• చెన్నైలో 236 మృతుల వివరాలు గల్లంతు
  • వివరాల పరిశీలనకు వారంలో కమిటీ
  • ఢిల్లీ లెక్కల్లోనూ తేడా..!

చెన్నై : తమిళనాడు ప్రభుత్వం కరోనా మరణాలపై దాగుడుమూతలు ఆడుతోంది. మృతుల సంఖ్యను భారీగా తగ్గించి చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోజువారీ వివరాలను పారదర్శకంగా ప్రకటిస్తున్నామని సీఎం పళనిస్వామి, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ పదేపదే చెబుతున్నారు. అయితే చెన్నై నగరానికి సంబంధించి కరోనా మరణాలను ప్రభుత్వ ప్రజారోగ్య సంస్థ (డీపీహెచ్‌), గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(జీసీసీ) వేర్వేరుగా చూపుతున్నాయని తాజా పరిశీలనలో వెల్లడైంది. ఈ నెల 8వరకు చెన్నైలో 224 మంది కరోనా వల్ల మృతి చెందినట్లు డీపీహెచ్‌ రికార్డుల్లో నమోదవగా, జీసీసీ లెక్కల ప్రకారం మరణాల సంఖ్య 460గా ఉంది. జీసీసీ రిజిస్టర్‌ను డీపీహెచ్‌ అధికారులు పరిశీలించగా 236 మరణాలను అధికంగా చూపినట్లు గుర్తించారు. డీపీహెచ్‌ నమోదు చేసిన మృతుల సంఖ్య కంటే కార్పొరేషన్‌ రిజిస్టర్‌లో రెట్టింపునకు మించి మృతులు ఉండడం గమనార్హం. జీసీసీ లెక్కలు నిజమైతే రాష్ట్రంలో కరోనా మృతుల శాతం 0.7నుంచి 1.5కు పెరుగుతుంది. ఇక కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కరోనా మృతుల వివరాలను ఎప్పటికప్పుడు కొవిడ్‌-19 స్టేట్‌ నోడల్‌ ఆఫీసుకు ఈమెయిల్‌ ద్వారా తెలపడం లేదని తెలిసింది. పెరంబూరు రైల్వే ఆస్పత్రిలో కరోనాతో 20మంది మృతిచెందిన విషయాన్ని ఆస్పత్రి నిర్వాహకులు కొవిడ్‌ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వలేదని ఓ ఆంగ్ల పత్రిక పరిశీలనలో వెల్లడైంది.

ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రులు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా మృతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయా ప్రాంతాల్లో ఉన్న కార్పొరేషన్లకు ఎప్పటిక ప్పుడు తెలియజేయడం లేదని ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేశ్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంపై కమిటీ చేసి, సమగ్ర పరిశీలన అనంతరం కరోనా మృతుల రిజిస్టర్‌ లోని వివరాలను సవరిస్తామన్నారు. ఢిల్లీలోనూ మృతుల లెక్కల్లో తేడాలు వస్తున్నా యి. కేజ్రీ సర్కారు లెక్క ప్రకారం మరణాల సంఖ్య 984 కాగా.. బీజేపీ పాలిత మునిసిపల్‌ కార్పొరేషన్లు మాత్రం ఈ సంఖ్య 2000కి పైనేనని చెబుతున్నాయి.

Courtey Andhrajtyothi