– ఏడాది పాటు నిర్వహణ : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో నిర్ణయం 
– ఏడాది పాటు ఉత్సవాలు: సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో నిర్ణయం 

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భావ శత వార్షికోత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. ఈ మేరకు జులై 31న ఇక్కడ జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పొలిట్‌బ్యూరో గురువారం ఒక ప్రకటనలో వివరించింది. దీనితో పాటు పలు సమకాలీన అంశాలపై కూడా తాము చర్చించినట్టు పొలిట్‌బ్యూరో వెల్లడించింది. 1920 అక్టోబర్‌ 17న అప్పటి సోవియట్‌ రష్యాలోని తాష్కెంట్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 99 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్‌ 17 నుంచి 2020 అక్టోబర్‌ 17 వరకూ పార్టీ ఆవిర్భావ శతవార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపింది. మన దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ ఘన చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం, స్వతంత్ర భారతంలో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, శ్రామికవర్గ, రైతాంగ హక్కుల పరిరక్షణకు నిర్వహించిన పోరాటాలపై విస్తృత ప్రచారం చేయాలని వివిధ స్థాయిల్లోని కమిటీలకు పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.

ఆర్థిక మందగమనం

ప్రపంచ దేశాలన్నింటితో పాటు మన దేశంలో కూడా కొనసాగుతున్న ఆర్థిక మందగమన పరిస్థితులు, నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, దీనికి తోడు విస్తరిస్తున్న వ్యవసాయ సంక్షోభం మన దేశంలో మెజార్టీ ప్రజల జీవన పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. భారత పారిశ్రామిక ప్రగతి 44 ఏండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. గత ఏడాది జూన్‌లో నమోదయిన 7.8 శాతంతో పోల్చుకుంటే ఈ ఏడాది జూన్‌లో 0.2 శాతం మాత్రమే నమోదైంది. దేశ జీడీపీలో 7.5 శాతం మేర వనరులు సమకూరుస్తూ వస్తూత్పత్తి జీడీపీలో 49 శాతం మేర విస్తరించి కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆటోమొబైల్‌ పరిశ్రమ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలోని మొత్తం 17 కార్ల కంపెనీలలో 10 కంపెనీల తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. దీనితో ఉత్పత్తి తగ్గింపునకు ఆ కంపెనీలు చర్యలు చేపడుతుండటంతో ఈ రంగంలో ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆటోమొబైల్‌ అనుబంధ పరిశ్రమల్లో దాదాపు పదిలక్షల మందికి ఉద్వాసన పలికినట్టు తెలుస్తోంది.

విస్తృత స్థాయిలో ప్రయివేటీకరణ

గత మే నెలలో మరోసారి అధికార పగ్గాలను చేపట్టిన నరేంద్రమోడీ సర్కారు ఇప్పుడు విస్తృత స్థాయిలో ప్రయివేటీకరణ చర్యలు చేపట్టింది. ఇందులో ముందుగా రక్షణ రంగానికి చెందిన 42 ఉత్పత్తి యూనిట్లను ప్రయివేటీకరించనున్నారు. 42 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు, డీఆర్‌డీఓ యూనిట్లు, ఇతర అనుబంధ ఇంజనీరింగ్‌ సేవల విభాగాలలో ప్రస్తుతం దాదాపు 4 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనులు చేస్తున్నారు. ప్రయివేటీకరణతో వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలను ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేసిన కేంద్ర సర్కారు ఇప్పుడు మరో 20-25 విమానాశ్రయాలను ప్రయివేటీకరించేందుకు సిద్దమవుతున్నది. భారతీయ రైల్వేలను దశలవారీగా ప్రయివేటీకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో తన వాటాను రానున్న మూడేండ్ల కాలంలో 49 శాతానికి తగ్గించుకునేందుకు మోడీ సర్కారు ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.

