భరత్ ఝున్‌ఝున్‌వాలా

పెద్ద సంఖ్యలో అనుబంధ సంస్థలను కలిగివున్న ప్రధాన కంపెనీల వ్యాపార పద్ధతుల చట్టబద్ధతను సంశయించాలి. అనుబంధ సంస్థల ఆదాయ వ్యయాలను సమగ్రంగా తనిఖీ చేయించాలి. సకాలంలో అటువంటి తనిఖీలు జరగకపోవడం వల్లే బ్యాంకులు నష్టాల పాలవుతున్నాయి. కంపెనీల దగాకోరు వ్యవహరాలను అరికట్టేందుకు బ్యాంకులు, ప్రభుత్వం మరింత చురుగ్గా, పటిష్ఠంగా వ్యవహరించాలి.

పెద్ద కంపెనీలు బ్యాంకులను తప్పుదోవ పట్టించినప్పుడు భారీ మోసం జరుగుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్‌ అండ్ ఎఫ్‌ఎస్), ఇంకా పలు బ్యాంకులు నీరవ్ మోదీ వ్యవహారంలో ఎదుర్కొన్న సమస్యలే ఇందుకు నిదర్శనాలు. మన జాతీయ బ్యాంకుల నుంచి రూ.76,000 కోట్ల రుణాలను తీసుకున్న మరో కంపెనీ వ్యవహారాలను నేను నిశితంగా అధ్యయనం చేశాను. ఆ కంపెనీ గణనీయమైన సంఖ్యలో అనుబంధ సంస్థ (సబ్సిడరీస్)లను నెలకొల్పింది. ఒక కుటుంబ పెద్ద తన కుమారుడి పేరిట ఒక దుకాణాన్ని నెలకొల్పడం లాంటిదే ఇది కూడా. అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.71,600 కోట్లు రుణంగా తీసుకున్నాయి. తీసుకున్న వెంటనే ఆ సొమ్మును, వివిధ పనులకు సంబంధించిన కాంట్రాక్టుల పేరిట, ప్రధాన కంపెనీకి బదిలీ చేశాయి. ఆరు అనుబంధ సంస్థలు రూ.3493 కోట్లను వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకొని, ఆ సొమ్ము నుంచి రూ.3067 కోట్లు తమ ప్రధాన కంపెనీకి చెల్లించాయి.

ఉత్తరాఖండ్‌లో ఒక అనుబంధ సంస్థ నిర్మిస్తున్న ఒక జల విద్యుదుత్పాదన కేంద్రం (హైడ్రో పవర్ ప్రాజెక్టు) వ్యవహారాలను కూడా పరిశీలించాను. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టులన్నిటినీ ఆ సబ్సిడరీ సంస్థ తన ప్రధాన కంపెనీకే ఇచ్చింది. సదరు ప్రాజెక్టు పనులకు గాను 2019 జూన్‌లో వినియోగమయిన మొత్తం 14,65,000 యూనిట్ల విద్యుత్‌లో కేవలం 18,000 యూనిట్లు లేదా 1.2 శాతాన్ని మాత్రమే ఆ అనుబంధ సంస్థ వినియోగించుకుంది. మిగతా 98.8శాతం విద్యుత్‌ను ప్రధాన కంపెనీయే వినియోగించుకుంది- తన సొంత అనుబంధ సంస్థకు ఒక ‘కాంట్రాక్టర్’గా.

ప్రధాన కంపెనీ తన నష్టాలను దాచిపెట్టడడమనేది అనుబంధ సంస్థ ద్వారా సుసాధ్యమవుతున్నది. నేను అధ్యయనం చేసిన హైడ్రో పవర్ ప్రాజెక్టు సృష్టించిన ఆస్తుల అసలు విలువ (ప్రభుత్వానికి సమర్పించిన డాక్యుమెంట్ల ప్రకారం) కేవలం రూ.565 కోట్లు మాత్రమే. అయితే ఆ ప్రాజెక్టు మరమ్మతు పనులకుగాను ప్రస్తుత మదుపు రూ.2000కోట్ల మేరకు వున్నది. 2013లో సంభవించిన ప్రళయసదృశ వరదల్లో ప్రాజెక్టు కట్టడాలు దెబ్బతిన్నాయి. వాటికి ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయి. దీంతో ప్రాజెక్టు సంపూర్ణ నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుత మదుపు (రూ.2000 కోట్లు) పూర్తిగా సమర్థనీయమైనదే‍‍. అయితే ఈ కొత్త మదుపు ఆస్తుల విలువను ఏ మాత్రం పెంచదనే వాస్తవాన్ని మనం విస్మరించకూడదు.

