లౌకిక భారత దేశ భావనను, దాని శిథిలాల నుంచి పునరుద్ధరించి, జాతి మనస్సులో సుస్థిరం చేసేందుకు భారతీయ జనతా పార్టీని ఏదో విధంగా ఓడించడమే సరిపోదు. ఆ సమున్నత కార్య సాధనకు ఒక కొత్త తరహా సాంస్కృతిక రాజకీయాలు విశేషంగా అవసరం. సామాన్య ప్రజలతో వారి భాషలో, వారి సాంస్కృతిక సంవేదనలలో, వారి నైతిక నుడికారంలో నిరంతరాయంగా సంభాషించేందుకు అవి సంకల్పించాలి. ఆ లక్ష్య నిర్వహణకు దగ్గర దారులేవీ లేవు.

అయోధ్య తీర్పులో ప్రతిధ్వనిస్తున్నవేమిటి? లౌకిక భారత్ విలాపాలు కావూ?! భారతీయ లౌకిక విధానం ఇంత నిర్జీవంగా, ఇంత నికృష్టంగా ఎప్పుడైనా కన్పించిందా? అది, సంజాయిషీలు చెప్పుతూ క్షమను యాచించడాన్ని ఎప్పుడైనా చూశారా? అయోధ్య తీర్పు అనంతర దౌర్భాగ్యమిది. ఎవరు దీనికి బాధ్యులు? లౌకికవాదం సంరక్షకులు మినహా మరెవ్వరూ కాదు. వారి నయవంచన వల్ల మాత్రమే కాదు, వారి దురహంకారం వల్ల కూడా ఈ శోచనీయ పరిస్థితి దాపురించింది. లౌకిక వాద మేధావులు, రాజకీయవేత్తలు విఫలమయ్యారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే మహోన్నత రాజ్యాంగ ఆదర్శాన్ని- లౌకికవాదం- సామాన్య ప్రజల నిత్యానుభవాల్లోకి పరివర్తింప చేసేందుకు వారు మనఃపూర్వకంగా పూనుకోలేదు.

ఈ నిరసన, లౌకిక వాదం భావనను నిరాకరించడం కాదు. లౌకిక వాదం ఒక పవిత్ర సూత్రం, అతిక్రమించకూడని రాజ్యాంగ నియమం. భారత్ భావన స్వతస్సిద్ధ ధర్మమది. ఈ రోజుల్లో ఈ సత్యాన్ని మళ్ళీ మళ్ళీ ఉద్ఘాటించవలసివున్నది. -అసంబద్ధంగానైనా జోక్యం చేసుకుని, చావు దెబ్బ తినవలసివచ్చినా సరే. వ్యవస్థీకృత మతాల నుంచి భారత రాజ్యవ్యవస్థ నియమానుసారం దూరంగా ఉండాలనేది మన రాజ్యాంగపు ముఖ్య నిర్దేశాలలో ఒకటి. ఇది కేవలం ఒక నైతిక ఆదర్శం మాత్రమే కాదు, ఒక రాజకీయ అనివార్యత కూడా. మొత్తం మీద దీర్ఘకాలంలో మనం లౌకిక భారత దేశాన్నయినా కలిగి వుండడమో లేదా అసలు భారత గణతంత్ర రాజ్యమనేదే విలుప్తమయ్యే విపత్తులో పడడమో సంభవిస్తుంది.

లౌకిక వాదం అనుల్లంఘనీయమైన సూత్రమయితే లౌకికవాద రాజకీయాలు అరుదుగా మాత్రమే ఆ ఆదర్శానికి అనుగుణంగా నడిచాయి. స్వాతంత్ర్యానంతరం లౌకికవాద రాజకీయాలు ఒక రాజకీయ వంచనగా భ్రష్టమయ్యాయి. దేశ విభజన విషాద పరిణామాల ఫలితంగా మన రాజకీయాలు తొలుత లౌకికవాద ఆదర్శానికి మనసా వాచా కర్మణా నిబద్ధమైవున్నాయి. క్రమేణా లౌకికవాద ఆదర్శాలు రాజకీయ అవకాశవాదం, ఓటు బ్యాంకు నిర్బంధాలకు లోబడిపోయాయి. మైనారిటీ వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు అనాలోచిత, అవివేక విధానాలను అనుసరించడం, వాగ్దానాలు వర్షించడం లౌకికవాద

రాజకీయాలలో అనివార్యమైపోయింది. తత్ఫలితంగానే లౌకికవాదానికి తీవ్ర ప్రతికూల ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. అంతిమంగా లౌకికవాద రాజకీయాలు ఇప్పుడు మనం చూస్తున్న విధంగా లొంగుబాటు రాజకీయాలుగా కృశించిపోయాయి. ఈ నికృష్ట రాజకీయాలను అర్థంచేసుకోవాలంటే, అయోధ్య తీర్పుపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన వర్గం క్లుప్త ప్రకటనను చదవండి. ఇతర ప్రధాన ప్రతిపక్షాల ప్రతిస్పందనలు లేదా మౌనం కాంగ్రెస్ స్పందనకు భిన్నమేమీ కాదు.