సమాచార వక్రీకరణ 

దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో వున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం వాస్తవాలను తొక్కిపట్టి సమాచార వక్రీకరణకు పాల్పడుతోంది. ఈ వక్రీకరించిన సమాచారం ఆధారంగానే బడ్జెట్‌ లెక్కలు వేసినట్టు ఇప్పటికే రుజువైంది. బడ్జెట్‌ లెక్కల్లో కనీసం రు.1.7 లక్షల కోట్ల మేర తేడాలున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ వసూళ్లు లక్ష్యాలను అందుకోలేక చతికిలపడిపోతున్న సమయంలో రెవిన్యూ వసూళ్లను గోరంతలు కొండంతలు చేసి చూపారు. కాగ్‌ అంచనాల ప్రకారం ప్రభుత్వ ద్రవ్యలోటు జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 3.42 లక్షల కోట్లకు చేరింది. ఇది 2019-20 బడ్జెట్‌ అంచనాలలో 61.4 శాతానికి సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా మూడు త్రైమాసికాలు ముందున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటించే విషయంలో చెబుతున్న దానికి, వాస్తవ పరిస్థితులకు ఏ మాత్రం పొంతన కన్పించటం లేదు. దేశంలో నిరుద్యోగిత తారస్థాయికి చేరుకున్నా, ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగావకాశాలకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా సేకరించలేదు. వ్యవసాయ సంక్షోభం మరింత ముదిరిన సమయంలో వెలుగుచూడని రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన సమాచారం ఊసేలేదు.

ఆశ్రితపెట్టుబడిదారీ విధానం 

బ్యాంకుల్లో పేరుకుపోతున్న అనుత్పాదక ఆస్తుల (ఎన్పీఏ)ను తగ్గించామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుని దేశ సంపదను కొల్లగొడుతుండటం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. వాస్తవానికి ఈ ఏడాది కాలంలో దేశంలోని ఆర్థిక సంస్థల వద్ద ఎన్పీఏల మొత్తం 2,30,811 కోట్ల రూపాయలకు చేరినట్లు బ్యాంకుల రికార్డులే చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రు.1.96 లక్షల కోట్ల రుణాలను రద్దుచేసిన తరువాత పరిస్థితి ఇది.

పార్లమెంటరీ వ్యవస్థపై దాడి 

ఎన్నికల అనంతరం ఏర్పడిన కొత్త పార్లమెంట్‌ తొలి సమావేశాలలోనే బీజేపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన చట్టాలకు ఆమోదముద్ర పొందింది. ఒకసారి పార్లమెంట్‌ ఏర్పడి దాని స్థాయీ సంఘాలు, సభా సంఘాలు ఏర్పడిన తరువాత చట్టపరమైన అంశాలన్నింటినీ ఆయా కమిటీలు పరిశీలించటం సంప్రదాయంగా వస్తోంది. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ సంప్రదాయానికి తెరదించింది. కొత్త పార్లమెంట్‌లో ఇప్పటి వరకూ ఏ ఒక్క కమిటీని ఏర్పాటు చేయలేదు. పదిహేడు ప్రధానమైన చట్టాలను ఎటువంటి పరిశీలనా లేకుండానే ఆమోదముద్ర పొందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పార్లమెంట్‌ సమావేశాలను పొడిగించింది. బిల్లుల పరిశీలనకు సెలెక్ట్‌ కమిటీలను ఏర్పాటుచేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్లను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. బీజేపీకున్న మందబలంతో ఈ బిల్లులన్నింటికీ పార్లమెంట్‌ ఆమోదం లభించింది.

