చైతన్యImage result for చైతన్య

స్వాతంత్య్రోద్యమంలో యువతరాన్ని ఉర్రూతలూగించిన నినాదాలు రెండు. ఒకటి ఇంక్విలాబ్‌ జిందాబాద్‌. రెండు వందేమాతరం. దాదాపు వందేండ్ల తర్వాత నవభారతాన్ని ఉర్రూతలూగిస్తున్న నినాదాలు రాజ్యాంగ పీఠిక. హల్లాబోల్‌. హం దేఖేంగే అన్న ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ కవిత. జాతీయపతాకం, అంబేద్కర్‌ చిత్రపటాలు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నెలరోజులకు పైగా సమాజంలోని అన్ని తరగతులు సాగిస్తున్న ఆందోళనలన్నింటిలోనూ ఏ రాజకీయ పార్టీకి చెందిన జెండాలు, నినాదాలు కనిపించటం లేదు. కనిపించేది ఒక్కటే. జాతీయ పతాకం. వినిపించేది ఒక్కటే రాజ్యాంగ పీఠిక.

ఈ రెండు వ్యక్తీకరణలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆరెస్సెస్‌ నాయకత్వంలో నడిచే సంఫ్‌ుపరివారం ప్రతిపాదిస్తున్న జాతీయవాదానికి, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న ప్రజల జాతీయవాదానికి మధ్య తేడా ఉంది. సంఫ్‌ుపరివారం ప్రతిపాదించే జాతీయవాదానికి మతం, మత విశ్వాసం, మతోన్మాదం పునాదిగా ఉంటే ప్రజలు ఆమోదించిన జాతీయత రాజ్యాంగ విలువల క్రోడీకరణతో ఉనికిలోకి వచ్చిన జాతీయత. జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో సంఫ్‌ుపరివార్‌ గూండాల దాడి తర్వాత విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపకులు దాడిని ఖండించటానికో ఎదురుదాడికో, వైస్‌ చాన్సలర్‌ కార్యాలయం ముందు ధర్నాకో వెళ్లలేదు. అందరూ రాజ్యాంగ ప్రతులు పట్టుకుని పీఠిక చదవటం ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారంతా రాజ్యాంగ పీఠికను ఆయుధంగా ఎందుకు మార్చుకున్నారు? నిన్న మొన్నటి వరకు రాజ్యాంగ వైఫల్యాల పట్ల నిర్వేదంతో ఉన్న ప్రజ నేడు అదే రాజ్యాంగాన్ని పోరాట సాధనంగా ఎందుకు మల్చుకున్నాయి?

భారత రాజ్యాంగాన్ని స్థూలంగా నాలుగు భాగాలుగా చూడొచ్చు. మొదటిది భారతదేశ ప్రాదేశిక సమగ్రత, సమైక్యతలకు సంబంధించిన అంశం. రెండోది పాలకవర్గాల ఆర్థిక ప్రయోజనాలు కాపాడే అంశం. దీన్నే మరో కోణంలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా చూపిస్తున్నాం. మూడోది సాధారణ ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని గ్యారంటీ చేసే అంశం. చివరి అంశం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశాలు. మొదటి రెండు కోణాల్లోనే గత ఆరున్నర దశాబ్దాలుగా రాజ్యాంగం దర్శించబడుతూ వచ్చింది. ఎక్కువగా చర్చించబడుతూ వచ్చింది. అందుకే ఆ కాలంలో రాజ్యాంగం, దాని విలువ గురించి పెద్దగా ప్రజలు చర్చించుకున్నది లేదు.