సాంస్కృతిక రాజకీయాల వైఫల్యమే భారతీయ లౌకిక విధానపు ప్రధాన సమస్య. ఎన్నికలలో పోటీ చేయడం, ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం లేదా కూల్చివేయడం, ఆందోళనలు నిర్వహించడం మాత్రమే రాజకీయాలు కాదు. సమగ్ర, నిష్కపట రాజకీయాలు సమాజంలో నెలకొనివున్న భావాలు, అభిప్రాయాలు సవాల్ చేస్తాయి; దేశానికి హితకరమైన రీతిలో ప్రజాభిప్రాయాన్ని సరికొత్తగా సృష్టిస్తాయి. కొత్త మాటలు సృష్టించడం, పాత పదాలకు నూతన అర్థాలు సంతరింపచేయడం, కొత్త భావాలు, నూతన లక్ష్యాలను అంగీకరించేలా ప్రజలను ప్రేరేపించడమే రాజకీయాలు. సాహిత్యం, సినిమాలు, నాటకాలు మొదలైన కళారూపాల ద్వారా ఈ సమున్నత సాంస్కృతిక కార్యకలాపాలతో ఆ లక్ష్యాన్ని సాధించవచ్చు. లేదా, రాజకీయ ప్రసంగాలు, టెలివిజన్ చర్చలు, చివరకు పుకార్లు కూడా ఆ ధ్యేయానికి దోహదం చేస్తాయి.

సరిగ్గా ఇక్కడే లౌకికవాద రాజకీయాలు విఫలం కాగా హిందూత్వ రాజకీయాలు సఫలమయ్యాయి. మన స్వాతంత్ర్యోద్యమం లౌకికవాదాన్ని శిరసావహించింది; మతతత్వాన్ని వెలివేసింది. లౌకికవాదాన్ని ఒక మనోధర్మంగా, ఒక జీవనసూత్రంగా మన జాతీయోద్యమ తరాల పెద్దలు, పిన్నలు గౌరవించి, పాటించారు. మరి నేడు పరిస్థితి మారింది. లౌకికవాదం ఒక విదేశీ సిద్ధాంతంగా, ఉపేక్షణీయ ధర్మంగా భావించడం జరుగుతోంది. ‘సెక్యులర్’ (లౌకిక) ఆదర్శమనేది ‘సిక్యులర్’ (రోగిష్టి లేదా దుర్బల) ధర్మంగా అపఖ్యాతి పాలయింది. ఇక హిందూత్వ, ప్రజల నీరాజనాలు అందుకోవడంలో విజయవంతమయింది. చరిత్రలో జాతికి జరిగిన అన్యాయాలను సరిదిద్దగలిగేది, జాతి ఆత్మగౌరవాన్ని కాపాడగలిగేది, జాతి పరిపూర్ణ పునరుజ్జీవానికి ఆలంబన అవ్వగలిగేది తాము మాత్రమేనని దేశ ప్రజలకు నచ్చచెప్పడంలో హిందూత్వ శక్తులు సఫలమయ్యాయి.