సమాఖ్య స్పూర్తికి తూట్లు 

చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)కు పార్లమెంట్‌ ఆమోదించిన సవరణ బిల్లుతో, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయాల్సిన అవసరం లేకుండా ఏ వ్యక్తినయినా ఉగ్రవాదిగా ప్రకటించి జైలుకు పంపే అధికారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ తొందర పడుతోంది. అటువంటి వ్యక్తుల ఆస్తులను కూడా ప్రభుత్వం జప్తు చేసుకోవచ్చు. ఈ సవరణ చట్టంతో ప్రభుత్వం పట్ల అసమ్మతి వ్యక్తం చేసే ప్రతి వ్యక్తీపైనా టెర్రరిస్టు ముద్రపడుతుంది. ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలు చట్టపరంగా రుజువు కావాలన్న సూత్రం తిరగబడి, నిందితుడే తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది భారీయెత్తున వేధింపులకు, ప్రతీకారాలకు, అన్యాయానికి దారి తీస్తుంది. శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్రాల పరిధిలో నిర్దేశించిన సమాఖ్య భావనకు ఇది తూట్లుపొడుస్తోంది. సమాచార హక్కును కాలరాసే విధంగా రూపొందించిన స.హ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదముద్ర వేసింది. వెల్లడించటానికి ఇష్టపడని సమాచారాన్ని తొక్కిపట్టేందుకు ఈ బిల్లు ప్రభుత్వానికి వీలు కల్పిస్తోంది. ఇది రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను పూర్తిగా ఉల్లంఘించటమే అవుతుంది. వివాహ ఒప్పందాన్ని రద్దు చేసుకోవటాన్ని నేరపూరితం చేస్తూ ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా ఇది భారీయెత్తున దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయి. బీజేపీ తన రాజకీయ ఎజెండాను నెరవేర్చుకునేందుకు సీబీఐని అడ్డగోలుగా ఉపయోగించుకోవటం యథేచ్ఛగా కొనసాగుతోంది. అదే విధంగా ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కూడా… ఈ సంస్థలు తరచు జారీ చేస్తున్న హెచ్చరికలు ప్రాంతీయ రాజకీయ పార్టీలను నిర్వీర్యం చేయటానికి ఉద్దేశించినవే కాక పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించినవి కూడా… అదే విధంగా సుప్రీంకోర్టు, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌, కాగ్‌, వంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఆయా స్థాయిల్లో ప్రభుత్వం నుండి వత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాలన్నీ దేశంలో రాజ్యాంగ వ్యవస్థను కాలరాస్తున్నాయి.

మతచిచ్చు

పాలక వర్గం మతాల మధ్య పెడుతున్న చిచ్చు దేశ వ్యాప్తంగా విద్వేషం, అసహనం, హింస పెరగటానికి దారి తీస్తోంది. దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ గోమాంసం తిన్నారనో, ‘జై శ్రీరాం’ అనటానికి వ్యతిరేకించారనో దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనల్లో అధికశాతం యూపీలోనే వెలుగుచూస్తున్నాయి. ఇంకా జార్ఖండ్‌, మహారాష్ట్ర, అసోం, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాల్లో కూడా ఈ ఘటనలు జరుగుతున్నట్టు వార్తలందుతున్నాయి.

నియంతృత్వ దాడులు 

బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన ఈ రెండు నెలల కాలంలో ప్రజల ప్రజాతంత్ర, పౌర హక్కులపై దాడులు అనూహ్య రీతిలో పెరిగిపోతున్నాయి. బీజేపీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వారి భావాలను షేర్‌ చేసుకున్నారన్న ఆరోపణలపై యూపీలో అనేక మందిని అరెస్ట్‌ చేశారు. అదే విధంగా ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలయిన అసోం, త్రిపుర, ఉత్తరాఖండ్‌, గోవా తదితర రాష్ట్రాల్లో కూడా అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఆదాయపు పన్ను (ఐటీ) చట్టంలోని భయానకమైన 66ఎ సెక్షన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చినప్పటికీ ఈ సెక్షన్‌ ద్వారా తమను టార్గెట్‌ చేస్తారన్న భయాందోళనలు సోషల్‌ మీడియాను వినియోగించే వారిలో పెరిగిపోతున్నాయి. సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలను ‘అర్బన్‌ నక్సల్స్‌’ పేర టార్గెట్‌ చేసే ధోరణి కూడా నానాటికీ పెరిగిపోతోంది. ప్రభుత్వానికి, ఆరెస్సెస్‌, బీజేపీ, వాటి నేతలకు వ్యతిరేకంగా గొంతువిప్పే వారి గళాలను మూయించటమే ఈ చర్యల అంతిమలక్ష్యం.