ప్రజల గౌరవప్రదమైన జీవనాన్ని అందించటానికి రాజ్యాంగం నిర్దేశించిన విధి విధానాలు మూడో భాగం. స్వాతంత్య్రానంతరం మొదటి మూడు దశాబ్దాల కాలాన్ని భారతీయ సామాజిక జీవనం స్థూలంగా భూస్వామ్య సంబంధాల ప్రభావంలో ఉన్న కాలంగా సామాజిక శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. స్వాతంత్య్రం తర్వాత భారతదేశాన్ని ఆధునిక సామాజిక విలువలతో రూపుదిద్దాలని ఆధునిక ప్రజాస్వామిక దేశంగా మార్చాలని రాజ్యాంగం కాంక్షించినా భూస్వామ్య సామాజిక సంబంధాల నుంచి భారతీయ సామాజిక జీవనం పాక్షికంగానైనా విడగొట్టుకోవటానికి దాదాపు మూడున్నర దశాబ్దాలు పట్టింది. ఇక్కడ ప్రస్తుత సందర్భం కోసం భూస్వామ్య సామాజిక విలువలు అంటే మనిషికున్న విలువ ఆ మనిషి పుట్టిన సామాజిక తరగతి, ప్రాంతం, మాట్లాడే భాషకున్న విలువ ద్వారా మాత్రమే గుర్తించగలగటాన్ని భూస్వామ్య వ్యవస్థ నాటి సామాజిక విలువగా పరిగణించవచ్చు. ఆధునిక సామాజిక విలువ అంటే మనిషి ఈ భవబంధాలతో సంబంధం లేకుండా స్వతంత్రుడైన మనిషిగా గుర్తించే విలువలు. గత నాలుగు దశాబ్దాలుగా దేశం ఆధునిక పౌర విలువల ఆలంబనగా ఎదుగుతోంది.

ఈ విలువలకు పునాదులు వేసిందే ఆధునిక విద్య. ఆధునిక విద్య హేతుబద్ధమైన, తర్కబద్ధమైన ఆలోచన సామర్థ్యాన్ని విద్యార్థులకు అందించింది. ఈ తరహా హేతుబద్ధం, తర్కబద్ధమైన ఆలోచన సామర్థ్యాన్ని భావితరాలకు అందించటం భారత విద్యా విధాన లక్ష్యంగా ఉండాలన్నది రాజ్యాంగ స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని అంతో ఇంతో అమలు జరపటంతో నవ భారత నిర్మాణానికి పునాదులు వేసే నవతరం ఉనికిలోకి వచ్చింది. ఈ నవతరమే నేడు తమను తయారు చేయటానికి పునాదులు వేసిన రాజ్యాంగాన్ని సారరహితం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చింది. ఈ ఆధునిక విలువలకు పునాదులు వేసిన విద్యావిధానాన్ని కాపాడుకోవాలని ఉద్యమిస్తోంది.

ఇక నాల్గో అంశం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం. ఇప్పుడున్న పరిమితుల్లోనైనా సామాజిక న్యాయం ప్రభుత్వ విధానంగా మారింది కనకనే అప్పటి వరకు సమాజంలో మనుషులుగా గుర్తింపునకు నోచుకోని విశాల ప్రజానీకం అటువంటి గుర్తింపు గౌరవానికి నోచుకున్నారు. ఇది తమకు రాజ్యాంగం అందించిన హక్కుగా గుర్తించారు. అటువంటి రాజ్యాంగ వ్యవస్థలను క్రమక్రమంగా బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్న విషయాన్ని నిదానంగానైనా గుర్తిస్తూ వచ్చారు.

బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా ప్రజలకు ప్రత్యేకించి అణగారిన వర్గాలకు గ్యారంటీ చేసిన హక్కులు, అధికారాలు, అవకాశాలు కొల్లగొడుతూ వచ్చింది. రాజ్యాంగం కల్పించిన మౌలిక రక్షణలను కొల్లగొట్టటం బీజేపీ ఉద్దేశ్యమే. తొలుత లవ్‌ జీహాద్‌ పేరుతో ముందుకొచ్చింది. అంతో ఇంతో ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాల పట్ల విముఖతతో ఉన్నందున ప్రజలు ఈ ప్రమాద తీవ్రతను గుర్తించలేకపోయారు. ఉత్తరప్రదేశ్‌, హర్యానాల్లో ఖాప్‌ పంచాయిత్‌ల ద్వారా దళితుల హక్కులు అధికారాలు దోచుకున్నా సోకాల్డ్‌ విద్యావంతులకు పెద్దగా ఫరక్‌ పడలేదు. ఒకప్పుడు మన ముందు కుక్కిన పేనుల్లా ఉన్న వాళ్లు ఈ రోజు విశ్వవిద్యాలయాలు, ఆఫీసుల్లో మనతో సమానంగా కూర్చుంటారా అన్న కడుపుమంటే దీనికి కారణం. ఉనాలో దళితులను బట్టలూడదీసి ట్రక్కుకు కట్టి చితకబాదుతున్న వీడియో వైరల్‌ అయినా పట్టించుకోని పరిస్థితులున్నాయి. 1980 దశకంలో లౌకికతత్వం గురించి సంఫ్‌ుపరివారం లోపాయికారీ ప్రచారం నిర్వహించినట్టే నేడు ఎస్సీ బీసీలకున్న రిజర్వేషన్ల గురించి లోపాయికారీ ప్రచారానికి ఆరెస్సెస్‌ తెర తీసింది.

