పారిశ్రామిక రంగంలో పెట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి, ఖనిజం లాంటి తరిగిపోయే వనరును వెలికి తీయడానికి, అందుకు సంబంధించిన రంగంలో పెట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి మధ్యగల మౌలికమైన తేడాను ప్రముఖ ఆర్థికవేత్త జోన్‌ రాబిన్‌సన్‌ ఎత్తి చూపారు.

ఒక విదేశీ కంపెనీ ఈ రెండు రంగాలలో విడివిడిగా రూ.100 లాభాన్ని ఆర్జించి తన దేశానికి తరలించిందని అనుకుందాం. సదరు గని లోని ఖనిజాన్ని పదేళ్లపాటు వెలికి తీయవచ్చని అనుకుందాం. పదవ సంవత్సరం చివరలో గనిలో ఖనిజం అయిపోతుంది. కానీ పరిశ్రమ కొనసాగుతూనే ఉంటుంది. ఈ కాలంలో రెండు విభాగాల లోనూ ఆ విదేశీ కంపెనీ ప్రతి సంవత్సరం ఒక్కొక్క రంగంలో విడివిడిగా ఆర్జించిన రూ.100 లాభం విదేశాలకు తరలింపబడుతూనే ఉంటుంది.
దీనర్థం పారిశ్రామిక రంగంలో ఎల్లవేళలా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వానించాలని చెప్పినట్టు కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో (ఉదాహరణకు ఒక పరిశ్రమ విదేశీ మారక ద్రవ్యాన్ని నికరంగా ఆర్జిస్తున్న స్థితిలో) పారిశ్రామిక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవచ్చు. అయితే ఒక దేశం తన ఖనిజ వనరుల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవలసిన అవసరం ఎప్పటికీ ఉండకూడదు. ప్రభుత్వ రంగంలో ఎటువంటి పరిమిత వనరునైనా వెలికి తీయటానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఉపయోగించరాదనే వాదన కూడా ఉంది. ఎందుకంటే ఈ వనరులు పరిమితమైనవి గనుక. అంతేకాకుండా అటువంటి వనరులను గరిష్టంగా వెలికి తీసేలా చూడటం, సమాజ అవసరాలకు దానిని పూర్తిగా ఉపయోగపడేలా చూడటం అవసరం. ఇది జరగాలంటే ఈ వనరులపై సామాజిక నియంత్రణ ఉండాలి. అందుకే వాటిని ప్రభుత్వ రంగంలో ఉంచుతారు.
ఈ అవగాహన కారణంగానే చాలా కాలంపాటు బొగ్గు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతించకూడదు అనేది భారతదేశ విధానంగా ఉంది. థర్మల్‌ పవర్‌, ఉక్కు, సిమెంట్‌ పరిశ్రమలకు ప్రత్యేకంగా (క్యాప్టివ్‌) గనులను కేటాయించటం ద్వారా ఈ విధానాన్ని సడలించటం జరిగింది. అయితే ఈ గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును బహిరంగ మార్కెట్‌లో అమ్మకూడదనే నిబంధన ఉండేది. అయితే ప్రస్తుతం ఈ విధానం మారింది. బొగ్గు రంగంలో ప్రయివేటు పెట్టుబడులే కాకుండా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వయంచాలక మార్గంలో అనుమతిస్తున్నట్టు మోడీ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 83 శాతం బొగ్గుని ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌కు వున్న గుత్తాధిపత్యం అంతం అవుతుంది.
ఈ చర్యను సమర్థించుకోవటానికి అన్ని రకాల బూటకపు వాదనలను ముందుకు తెస్తున్నారు. మనం 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందటానికి అది ఉపయోగపడుతుందని హాస్యాస్పదంగా వాదిస్తున్నారు. ‘ఎవరికైనా ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఏదైనా చెయ్యవచ్చని అంటే ఏం చేసినా సమర్థనీయమనే భావన సరియైనది కాదు. బొగ్గు రంగంలో అది ‘పోటీతత్వాన్ని’ పెంచుతుందనే వాదన ఉంది. ‘పోటీతత్వం’ లేకపోవటం వల్ల దేశ ప్రజల మీద ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉందనే విషయాన్ని ఇలా వాదించేవాళ్ళు ఎన్నడూ వివరించరు. కోల్‌ ఇండియా ఒక ప్రభుత్వ రంగ కంపెనీ. బొగ్గు రంగంపై తనకున్న గుత్తాధిపత్యం కారణంగా అది ధరలను పెంచదు. అటువంటప్పుడు ‘పోటీతత్వాన్ని’ పెంచటం అనే మాటకు అర్థం ఏముంటుంది?
