– ఇప్పటి వరకూ రూ.10 వేల కోట్ల దాకా ఖర్చు
– వాటిపై పూర్తి అధికారం సీఎందే

ఓ ఏడాది క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత గ్రామమైన చింతమడకకు వెళ్లారు. అక్కడ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో.. ‘ఈ గ్రామాభివృద్ధికి వీలుగా ఇంటికో రూ.పది లక్షల మేర ఆర్థిక సాయం చేస్తాం’ అంటూ ప్రకటించారు. ఆయన ప్రకటనపై అక్కడి ప్రజలు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఈ సంగతిని కాసేపు పక్కనబెడితే చింతమడక తరహాలోనే సీఎం వివిధ సందర్భాలో ఆర్థిక పరమైన పలు హామీలను గుప్పిస్తున్నారు. వాటికి ఆప్పటికప్పుడు నిధులు విడుదలై పోతుండటం పరిపాటిగా మారింది. ఇంతకీ ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి రిలీజవుతున్నాయి..? వాటిని బడ్జెట్‌లో ఏ పద్దు కింద చూపెడుతున్నారు…? అంటే వాటన్నింటినీ కలిపి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ప్రత్యేకాభివృద్ధి నిధి- ఎస్‌డీఎఫ్‌) అనే పేరుతో బడ్జెట్‌ కాగితాల్లో పేర్కొంటున్నారు. ఇలా చూపెడుతున్న ఈ నిధులన్నింటిపై ముఖ్యమంత్రికే సర్వాధికారాలుంటాయి.

తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకూ ఈ తరహాలో దాదాపు రూ.10 వేల కోట్ల దాకా వెచ్చించినట్టు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. తొలి ఏడాది రూ.4,500 కోట్లు, ఆ తర్వాత రూ.4 వేల కోట్లు.. ఇలా కేటాయించుకుంటూ పోయారు. ఈ నేపథ్యంలో ఎస్‌డీఎఫ్‌పై గతంలో సర్వత్రా విమర్శలొచ్చాయి.

గత అసెంబ్లీలో అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి దీనిపై మాట్లాడుతూ… నియోజకవర్గాల అభివృద్ధి నిధి (సీడీఎఫ్‌) ఉండగా, మళ్లీ ఎస్‌డీఎఫ్‌ ఎందుకంటూ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ ఆర్థిక నిపుణులు, మేధావులు సైతం విమర్శించారు. మిగతా వాటితో పోలిస్తే వెనుకబడిన ఏదైనా ఒక శాఖకో, రంగానికో ప్రత్యేకంగా నిధులు కేటాయించటం ద్వారా ఆయా విభాగాలను అభివృద్ధి చెందించవచ్చు.

కానీ పెద్ద మొత్తంలో నిధులను గంపగుత్తగా ప్రత్యేకం గా పద్దులో చూపటం, వాటన్నింటిపై ముఖ్యమంత్రికే అధికారం కల్పించటం సరికాదని వారు అభిప్రాయడుతున్నారు. తద్వారా సీఎంకు ఇష్టమొచ్చిన అంశాలు, సంస్థలకే అధిక నిధులు విడుదల చేస్తారనీ, తద్వారా ఆ మేరకు మిగతా శాఖలు నష్టపోతాయని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విమర్శల నేపథ్యం లో సర్కారు వచ్చే బడ్జెట్‌లో ఎస్‌డీఎఫ్‌ను తీసేస్తుందా..? లేక యధావిధిగా పద్దులో చూపిస్తుందా..? అనేది వేచి చూడాలి. ఈ విషయంపై స్పష్టత కోసం ప్రయత్నించగా… ఆర్థికశాఖ ఉన్నతాధికారులు అందుబాటులోకి రాలేదు.

Courtesy Nava Telangana