Image result for అంటువ్యాధుల దండయాత్ర వందసార్లకుపైనే!"హైదరాబాద్‌: సాధారణంగా కలుషిత నీరు, ఆహారం, గాలి ద్వారానే అంటువ్యాధులు ఎక్కువగా వ్యాప్తిచెందుతుంటాయి. ఒకటి, రెండు కేసులను అక్కడక్కడా గుర్తించడం మామూలే. అయితే ఒకేసారి పదుల సంఖ్యలో అంటువ్యాధులు ప్రబలితే దాన్ని ‘అవుట్‌ బ్రేక్‌’గా వైద్యఆరోగ్య శాఖ పరిగణిస్తుంది. ఇలాంటి పరిస్థితులు దేశం మొత్తమ్మీద 2016-2018 మధ్యకాలంలో 5,999 చోటుచేసుకోగా, తెలంగాణలో 113గా నమోదయ్యాయి. గత మూడేళ్లలో దేశంలో అంటువ్యాధుల సరళిపై జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ (ఎన్‌సీడీసీ) తాజాగా కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా అంటువ్యాధుల తీవ్రత తగ్గినట్లుగా తెలుస్తోంది. నియంత్రణ సంస్థలను నెలకొల్పడంలో భాగంగా అధునాతన ప్రయోగశాలలను ఏర్పాటుచేయనున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

2016-18 మధ్య పెద్దసంఖ్యలో ‘అవుట్‌ బ్రేక్‌’ కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర(571), కర్ణాటక(557), బిహార్‌(541), ఉత్తర్‌ప్రదేశ్‌(524) ముందువరుసలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 122 నమోదయ్యాయి. వీటిలో అత్యధికం డెంగీ, మలేరియా, డయేరియా కేసులే ఉన్నాయి.
2018లో దేశవ్యాప్తంగా 15266 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా.. 1,113 మంది మృత్యువాతపడ్డారు. అత్యధిక మరణాలు మహారాష్ట్ర(461)లో చోటుచేసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌(221), గుజరాత్‌(97), కర్ణాటక(87), కేరళ(53), తమిళనాడు(43), మధ్యప్రదేశ్‌(34), తెలంగాణ(28), ఆంధ్రప్రదేశ్‌(17) రాష్ట్రాలున్నాయి.

(Courtesy Eenadu)