎందుకంటే…
కరోనా నిర్ధారణకు ప్రస్తుతం పీసీఆర్‌ టెస్ట్‌ చేస్తున్నారు. దీనికి ముక్కు, గొంతు నుంచి కఫం సేకరిస్తారు. ఫలితాలు రావడానికి ఐదు గంటలకుపైగా పడుతుంది. కిట్‌ సాయంతో చేసే ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్ట్‌కు 5 నుంచి 15 నిమిషాలు చాలు. ఇందులో కరోనా అనుమానిత వ్యక్తులు ఆల్కహాల్‌ స్వాబ్‌తో చేతివేలును శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆ వేలును సూదితో గుచ్చి రక్త నమూనా సేకరిస్తారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి ఈ కిట్లను ఉపయోగించాలనే ప్రతిపాదనలు వెళ్లాయి. దాంతో ఐసీఎంఆర్‌ వీటిని ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది. చిన్నచిన్న పల్లెల్లో కూడా వీటిని ఉపయోగించడం సులువు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కిట్లను వాడటం తప్పనిసరిగా మారిందని నిపుణులు సూచిస్తున్నారు.

లాక్‌డౌన్‌ వల్ల చాలామంది వలస కార్మికులు గ్రామాలకు వెళ్లారు. ఇలా వెళ్లిన పది మందిలో ముగ్గురు వైరస్‌ క్యారియర్లుగా మారి ఉండొచ్చని అంచనా. కాబట్టి స్వల్పకాలంలో కరోనా ప్రభావితులను పరీక్షించాలి. దీనికోసం యాంటీ బాడీ టెస్టులే ఉత్తమమని నిపుణుల అభిప్రాయం. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం హాట్‌స్పాట్‌గా గుర్తించిన ప్రదేశాల్లో కరోనా వ్యాప్తిని గుర్తించేందుకు ఈ పరీక్షలే అనువైనవి. పీసీఆర్‌ విధానంతో పోలిస్తే యాంటీబాడీ కిట్ల ధర తక్కువ. పీసీఆర్‌లో వ్యాధి నిర్ధారణకు రూ.5-6 వేలు ఖర్చు అవుతుంటే, యాంటీబాడీ కిట్లు రూ.2-3 వేలలోపే లభ్యమవుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమెరికా, చైనా, దక్షిణ కొరియా నుంచి 5 లక్షల కిట్ల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సైతం దేశీయంగా ఈ కిట్ల ఉత్పత్తి కోసం పనిచేస్తోంది.

రాష్ట్రంలో గుర్తించిన కొన్ని హాట్‌స్పాట్లు ఇవే..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో…
యూస్‌ఫగూడ, చంచల్‌గూడ, సికింద్రాబాద్‌లోని ఎంజే రోడ్‌, నాంపల్లి, ఎమ్మెల్యే కాలనీ, మణికొండ, న్యూ మలక్‌పేట, నారాయణగూడ, ఖైరతాబాద్‌, రాజేంద్రనగర్‌, షాద్‌నగర్‌, టోలీచౌకి, కుత్బుల్లాపూర్‌.

నిజామాబాద్‌లో…
ఆర్యానగర్‌, మాలపల్లి, ఖిల్లారోడ్‌

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో…
జులైవాడ, సుబేదారి, ఈద్గా, కుమార్‌పల్లి, మండిబజార్‌, పోచంమైదాన్‌, చార్‌బౌలి, కాశీబుగ్గ, గణేష్‌ నగర్‌, నిజాంపుర, లక్ష్మీపురం, రంగంపేట, శంభునిపేట, బాపూజీనగర్‌, చింతగట్టు క్యాంప్‌

Courtesy Andhrajyothy