కోల్‌ ఇండియా అనుబంధ   సంస్థ పేరిట వెబ్‌సైట్‌
ఉద్యోగాల భర్తీ పేరుతో నిలువునా వంచన
నకిలీ ప్రకటన చూసి మోసపోయిన నిరుద్యోగులు
చూపిన ఖాళీల సంఖ్యే 88,585
లక్షల్లో నిరుద్యోగులు.. రూ. కోట్లలో సమర్పణ!

ప్రభుత్వరంగ సంస్థ కోల్‌ ఇండియాలో భారీగా ఉద్యోగాల భర్తీ పేరుతో ఓ వెబ్‌సైట్‌ నిర్వాహకులు నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపు పదిహేనురోజులపాటు వారి దందా యథేచ్ఛగా సాగిపోయాక.. వేలాదిమంది నిరుద్యోగులు మోసపోయాక తీరిగ్గా ఇప్పుడు.. అది తమకు అనుబంధ సంస్థ కాదంటూ కోల్‌ ఇండియా ప్రకటించడం విశేషం. దీంతో నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు.

కోల్‌ ఇండియాలో ఎనిమిది అనుబంధ పరిశ్రమలు, ఒక ప్రణాళిక విభాగం ఉన్నాయి. ఈ సంస్థలో దాదాపు 2,98,066 మంది పనిచేస్తున్నారు. ఇటీవల ఒక వెబ్‌సైట్‌లో కోల్‌ ఇండియాకు అనుబంధంగా సౌత్‌ సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక సంస్థను సృష్టించి అందులో ఏకంగా 88,585 ఖాళీలు భర్తీ చేస్తున్నామంటూ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. కోల్‌ ఇండియాకు అనుబంధంగా వివిధ రాష్ట్రాల్లో ఎనిమిది పరిశ్రమలు విస్తరించి ఉండటం, వాటి పేర్లు ఎక్కువమందికి తెలియపోవడంతో నకిలీల పని సులభతరం అయింది. పదో తరగతి నుంచి ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్‌ వంటి అర్హతలు ఉన్న వారందరికీ ఉద్యోగాలని.. ఆకర్షణీయమైన వేతనాలతోపాటు టీఏ, డీఏలు అదనం అంటూ పేర్కొనడంతో నిరుద్యోగులు ఆశపడి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుకు రూ. 350 చొప్పున చెల్లించారు. ఆన్‌లైన్‌, రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయని అందులో పేర్కొన్నారు. రుజువు చూపితే ఎస్సీ, ఎస్టీలకు ప్రయాణ ఖర్చులను చెల్లిస్తామంటూ నమ్మబలికిందీ ప్రకటన.

ఏ పోస్టూ వదలలేదు.. 
జూనియర్‌ ఇంజినీర్లు, ఎంటీఎస్‌ సర్వేయర్లు, అకౌంట్స్‌ క్లర్క్‌, జూనియర్‌ క్లర్క్‌, అకౌంటెంట్‌, స్టెనోగ్రాఫర్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌, హెవీ మోటార్‌ డ్రైవర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, వెల్డర్‌, మెషినిస్టు, డీజిల్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, సూపర్‌వైజర్‌.. ఇలా మొత్తం 26 క్యాటగిరిల్లో బొగ్గు పరిశ్రమలో ఉన్నవీ, లేని ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగులకు టోకరా వేసినప్పటికీ సైబర్‌ క్రైం అధికారులెవ్వరూ స్పందించకపోవడం విశేషం.

జులై 25న విడుదల అయినట్లున్న ఈ నోటిఫికేషన్‌ వాస్తవమైనదో కాదో కూడా తెలుసుకోకుండానే కొన్ని వార్తా సంస్థలు ఖాళీల గురించి ప్రస్తావిస్తూ కథనాలు ఇచ్చాయి. ముఖ్యంగా కొన్ని ఆంగ్ల పత్రికలు, టీవీలు ఎక్కువగా ప్రస్తావించడంతో చాలామంది నమ్మారు. ఇన్నిరోజులపాటు వారి మోసం సాగిపోయాక కోల్‌ ఇండియా స్పందించింది. సౌత్‌ సెంట్రల్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ పేరుతో తమకు అనుబంధంగా ఎలాంటి సంస్థ లేదని ప్రకటించింది.

ఎవరీ లావణ్య?  
సాధారణంగా వెబ్‌సైట్‌ అడ్రస్‌లను, డొమైన్‌ను కేటాయించే ‘గోడాడీ’ వెబ్‌సైట్‌ ద్వారా ఈ నకిలీ ప్రకటన వెబ్‌సైట్‌ గురించి ఆరా తీయగా.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చిరునామాతో.. ఈ ఏడాది జూన్‌ 22న సిద్దు లావణ్య పేరుతో దానిని రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తెలుస్తోంది. దరఖాస్తు చేసుకోడానికి అక్టోబరు 19 చివరి గడువుగా పేర్కొన్నప్పటికీ రెండురోజుల నుంచి ఈ వెబ్‌సైట్‌ తెరుచుకోవడం లేదు. ఇప్పటికైనా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దీనిమీద దృష్టి సారించాలని మోసపోయిన నిరుద్యోగులు కోరుతున్నారు.