ఉదాహరణకు కుమారుడు తన కారుకు మరమ్మతులు జరిపించడానికి రూ.10,000 వ్యయంచేస్తాడు. ఈ వ్యయం పూర్తిగా సమంజసమైనదే. అయితే ఇది ఆ కుటుంబ కారు విలువను పెంచడానికి ఏ మాత్రం తోడ్పడదు. అదే విధంగా ఉత్తరాఖండ్ లోని ఆ అనుబంధ సంస్థ సదరు హైడ్రోపవర్ ప్రాజెక్టుకు మరమ్మతులు జరిపించేందుకై రూ.2000 కోట్లను వెచ్చిస్తున్నది. ఇలా వ్యయం చేస్తున్న రూ.2000 కోట్లను ప్రాజెక్టు ఆస్తుల విలువగా చూపించడం ద్వారా ఆ ప్రాజెక్టు సృష్టించిన ఆస్తుల అసలు విలువ రూ.565కోట్లు అనే వాస్తవాన్ని దాచిపెట్టడం జరుగుతోంది. ప్రధాన కంపెనీకి వాటిల్లిన రూ.1500 కోట్ల నష్టాన్ని దాచి పెట్టేందుకు అనుబంధ సంస్థ దోహదం చేస్తుంది.

ఆ ప్రధాన కంపెనీకి సంబంధించిన ఇతర అనుబంధ సంస్థలలో కూడా ఇదే విధమైన అస్తవ్యస్త వ్యవహారాలే వున్నాయి. ప్రధాన కంపెనీ, దాని అనుబంధ సంస్థల పనితీరును పరిశీలించినప్పుడు ఈ వాస్తవం మరింత స్పష్టమవుతుంది. 2018-–19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన కంపెనీ లాభాలు రూ.9200 కోట్లు కాగా అనుబంధ సంస్థల మొత్తం లాభాలు రూ.5400కోట్లు. అయితే ప్రధాన కంపెనీ బ్యాంకుల నుంచి కేవలం రూ.2400కోట్ల రుణం మాత్రమే తీసుకోగా అనుబంధ సంస్థలు సంయుక్తంగా 71,600 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాయి. దీన్ని బట్టి అనుబంధ సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ సొమ్మును ప్రధాన కంపెనీకి బదిలీ చేస్తున్నాయనే విషయం స్పష్టమవుతుంది కాంట్రాక్టుల రూపేణా ఈ నిధుల బదిలీ జరుగుతుంది. ఫలితంగా అనుబంధ సంస్థలు రుణగ్రస్తమవుతుండగా ప్రధాన కంపెనీ లాభాలతో వెలిగిపోతోంది. కుమారుడు బ్యాంకుల నుంచి భారీ రుణం తీసుకుని సొంత తండ్రికి లాభదాయకమైన కాంట్రాక్టులు ఇవ్వడం లాంటిదే ఇది కూడా. కుమారుడు నష్టాలను భరిస్తాడు, తండ్రి లాభాలతో వెలిగిపోతాడు. ప్రధాన కంపెనీ కేవలం రూ.2400 కోట్ల రుణం ఆధారంగా రూ.9200 కోట్ల లాభాలను ఆర్జించిందనే విషయాన్ని మాత్రమే బ్యాంకులు, ప్రభుత్వం, వాటాదారులు చూస్తారు. అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున రుణగ్రస్తమయ్యాయనే వాస్తవం వారికి అవగతం కావడం లేదు.

అయితే ఈ దొంగలెక్కల వ్యవహారాలు, దగాకోరు లావాదేవీలు నిరంతరంగా కొనసాగే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇది స్పష్టం. అనుబంధ సంస్థలు నష్టాల పాలవుతున్నాయనే వాస్తవాన్ని బ్యాంకులు గ్రహించే రోజు తప్పక వస్తుంది. అప్పుడు ఏ బ్యాంకు కూడా ఏ అనుబంధ సంస్థకు ఎటువంటి రుణం ఇవ్వబోదు. ఇటువంటి పరిణామం సంభవించినప్పుడు ఉత్తరా ఖండ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన కంపెనీ కుప్పకూలిపోతుంది. ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ విషయంలో ఇదే జరిగింది. మరి ప్రస్తావిత ప్రధాన కంపెనీ విషయంలో ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రశ్న .

బ్యాంకులు, ప్రభుత్వం మరింత చురుగ్గా, పటిష్ఠంగా వ్యవహరించాలి. పెద్దసంఖ్యలో అనుబంధ సంస్థలను కలిగివున్న ప్రధాన కంపెనీల వ్యాపార పద్ధతుల చట్టబద్ధతను సంశయించాలి. అనుబంధ సంస్థల ఆదాయ వ్యయాలను సమగ్రంగా తనిఖీ చేయించాలి. సకాలంలో అటువంటి తనిఖీలు జరగకపోవడం వల్లే బ్యాంకులు నష్టాల పాలవుతున్నాయి. నీరవ్ మోడీ, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఉదంతాలకు ఈ వైఫల్యమే కారణం. తండ్రి విశ్వననీయతను గాక కుమారుడి వ్యాపార దక్షత, లాభాల ఆర్జనను బ్యాంకులు విధిగా చూడాలి.