కార్మిక(వ్యతిరేక) సంస్కరణలు 

ప్రస్తుతం అమలులో వున్న 17 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త చట్టాలను తెస్తామని కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే శ్రామికవర్గం తమ ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రజాతంత్ర హక్కులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిపాదిత కొత్త చట్టాలు ఈ హక్కులను పూర్తిగా కాలరాయటానికి ఉద్దేశించినవేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యమాలు, పోరాటాల ద్వారా శ్రామిక వర్గం సాధించుకున్న హక్కులను కాపాడాల్సిన అవసరం వుంది. ప్రతిపాదిత చట్టాలకు వ్యతిరేకంగా నేడు (శుక్రవారం) కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చిన దేశవ్యాప్త ఐక్య నిరసనకు సీపీఐ(ఎం) సంఘీభావం తెలపటంతో పాటు మద్దతును ప్రకటిస్తోంది.

కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి..

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పొలిట్‌బ్యూరో డిమాండ్‌ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో పార్లమెంట్‌తోపాటే అసెంబ్లీకి కూడా ఏకకాల ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలన్నీ డిమాండ్‌ చేస్తున్నప్పటికీ రద్దయిన అసెంబ్లీకి ఇప్పటి వరకూ ఎన్నికలు నిర్వహించలేదు. ఇందుకు సంబంధించి స్పష్టమైన వివరణ కూడా ఏదీ ఇవ్వటం లేదు. భద్రతా పరమైన అంశాలే కారణమైతే లోక్‌సభ ఎన్నికలు నిర్వహించినపుడు అసెంబ్లీ ఎన్నికలను ఎందుకు నిర్వహించలేరు? జమ్మూ కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని కాపాడుతున్న రాజ్యాంగంలోని 35ఎ అధికరణను రద్దు చేస్తామంటూ కేంద్ర హోం మంత్రి, పలువురు బీజేపీ నేతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి మిగిలిన దేశంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదం వుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో వున్నందున న్యాయవ్యవస్థ పరిశీలన పూర్తయ్యే వరకూ ఎదురు చూడాలి. అన్ని వర్గాలతో చర్చలు చేపడతామంటూ దీర్ఘకాలంగా ఇస్తున్న హామీని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. కాశ్మీర్‌ లోయలో శాంతి, సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి ఇది అత్యవసరం. ఉగ్రవాద దాడులు పెరుగుతున్నాయన్న సాకుతో రాష్ట్రంలోకి కేంద్రం అదనపు బలగాలను తరలిస్తోంది. అయితే భద్రతా పరమైన చర్యలతోపాటు సమాంతరంగా చర్చల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే వరకూ రాష్ట్రంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరే అవకాశం లేదన్నది సుస్పష్టం.

రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటం 

ప్రతిపక్షాలు లేకుండా తామే ఈ దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలాలన్న ఉద్దేశంతో బీజేపీ ఇతర పార్టీల పాలనలోవున్న రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్‌-జేడీ(ఎస్‌) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కాషాయ పార్టీ ఇటీవల నిర్వహించిన రాయ’బేరాలే’ ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుండే అధికారం కోసం గాలం వేస్తున్న బీజేపీ, సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చేయని ప్రయత్నాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఇతర ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలపై గురి పెట్టింది.

