– నిర్మాణ రంగంలో తీవ్ర స్తబ్ధత కారణం…
– నిలిచిన దాదాపు 2 లక్షల కోట్ల ప్రాజెక్ట్స్‌
– ఉక్కు, సిమెంట్‌ పరిశ్రమలపైనా ప్రభావం

న్యూఢిల్లీ: దేశంలోని నిర్మాణ రంగంలో నెలకొన్న తీవ్ర స్తబ్ధత నేపథ్యంలో రానున్న రోజుల్లో దాదాపు ఐదు లక్షలకు పైగా కొలువులు కొండెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగం కుదేలవుతున్న నేపథ్యంలో రానున్న రెండేళ్లలో స్థిరాస్తి రంగం ఇతర అనుబంధ రంగాల్లో భారీగా కొలువుల కోత ఉంటుంద ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పూర్తయిన వివిధ రకాల గృహాలు, వెంచర్లలో ఇండ్లు విక్రయానికి నోచుకోవడం లేదు. భారీగా డిస్కౌంట్లను ఆఫర్‌ చేసినా కొనేవారు లేక ఇన్వెంటరీలు పేరుకుపోతూనే వస్తోంది. దేశ వ్యాప్తంగా రూ.1.8 లక్షల కోట్ల విలువైన నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిలిచిపోయాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ వెల్లడించింది. ఇండ్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలుకు వినియోగదారులు దూరంగా ఉండటంతో తక్కువ అద్దెలు, పెట్టుబడి పెరుగుదల ప్రతికూలంగా ఉంటుందనే అంచనాతో ఇన్వెస్టర్లు సైతం స్థిరాస్తుల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోవడంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న డెవలపర్లు వడ్డీ, ఈఎంఐల చెల్లింపులో విఫలమవుతూ వస్తున్నారు. దీంతో నిర్మాణ రంగం కుదేలవుతోంది. ఫలితంగా నిర్మాణ రంగం, దాని అనుబంధ పరిశ్రమల్లో స్తబ్దత కారణంగా రానున్న ఏడాది కాలంలో దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయే అవకాశం ఉందని ”నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌” (ఎన్‌ఆర్‌డీసీ) అంచనా వేసింది. నిర్మాణ రంగంలోని అనిశ్చితి ప్రభావం సిమెంట్‌, ఉక్కు వంటి అనుబంధ పరిశ్రమలపై కూడా ప్రతిబింబిస్తుందని.. దీంతో పెద్దసంఖ్యలో ఉద్యోగులపై ప్రభావం పడి వారు కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందని ఎన్‌ఆర్‌డీసీ విశ్లేషించింది. నిర్మాణ రంగానికి బ్యాంకులు ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో ఆయా కంపెనీలు లేవని, తీవ్ర నగదు కొరత బ్యాంకింగ్‌, నిర్మాణ రంగాలకు సమస్యగా పరిణమిస్తుందనే విశ్లేషకులు చెబుతున్నారు.
ఎన్‌బీఎఫ్‌సీ రంగం కుదేలవడం, బ్యాంకులు నిర్మాణ రంగానికి తాజాగా భారీ రుణాలనివ్వడం దాదాపు నిలిపివేసిన నేపథ్యంలో దేశంలోని రియల్‌ఎస్టేట్‌ రంగంలో సమస్యలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితులు రానున్న రోజుల్లో ఉద్యోగ కోతలు పెరిగేందుకు దారి తీయవచ్చని వారు అంచనా వేస్తున్నారు.

వృద్ధిపెరిగినా.. తగ్గిన ఉద్యోగ కల్పన: కేర్‌
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ కల్పన అంతకంతకు పడిపోతూ వస్తోందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ కేర్‌ అభిప్రాయపడింది. గడిచిన రెండేండ్లు గాను చూస్తే 2017-18లో ఉద్యోగ కల్పన 3.9 శాతానికి, 2018-19లో 2.8 శాతానికే పరిమితం అయినట్టుగా సంస్థ తెలిపింది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన దాదాపు 1938 కంపెనీల సమాచారాన్ని విశ్లేషించి సంస్థ ఉద్యోగ కల్పన విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మొత్తం కార్పొరేట్‌ రంగంలోని సంస్థల అమ్మకాలు రూ.69 లక్షల కోట్లుగా నిలిచాయని సంస్థ తెలిపింది. ఇందులో పబ్లిక్‌ రంగ సంస్థలు కూడా ఉన్నట్టుగా కేర్‌ తెలిపింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో (దాదాపు నాలుగేండ్ల కాలంలో) ఆయా సంస్థల్లో ఉద్యోగ కల్పన మొత్తంగా 3.3 శాతం మేర పెరిగినట్టుగా తమ విశ్లేషణలో తేలిందని సంస్థ తెలిపింది.

ఇదే సమయంలో దేశంలో జీడీపీ 7.5 శాతం మేర పెరిగినట్టుగా సంస్థ తెలిపిం ది. కంపెనీల ఆదాయం పెరిగి.. దేశ వృద్ధి రేటు రికార్డు స్థాయిలకు చేరువైనప్పటికీ ఉద్యోగ కల్పనలో మాత్రం పెద్దగా వృద్ధి కనిపించకపోవడం విశేషం. జీడీపీకి ఎంప్లాయిమెంట్‌కు మధ్య వ్యత్యాసం 2015-16లో 5.5 శాతం మేర ఉండగా.. ఆ తరువాత సంవత్సరాలలో ఇది వరుసగా 4.1 శాతం, 3.3 శాతం, 4 శాతంగా నమోదు అవుతూ వచ్చిందని కేర్‌ తెలిపింది. సమీక్షా కాలంలో సీఏజీఆర్‌ను బట్టి విశ్లేషించి చూస్తే జీడీజీ వృద్ధికి ఉద్యోగ కల్పనకు మధ్య వ్యత్యాసం 4.2 శాతంగా నమోదు అయినట్టుగా రేటింగ్‌ సంస్థ తెలిపింది. దేశంలో తాము సమీక్షలోకి తీసుకున్న మొత్తం కంపెనీల్లో కేవలం 35 శాతం కంపెనీల్లో మాతమ్రతే సీఏజీఆర్‌ సగటు అయిన 3.3 శాతం కంటే ఎక్కువ ఉద్యోగ కల్పన కనిపించిందని కేర్‌ తెలిపింది. దేశంలోని కీలక రంగాలకు చెందిన పరిశ్రమల్లో నెలకొన్న స్తబ్దత కారణంగా ఈ రంగంలో కంపెనీల్లో ఉద్యోగ కల్పన వృద్ధిలో దాదాపు ప్రతికూలత నమోదు అయినట్టుగా సంస్థ తెలిపింది. దేశంలోని నెలకొన్న మందగమనానికి తోడు.. బ్యాంకుల్లో పేరుకుపోయిన ఎన్‌పీఏల ప్రభావం వల్లే ఈ రంగాలలో కొత్త కొలువుల ఊసే లేకుండా పోయిందని.. దీనికి తోడు ఉన్న ఉద్యోగాలు కూడా కొండెక్కడం కనిపించిందని సంస్థ తెలిపింది. సాధారణ సగటుకంటే కూడా ఎఫ్‌ఎంసీజీ, టెక్స్‌టైల్స్‌ రంగంలో ఉద్యోగ కల్పన తక్కువగా కనిపించిందని కేర్‌ విశ్లేషించింది.

Courtesy NavaTelangana..