అనేక దేశాల్లో ఆర్థికపరిస్థితి తారుమారు

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లాక్‌డౌన్‌ అమలుతో కార్మికుల ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. దాదాపు 200కోట్ల మంది కార్మికులు ఉపాధిని కోల్పోతారని తాజాగా సమాచారం అందుతున్నది. ఇక ఇండియా విషయానికొస్తే, దేశంలోని మొత్తం కార్మికశక్తిలో 90శాతం మంది ఉపాధిని కోల్పోయి ఇంటికే పరిమితమైన పరిస్థితులున్నాయి. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా అంతటా కూడా కార్మికుల జీవనోపాధి ప్రభావితమైంది. దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోతే, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టకపోతే నష్టం ఊహించనంతగా ఉంటుందని వివిధ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

భారత్‌లాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో ముందుగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని, ఆర్థిక పరిస్థితిని గాడిలోపెట్టాలని ప్రభుత్వానికి నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 100కు పైగా దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలు మొత్తంగా నిలిచిపోయాయి. దాంతో ప్రపంచ కార్మికశక్తిలో 60శాతం ఉన్న అసంఘటిత కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. దక్షిణాసియా నుంచి దక్షిణ అమెరికా వరకు అనేకదేశాల్లో 200 కోట్లమందికిపైగా అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారని, నేటి సంక్షోభం కారణంగా వీరి ఉపాధి దెబ్బతిన్నదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ‘ఎబోలా వైరస్‌’ ప్రబలి దాదాపు 11వేలమంది చనిపోయారు. దీనిని అరికట్టడానికి ప్రజల కదలికలపై, పనిగంటలపై ఆంక్షలు అమలుజేయాల్సి వచ్చింది. సరిహద్దు వాణిజ్యం మొత్తం మూతపడింది. లైబీరియాలో కార్మికశక్తిలో 90శాతం అసంఘటిత కార్మికులే ఉన్నారు. ఎబోలా మహమ్మారి వల్ల వీరి జీవనోపాధి దెబ్బతిన్నది. దేశంలోని మూడోవంతు కుటుంబాలు తిండిగింజలు, మాంసం కొనుగోలు చేయలేకపోయారు. ఇప్పుడు ప్రబలని కరోనా వైరస్‌ ప్రభావం ఇండోనేషియా, ఉగాండా, కొలంబియా, ఇండియా… తదితర దేశాల్లోని అసంఘటిత కార్మికులపై తీవ్రంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Courtesy Nava Telangana