దీనితో మరింతగా ‘సామర్థ్యం’ పెరుగుతుందనేది మూడవ వాదన. ‘సామర్థ్యానికి’ సంబంధించిన సూచిక ఏమీ లేదు. ఉదాహరణకు ఒక్కో యూనిట్‌ బొగ్గు ఉత్పత్తికి ఏయే ఇన్‌పుట్స్‌ ఉపయోగిస్తారనేది తెలిస్తే ఈ విషయం గురించి ఒక అభిప్రాయానికి రావచ్చు. ఒక్కో యూనిట్‌ బొగ్గు ఉత్పత్తికి అయ్యే వ్యయం గురించి అస్పష్టమైన వివరణ ఇస్తున్నారు. కానీ ఒక్కో యూనిట్‌ బొగ్గు ఉత్పత్తికి అయ్యే వ్యయం తగ్గటమనేది సామర్థ్యం పెరుగుదలకు సూచిక కాదు. నిజానికి బొగ్గు రంగంలో ఒక్కో యూనిట్‌కి అయ్యే ఉత్పత్తి వ్యయంలో వేతనాల వాటానే ప్రధాన భాగంగా ఉంటుంది. ప్రయివేటు రంగంలో తక్కువ వ్యయంతో ఉత్పత్తి కావటానికి రెండు కారణాలు ఉంటాయి. వేతనాల స్థాయి తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అది కోల్‌ ఇండియా అదే పనికి ఇస్తున్న వేతనాలలో మూడవ వంతే ఉంటుంది. అలాగే గని కార్మికుల భద్రత పట్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది.
నిజానికి భద్రతకు సంబంధించిన రికార్డు కోల్‌ ఇండియాకు ఉంది. దానిని ఇంకా మెరుగు పరచవచ్చు. అయితే చైనాతో సహా ఇతర దేశాలలో జరుగుతున్న ప్రయివేటు బొగ్గు మైనింగ్‌లో కంటే కోల్‌ ఇండియాలో భద్రతా ప్రమాణాలు చాలా బాగున్నాయి. ఉదాహరణకు ఒక్కో మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తికి జరిగే సగటు మరణాల రేటు ప్రయివేటు మైనింగ్‌ను అనుమతిస్తున్న మరో రెండు పెద్ద ఉత్పత్తిదారులైన చైనా, ఇండోనేషియాలలో కంటే భారత దేశంలో చాలా తక్కువగా ఉంది. మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా ‘వ్యయాన్ని తగ్గించటం’ మన లక్ష్యం కాకూడదు.
దీనితో మౌలికంగా రెండు వాదనలు ముందుకు వస్తాయి. మొదటిది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి తనతో పాటు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెస్తుంది అనే వాదన. ఈ వాదన సరియైనదేనని అనుకున్నా కోల్‌ ఇండియా చేస్తున్న బొగ్గు ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎందుకు సమకూర్చుకోలేదని, ఈ రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవలసిన అవసరం ఏమొచ్చిందని మనం అడగాలి. నిజానికి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించకుండా ప్రభుత్వం ఎన్నడూ వేరే మార్గాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నం చేసినట్టుగా ఎటువంటి సాక్ష్యం లేదు.
దేశ అవసరాలకు తగినంతగా ఉత్పత్తి లేనందున భారతదేశం బొగ్గును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవలసిన అవసరం ఏర్పడిందనే వాదన పదేపదే వినిపిస్తుంటుంది. కాబట్టి దేశీయ ఉత్పత్తిని వేగంగా పెంచాలంటే మనకు విదేశీ పెట్టుబడితో సహా ప్రయివేటు పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ వాదనతో సమస్య ఏమిటంటే అవసరమైనంత ఉత్పత్తిని కోల్‌ ఇండియా ఎందుకు పెంచలేకపోతోంది అనే విషయాన్ని వివరించదు. 2018-19లో కోల్‌ ఇండియా 40 మిలియన్‌ టన్నుల బొగ్గును అదనంగా ఉత్పత్తి చేసి తన సామర్థ్యాన్ని చాటింది. దిగుమతుల అవసరం అనేదే లేకుండా చేయటానికి రాబోయే సంవత్సరాలలో కూడా అదే స్థాయిలో ఉత్పత్తి చేయాల్సిందిగా కోల్‌ ఇండియాను ఎందుకు అడగటం లేదు? దీనిపై ఎటువంటి స్పష్టత లేదు.