ముస్లింలను లక్ష్యంగా మార్చుకుని గోరక్షణ దళాల పేరుతో వీరంగం వేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నా సాటి మనిషిని నిట్టనిలువునా హత్య చేస్తున్నారన్న స్పృహ ఇసుమంతైనా కలగలేదు. జమ్ము కాశ్మీర్‌ను నిట్ట నిలువునా చీల్చి రాష్ట్రం హౌదాతో పాటు రాజ్యాంగం అందించిన రక్షణలు రద్దు చేసినా దేశభక్తి కోసం ఆ మాత్రం త్యాగం చేయాలి కదా అని సర్దిచెప్పుకున్నాం. పార్లమెంట్‌ మొదలు రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న జనావళి ఉన్నదేశం మనది. ఏకంగా సీబీఐ డైరెక్టర్‌నే అరెస్టు చేయటానికి రాజ్యం కుట్ర పూనినా, రాఫెల్‌ కుంభకోణమని కంటికి కనిపిస్తున్నా, ఎన్నికల బాండ్ల పేర నల్లధనంతో ఎన్నికల జూదం ఆడుతున్నా, లక్షలాది కోట్ల ప్రజాధనంతో నిర్మితమైన ప్రభుత్వరంగ సంస్థల్ని కసాయివాడికంటే దారుణంగా తెగనమ్ముతున్నారు. అదేదో ఉద్యోగులకు మాత్రమే సంబంధించిన అంశమని, దేశ ప్రజలకు సంబంధించింది కాదన్న ఆలోచనలు మారాల్సిన సమయమిది.

ఇవన్నీ చేస్తున్నాప్రజల చైతన్యంలో ఉన్న పరిమితుల రీత్యా బీజేపీకి ధైర్యం వచ్చినట్టుంది. ఏకంగా ఓటేసిన ఓటరునే నువ్వు భారతీయుడివేనా అని నిలదీయటానికి సిద్ధమైంది. రాజ్యాంగం అందించిన ప్రయోజనాలన్నీ అనుభవిస్తూ వచ్చిన వాళ్లు నేడు పౌరులమేనని నిరూపించుకోవాల్సిన దుస్థితికి నెట్టడంతో ఒక్కసారిగా రాజ్యాంగం విలువేమిటో అర్థమైంది. మొన్న ముస్లింలు, నిన్న వామపక్షాలు, నేడు ఆలోచించే విద్యార్థులను లక్ష్యంగా మార్చుకున్న ప్రభుత్వం రేపు మరో తరగతిని ఏరిపారేయటానికి వెనకాడదన్న వాస్తవం ముందుకొచ్చింది. నేడు ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను లాగేసుకునేందుకు అనుమతిస్తే రేపు దళితులు, ఆదివాసీలు, మహిళలకు ఇచ్చిన హక్కులు గ్యారంటీ ఆందోళన రాజుకుంది. అందుకే రాజ్యాంగ సారాన్ని వండి వార్చిన పీఠిక పాఠమైంది. ఈ పీఠిక స్ఫూర్తికి ప్రభుత్వ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయని అర్థం చేసుకుంది ప్రజ. అందు వల్లనే ఏడు దశాబ్దాలుగా కాగితాలకు పరిమితమైన రాజ్యాంగ పీఠిక నవ భారత నిర్మాతల చేతుల్లో పోరాటాపు పొలికేక అయ్యింది. ప్రజలు పాలకుల ముందు లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర, ప్రజాస్వా మిక దేశ నిర్మాణమే లక్ష్యమని నిర్దేశించింది ఈ పీఠిక ద్వారానే. ఏకంగా రాజ్యాంగాన్నే పీకనులమటానికి పూనుకున్న పాలకుల చెర నుంచి రాజ్యాంగాన్ని కాపాడటానికి పీఠికే సాధనమైంది. ఈ పీఠికే నవతరం చేతుల్లో ఆయుధమై భావిభారత భాగ్య విధాత కానుంది. ఇదే నేడు దేశవ్యాప్తంగా సాగుతున్న యజ్ఞం. ఈ యజ్ఞ జ్వాల ఆరిపోకుండా ఉండాలంటే రాజ్యాంగ సారాన్ని ఇంటింటికీ చేర్చాలి. నేర్పాలి.

(Courtesy Nava Telangana)