ఈ పెనుమార్పును సాధ్యం చేసినదేమిటి? లౌకికవాదం మొదలైన సమున్నత ఆదర్శాలు, ఉదాత్త ఆశయాలను రాజ్యాంగంలో పొందుపరుచుకున్నంత మాత్రాన అవి ప్రజల జీవితాలను ప్రభావితం చేయలేవు, తీర్చిదిద్ద లేవు. ప్రతి తరానికీ ఆ ఆదర్శాలను ఒక కొత్త భాషలో పునరావిష్కరించేందుకు ప్రజలతో నిరంతరమూ సంభాషిస్తూ లేదా సంవాదిస్తూ ఉండడం చాలా ముఖ్యం. మన లౌకిక మేధావులు ఈ విధ్యుక్త ధర్మ నిర్వహణను దశాబ్దాల క్రితమే నిలిపివేశారు. మరి లౌకిక శ్రేణుల వలే సంఘ్ పరివార్ స్తబ్దుగా ఉండిపోలేదు. జాతిపిత గాంధీజీ హత్య మొదలైన ఘటనల కళంకం మీదపడినప్పటికీ స్వాతంత్ర్యానంతరం సంఘ్ పరివార్ నిత్యమూ ప్రజల దగ్గరకు వెళుతూనే వున్నది. సామాన్య పౌరులతో ఆదరంగా వారి భాషలో, వారి నుడికారంలో, వారి సాంస్కృతిక అనుభూతులు, అనుభవాలలో సంభాషిస్తూనే వున్నది. లౌకిక వాదులు ఈ కర్తవ్య నిర్వహణకు దూరమైపోయారు. మరింత స్పష్టంగా చెప్పాలంటే సామాన్య ప్రజల నుంచి విడివడ్డారు.

మరింత శోచనీయమైన విషయమేమిటంటే సామాన్య ప్రజలు ఆదరించే జనరంజక సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొనడం, వాటిని తాము స్వయంగా నిర్వహించడం చాలా ముఖ్యమన్న వాస్తవాన్ని లౌకిక శ్రేణులు విస్మరించాయి. హిందూత్వ (మైనారిటీలలో దాని తుల్య శక్తులు) జనప్రియ విశ్వాసంగా వర్ధిల్లుతుండగా లౌకికవాదం కులీన వర్గాలకే పరిమితమైపోయింది. అంతిమంగా జనప్రియ విశ్వాసాలు జయపతాకలు ఎగురవేసేందుకు ప్రజాస్వామ్యం తోడ్పడింది. మతం, సంప్రదాయాల పట్ల ఉదాసీనత వహించడం ద్వారా లౌకిక వాదం సామాన్య ప్రజలతో అర్థవంతమైన బాంధవ్యాన్ని కోల్పోయింది. ప్రజల విశ్వాసాలను నిర్లక్ష్యం చేసింది. తత్ఫలితంగానే భావాల పోరాటంలో పరాజయం పాలయింది. మన స్వాతంత్ర్యోద్యమ కాలంలో మన నాయకులు ప్రగాఢ మతాభినివేశులు అయినప్పటికీ రాజీపడని లౌకికవాదులు. జవహర్ లాల్ నెహ్రూ మినహా మన జాతీయ నాయకులు అందరూ తమ తమ మత సంప్రదాయాలను పరిపూర్ణంగా అనుష్ఠించేవారు.

వీరిలో కొందరు సొంత మతంతోపాటు ఇతర మతాల సంప్రదాయాలను కూడా పరిపూర్ణ గౌరవంతో ఆచరించేవారు పలువురు జాతీయ నాయకులు భగవద్గీతపై ఉద్గ్రంథాలు రచించారు.. మౌలానా ఆజాద్ ప్రపంచ ప్రఖ్యాత ఇస్లామిక్ విద్వాంసుడుగా పేరు పొందారు. వినోబా భావే సకల మతాలపై సాధికారంగా మాట్లాడేవారు. అయినప్పటికీ ఏ ఒక్క మతమూ ఇతర మతాల కంటే అధికమైనదికాదన్న విశిష్ట భారత్ భావనకు వారు నిబద్ధులై వున్నారు.

మన జాతీయోద్యమ కాలం నాటి ప్రజా జీవితాన్ని నేటి మన ప్రజా జీవితంతో పోల్చి చూడండి. మతతత్పరులు అయివుండి కూడా సంపూర్ణ లౌకికవాదులు అయిన నాయకులు నేడు ఎంతమంది వున్నారు? రాజకీయవేత్తలను మరచిపోండి. మతగ్రంథాలను అధ్యయనం చేసేవారు, మతాచారాల పట్ల అవగాహన వున్నవారు విద్యావంతులైన భారతీయులలో ఎంత మంది వున్నారు? ఈ సాంస్కృతిక శూన్యమే, ధార్మికులు అనడానికి ఏ మాత్రం అర్హత లేనివారు కూడా తమనుతాము మత సంరక్షకులుగా ప్రకటించుకునే పరిస్థితులను సృష్టించింది. ఈ విపత్కర సామాజిక వాతావరణాన్ని రాజకీయవాదులు తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ మతం విషయంలో ఇది పరిపూర్ణ సత్యం.