అసోంలో ఎన్‌ఆర్సీ ప్రక్రియ 

అసోంలో కొనసాగుతున్న జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ) ప్రక్రియలో తుది జాబితాను ఈ నెల 31 నాటికి ప్రచురించాల్సి వుంది. ఇప్పటి వరకూ ఇందులో చోటు దక్కని వారు 40.7 లక్షల మంది కాగా, అదనంగా మరో 1.02 లక్షల మంది దరఖాస్తు దారులు జాబితాలో తమ పేర్లకోసం ఎదురు చూస్తున్నారు. అసలైన భారతీయ పౌరులకు ఈ జాబితాలో స్థానం దక్కటం లేదన్న అభ్యంతరాలు అసంఖ్యాకంగా వ్యక్తమవుతున్నాయి. తుది జాబితా ప్రచురితమైన తరువాత వీరికి తమ వాదనను వినిపించుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇందుకు న్యాయాధికారాలు లేని ఫారినర్స్‌ ట్రిబ్యునల్‌ వేదిక కాకూడదు. ‘నాన్‌ సిటిజెన్స్‌’గా మిగిలిపోయే వారి పరిస్థితి, వారి హక్కుల విషయమై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి. విదేశీయులుగా ప్రకటించిన తరువాత కూడా నిర్బంధ కేంద్రాలలో వుంచుతున్న వారి పరిస్థితిపై పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. కిక్కిరిసిపోయిన ఈ నిర్బంధ కేంద్రాలలో పరిస్థితులు అత్యంత దుర్భరంగా వున్నాయి. దాదాపు 335 మందికి పైగా ‘విదేశీయులు’ ఈ నిర్బంధ కేంద్రాలలో మూడేండ్లకు పైగా ఉంటున్నట్టు తెలుస్తోంది. నిర్బంధితుల మానవ హక్కులు ఉల్లంఘిస్తున్న ఇటువంటి దుర్భర పరిస్థితులతో ప్రభుత్వం ఈ నిర్బంధ కేంద్రాలను నిర్వహించకూడదు.

అటవీ హక్కుల చట్టంపై చర్చలు 

ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో వున్న అటవీ హక్కుల చట్టాన్ని సమర్దించటంలో మోడీ సర్కారు ఘోర వైఫల్యంపై దేశవ్యాప్తంగా వున్న ఆదివాసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టాలు నిరాకరించబడిన దాదాపు 23 లక్షల ఆదివాసీ కుటుంబాలపై తరిమివేత కత్తి వేలాడుతోంది. అటవీ ప్రాంతాలలో నివశిస్తున్న ఆదివాసీలను తరిమివేయకుండా వారికి రక్షణ కల్పిస్తూ అటవీ హక్కుల చట్టాన్ని నిర్ద్వంద్వంగా సమర్ధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేస్తోంది. అదే సమయంలో ఆదివాసీలకు అడవులు, అటవీ ఉత్పత్తులపై హక్కులను కాలరాసే 1927 వలస పాలనా కాలం నాటి అటవీ చట్టాన్ని రద్దు చేయటానికి బదులుగా దానికి మరిన్ని కోరలు తొడిగే సవరణలను మోడీ సర్కారు ప్రతిపాదిస్తోంది. ఈ సవరణలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దాడులకు యతిరేకంగా ఆదివాసీలు కొనసాగిస్తున్న పోరాటాలకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతునిస్తోంది.

బేటి బచావ్‌పై బీజేపీ అహంకారం 

ఉన్నావోలో లైంగికదాడి కేసు, ఇందులో ప్రధాన నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే చర్యలు ఆ పార్టీ గొప్పగా చెప్పుకుంటున్న ‘బేటి బచావ్‌..’ విషయంలో అనుసరిస్తున్న అహంకార పూరిత ధోరణికి అద్దం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా గగ్గోలు పుట్టిన తరువాత ఇప్పుడు తాపీగా నిందితుడైన ఎమ్మెల్యేను వెలివేసామని కాషాయ పార్టీ చెప్పుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన నాలుగు కేసులను ఢిల్లీ న్యాయస్థానానికి అప్పగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయటం హర్షణీయం. రేప్‌ బాధితుల మనుగడ, న్యాయపోరాటంలో వారెదుర్కొంటున్న కష్టాలకు ఈ కేసు నిలువెత్తు ఉదాహరణ. దేశవ్యాప్తంగా మహిళలు, ముఖ్యంగా చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని నిరోధించి బాధితులకు న్యాయం చేసేందుకు వర్మ కమిటీ చేసిన సూచనలను సత్వరమే అమలు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది.

వరద పరిస్థితి 

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న వరద పరిస్థితి తీవ్రతపై పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అనేక నదులు ప్రమాద స్థాయిని దాటి పొంగి పొర్లుతుండటంతో అసోం, బీహార్‌, యూపీ, తదితర రాష్ట్రాలు భారీ వరదలను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. వరదబాధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సత్వర సాయం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పొలిట్‌బ్యూరో కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

(Courtacy Nava Telangana)