కోల్‌ ఇండియా ‘అతిగా విస్తరించింది’ అనే మాట మనకు తరచూ వినపడుతుంటుంది. దీనర్థం ఏమిటో స్పష్టంగా తెలియదు. పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులకు సరిపడా డిమాండ్‌ ఉన్నప్పుడు మరింత పెద్ద కంపెనీలుగా పరిణామం చెందుతాయనేది తెలిసిందే. ఇదే విషయం కోల్‌ ఇండియాకు ఎందుకు వర్తించదు? అనే విషయం తర్కానికి అందదు. ఒకవేళ ఏదో కారణంచేత కోల్‌ ఇండియా పెరగటానికి అడ్డంకి ఏదైనా వుంటే దేశంలో బొగ్గు ఉత్పత్తిని పెంచటానికి విదేశీ బహుళ జాతి కంపెనీలను ఆహ్వానించటానికి బదులుగా ప్రభుత్వం తేలికగా మరో ప్రభుత్వ రంగ కంపెనీని నెలకొల్పవచ్చు. విదేశీ బహుళజాతి కంపెనీలను ఆహ్వానించటం ద్వారా దేశీయ ఉత్పత్తిని పెంచి ‘విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని’ పొదుపు చేయవచ్చనే విషయం గురించి చాలానే చెప్పారు. అయితే అటువంటి ఆహ్వానం కారణంగా ‘విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని’ లాభాల పేరుతో ఈ విదేశీ బహుళజాతి కంపెనీలు తమ దేశాలకు తరలిస్తాయనే వాస్తవాన్ని గుర్తించటం లేదు.

కోల్‌ ఇండియా ‘అతిగా విస్తరించింది’ కాబట్టి విదేశీ బహుళజాతి కంపెనీలను ఆహ్వానించాలి అని వాదించే వర్గాలు వెంటనే భూ సేకరణ, బొగ్గు ధర నిర్ణయం, కోల్‌ బ్లాకుల వేలం వంటి విషయాలలో గల సంక్లిష్టత వల్ల విదేశీ బహుళజాతి కంపెనీలు రావటానికి సిద్ధపడవని చెప్పటం నిజంగా ఆశ్చర్యం. కాబట్టి బహుళజాతి కంపెనీలు రావాలంటే ఈ ప్రతిబంధకాలన్నీ పోవాలనే ఆలోచన ముందుకు వస్తోంది. మరో విధంగా చెప్పాలంటే…బొగ్గు ఉత్పత్తి లోకి బహుళజాతి కంపెనీలు ప్రవేశించేందుకుగల మార్గంలోని అడ్డంకులన్నింటినీ తొలగించిన తరువాతే ఆ కంపెనీలను సాదరంగా ఆహ్వానించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అంతేకాకుండా దేశానికి చెందిన మొత్తం విధానాన్ని ఆ కంపెనీల డిమాండ్‌కు అనుగుణంగా మార్చటం జరుగుతుంది. ఇదంతా కోల్‌ ఇండియా ‘అతిగా విస్తరించటం’ వల్లనే అనే సాకుతో జరుగుతోంది.
ఇలా బొగ్గు రంగంలో బహుళజాతి కంపెనీలు ప్రవేశించేందుకు వీలుగా విధానాన్ని మార్చటానికి బలమైన కారణం ఏదీ లేదు. ఏ అవసరమూ ఈ విధానాన్ని నిర్దేశించలేదు. విదేశీ పెట్టుబడి కావాలనే కోరిక మాత్రమే ఈ విధానాన్ని మార్చేలా చేసింది. దీనితో బొగ్గు ధర పెరిగే అవకాశం వుండడమే కాకుండా ఆదివాసీలు… విచక్షణారహితమైన పెట్టుబడి కేంద్రీకరణ ప్రభావానికి (భూసేకరణను సరళీకరించే రూపంలో) గురి అవుతారనే విషయాలను కూడా పట్టించుకోకుండా ఈ విధానంలో మార్పులు చేయటం జరిగింది.
‘జాతీయవాదం’ గురించి విపరీతంగా గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం, చిన్న చిన్న సాకులతో ‘జాతి వ్యతిరేకులు’ అనే పేరుతో ప్రజలను నిర్బంధించే ప్రభుత్వం జాతి వనరులపై నియంత్రణనకు సంబంధించిన విధానాన్ని పూర్తిగా మార్చి పడేసి విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పటం నిజంగా విడ్డూరం.

ప్రభాత్‌ పట్నాయక్‌

Courtesy Prajashakthi..