లౌకికవాద రాజకీయాలు సాధారణంగా అన్ని మతాల విషయంలోనూ అనాసక్తంగా ఉండడం కద్దు. అయితే అవి ముఖ్యంగా హిందూ మతం పట్ల చులకన భావాన్ని చూపడం పరిపాటిగా ఉన్నది! ఒక వైపు వలసపాలన ప్రభావిత మేధావులు, విద్యావంతులు హిందూ మతం పట్ల తిరస్కార భావాన్ని ప్రదర్శిస్తూ అది ఆధునిక సమాజానికి, జీవనరీతులకు అంతగా ఉపయుక్తమైనది కాదని భావిస్తున్నారు. మరో వైపు ఆధునిక సమతావాద చింతనా ధోరణులలో ఒకటి, ముఖ్యంగా కుల ఆధారిత అన్యాయాలకు కారణమవుతున్న హిందూ సామాజిక వ్యవస్థ పట్ల తీవ్ర ఆగ్రహావేశాలను, వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది. ప్రస్తావిత రెండు ఆలోచనా స్రవంతులూ కలసికట్టుగా ఈ ధరిత్రిపై అత్యంత తిరోగామి మతం హిందూ ధర్మమే అన్న భావనను ఆధునిక, లౌకిక విద్యాంతులలో కలిగిస్తున్నాయి. హిందూ మతంపై మొరటు, అవగాహనారహిత విమర్శలు చేయడం మన మేధో వర్గాలలో ఒక ఆమోదయోగ్యమైన ధోరణిగా ఉన్నది. అయితే ఇటువంటి ధోరణులు బెడిసికొడుతున్నాయి.

రాజకీయంగా తీవ్ర ప్రతికూల ప్రతిస్పందనలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్టు ఆంగ్ల మానసపుత్రులైన మన విద్యాధికులు తమ తమ మాతృభాషల్లో ప్రజలకు ఆధునిక భావ సంచయాన్ని అందించడంలో విఫలమవుతున్నారు. మాతృభాషలపై ప్రేమాభిమానాలు చూపక పోవడం వల్ల వారు ప్రజలకు దూరమైపోతున్నారు, పోయారు కూడా.

ఈ విషయంలో కూడా మన స్వాతంత్ర్యోద్యమం నాటికీ, ఇప్పటికీ ఉన్న తారతమ్యం జ్ఞానదాయకమైనది. మన మహోదాత్త జాతీయ నాయకులు అందరూ ఆంగ్లంలో ప్రావీణ్యులే. అయితే వారు తమ సొంత భాషలోనే మాట్లాడేవారు, రాసేవారు. తద్వారా వారు ప్రజలకు సన్నిహితమయ్యారు. స్వాతంత్ర్యానంతర మేధో శ్రేణులకు ఆంగ్లమే అన్నీ. ఇంగ్లీషు భాషకే పరిమితం కావడంతో ప్రజలకు, వారికి మధ్య ఒక అగాధం ఏర్పడింది. అదొక సాంస్కృతిక అగాధం అవ్వడం వల్లే ఆ శ్రేణులను ‘ఖాన్ మార్కెట్ గ్యాంగ్’గా పరిహసించడం జరుగుతోంది.

నా ఈ అభిప్రాయాలు చాలా కర్కశంగా ఉన్నాయి కదూ. అవును, నిజమే అవి చాలా కఠోరమైన వాస్తవాలు లౌకిక భారతదేశ భావనను సంరక్షించడానికి తాపత్రయపడుతున్న, పోరాడుతున్న వారికి, బహుశా, మనస్తాపం కలిగించేవి కూడా కావచ్చని నేను అంగీకరిస్తున్నాను. అయితే, లౌకిక భారత దేశ భావనను, దాని శిథిలాల నుంచి పునరుద్ధరించి జాతి మనస్సులో సుస్థిరం చేసేందుకు భారతీయ జనతా పార్టీని ఏదో విధంగా ఓడించడమే సరిపోదు. ఆ సమున్నత కార్య సాధనకు ఒక కొత్త తరహా సాంస్కృతిక రాజకీయాలు విశేషంగా అవసరం. సామాన్య ప్రజలతో వారి భాషలో, వారి సాంస్కృతిక సంవేదనలలో, వారి నైతిక నుడికారంలో నిరంతరాయంగా సంభాషించేందుకు అవి సంకల్పించాలి. ఆ లక్ష్య నిర్వహణకు దగ్గర దారులేవీ లేవు. 

యోగేంద్రయాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)