రచన: శివమ్ విజ్జ్

నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు మరికొన్ని రోజులు
పొడిగించి మహారాష్ట్ర నుంచి ముంబైని విడగొట్టి ప్రత్యేక రాష్ట్రంగా మారుస్తుందని మీరు అనుకుంటున్నారా ?

హఠాత్తుగా తమిళనాడును కేంద్ర పాలిత ప్రాంతం చేస్తుందని భావిస్తున్నారా ?

ఒరిస్సా నాయకులందరని గృహ నిర్బంధం చేసి, కమ్యూనికేషన్ వ్యవస్థను స్తంభిపచేసి, సైన్యాన్ని దింపి ఆ రాష్ట్రాన్ని హఠాత్తుగా కేంద్ర పాలిత రాష్ట్రంగా చేస్తారని అనుమానిస్తున్నారా ?

ఉదయం పదకొండు గంటలకు అర్ధరాత్రి తరహా సైనిక చర్య జరిగింది!

మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏమైనా చేస్తుంది. చట్టాలు ప్రాంతాలు ప్రజల జీవితాలతో చలగాటాలాడుతుంది. భారత ప్రజాస్వామ్యానికి ఇది సుదీర్ఘ చీకటి రాత్రి.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 చచ్చిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో సోమవారం ఉదయం ప్రకటించేస్తారు. ఆర్టికల్ 35a కి కూడా కాలం చెల్లింది అన్నారు. లడఖ్ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం.

దీనికి శాసనసభ వుండదు. ఢిల్లీ, పుదుచ్చేరి లాగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం. నూతన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం గోవా కన్నా అధికారాల విషయంలో బలహీనంగా వుండనున్నది ఇదంతా చేసింది జాతీయ సమగ్రత కోసమేనని ఏలినవారు నమ్మబలుకుతున్నారు. రాబోయే నెలల్లో ఈ చర్య చట్టబద్దమేన అని చర్చలు, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తాయి. రాజకీయాలు, భిన్నపభిప్రాయాలు ఉంటాయి. ప్రజల మనసుల్ని విడగొట్టే వ్యూహాలు వుంటాయి. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మార్పులు చేపట్టేటప్పుడు చర్చలు, సంభాషణలు, వ్యతిరేకతలు ఉంటాయి. ఉండాలి కూడా. అంతిమంగా అందరూ కలిసి ఏకాభిప్రాయానికి రావాలి మోడీ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటు సమావేశాలు ప్రారంభంలోనే పెట్టి అని వర్గాల అభిప్రాయాలు విని ఆ తరువాత అంతిమ నిర్ణయం చేసి ఉండాల్సింది కానీ అందుకు భిన్నంగా మాజీ ముఖ్యమంత్రుల్ని గృహ నిర్బంధంలో పెట్టింది.

వీరంతా భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ముఖ్యమంత్రి పదవులు అధిష్టించిన వారే. మోడీ ప్రభుత్వం భారత దేశ భావన ( Idea of India ) నే మార్చేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం నుంచి నియంతృత్వం, క్రూర మెజారిటీ ఇజం వైపుకు మార్చి వేసింది. ఇదంతా ఇంత హఠాత్తుగా హడావిడిగా ఇప్పుడే ఎందుకు చేసినట్లు. దేశ ఆర్ధిక దుస్థితి నుంచి ప్రజల మనసుల్ని మరల్చేందుకు, మీడియా పతాక శీర్షికలని మార్చివేసేందుకే ఈ హడావిడి అంతా. ఇక కొన్ని వారాలపాటు దేశ చర్చ అంత కాశ్మీర్ చుట్టూనే తిరుగుతుంది.

కొన్నివారాల పాటు కాశ్మీర్ , కాశ్మీర్, కాశ్మీర్ గురించే జరుగుతుంది.దేశ ఆర్ధిక పరిస్థితి గురించి మోడీ ప్రభుత్వం ఇక సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. డీమానిటైజేషన్ వల్లనే మన ఆర్ధిక వ్యవస్థలో మంద గమనం ఏర్పడిందా? GST వ్యవస్థను గందరగోళ పరచిందా? కార్ల తయారీ రంగంలో ఊడిపోతున్న లక్షలాది ఉద్యోగాలని ఎలా కాపాడాలి? మీ ప్రశ్నలన్నింటికీ కాశ్మీర్ అంశమే ఇక సమాధానం ఇవ్వనున్నది!

దేశ ఆర్ధిక పరిస్థితి రాను రాను మరింతగా విషమించనున్నది చీకటి గుహలో వెలుగు దివ్వె కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వం ప్రజల నిత్య జీవిత సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు మరికొన్ని దుస్సాహసాలు చేయాల్సి రావొచ్చు. రామమందిర నిర్మాణం, దేశ వ్యాప్తంగా సిటిజెన్ షిప్ రిజిస్ట్రార్, రాజకీయంగా విభేదించే వారినందరిని UAPA చట్టం క్రింద టెర్రరిస్ట్ లుగా ముద్రవేయడం… ఏమైనా ఏమైనా జరగవొచ్చు.

స్వేచ్ఛానువాదం: B Bhaskar (సీనియర్ జర్నలిస్ట్)

ది ప్రింట్ సౌజన్యం తో..