మంత్రులందరితో కేటీఆర్‌ సుదీర్ఘ భేటీ.. క్యాంపు కార్యాలయంలోనే నిర్వహణ
కీలక అధికారులంతా హాజరు
కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లిన మర్నాడే
పట్టాభిషేకానికి సమయమొచ్చిందా?
అధికార, రాజకీయ వర్గాల్లో  చర్చ

హైదరాబాద్‌, ఆగస్టు : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 11వ తేదీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌ్‌సకు వెళ్లారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్‌ పాలసీపై ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సుదీర్ఘంగా ఎనిమిది గంటలపాటు కొనసాగింది. దీనికి  అన్ని శాఖల మంత్రులు, సీఎస్‌, ముఖ్య అధికారులందరూ హాజరయ్యారు. కేబినెట్‌ భేటీల్లో పాల్గొనే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కూడా పాల్గొన్నారు. కేసీఆర్‌ ఎప్పుడూ నిర్వహించే కేబినెట్‌ భేటీ తరహాలోనే కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన మంత్రుల భేటీ కూడా 8 గంటలు సాగటం విశేషం. సాధారణంగా కేబినెట్‌ సమావేశం లేదా కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశానికి మాత్రమే మంత్రులందరూ హాజరవుతూ వస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన భేటీకి మంత్రులు, అధికారులంతా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే,  కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించటానికి సమయం ఆసన్నమైందా? అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కేటీఆర్‌ భవిష్యత్తులో చేపట్టబోయే సీఎం బాధ్యతలకు ట్రయల్‌ రన్‌లా  ‘కేబినెట్‌ భేటీ’ ఉందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ భేటీ ఏర్పాటు చేయించినట్లుగా ఆ వర్గాలు నమ్ముతున్నాయి. కరోనా,  ఆర్థిక ఇబ్బందులు తలెత్తకపోతే కేటీఆర్‌కు పట్టాభిషేకం ఇప్పటికే పూర్తయ్యేదని టీఆర్‌ఎ్‌సలోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది.

మరో వర్గం మాత్రం కేటీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సమయం పట్టవచ్చని చెబుతోంది. నిజానికి, లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళితే, కేటీఆర్‌ సీఎం అవుతారని అంతా భావించారు. ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవటం, కేంద్రంలో బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఆ తర్వాత మంత్రిగా కేటీఆర్‌ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.  పరిషత్‌, మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రచారానికి సారథ్యం వహించారు. ఎన్నికలనే కాకుండా, పార్టీపరమైన అంశం ఏదైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేటీఆర్‌ను సంప్రదించటం సాధారణమైంది. నామినేటెడ్‌, పార్టీ పదవుల కోసం ఆశావహులూ ఆయన వద్దకే క్యూ కడుతున్నారు. మరోవైపు, తన పరిధిలోని శాఖలపరంగానే కాకుండా ప్రభుత్వంలో ఇతరత్రా చురుగ్గా వ్యవహరిస్తున్న మంత్రి కేటీఆర్‌.. సీఎం కేసీఆర్‌ తర్వాత తానేనని చెప్పకనే చెబుతున్నారు. మిగిలిన మంత్రుల కంటే ఎక్కువగా కరోనా సమయంలోనూ పెద్దఎత్తున ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు.

అప్పుడు.. ఇప్పుడు..
పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల ముందు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్రం ఏర్పడక ముందు పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌, టీఆర్‌ఎ్‌సపీపీ భేటీకి అధ్యక్షత వహించేవారు. అధికారంలోకి వచ్చాక అదే హోదాతో పాటు ముఖ్యమంత్రిగా మార్గనిర్దేశం చేశారు. టీఆర్‌ఎ్‌సపీపీ సమావేశానికి తొలిసారిగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదాలో కేటీఆర్‌ అధ్యక్షత వహించటం అప్పుడే! దాంతో, అప్పట్లోనే ఈ అంశం పార్టీలో చర్చనీయాంశమైంది. అది టీఆర్‌ఎస్‌ సంస్థాగత వ్యవహారం. కాగా, తాజాగా ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న కేటీఆర్‌, ‘కేబినెట్‌ భేటీ’కి సారథ్యం వహించటం చర్చకు దారితీసింది.

తెలంగాణలో ఇదే తొలిసారి
సీఎం కేసీఆర్‌ లేకుండా తెలంగాణలో మంత్రుల భేటీ జరగడం.. ఒక కేబినెట్‌ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి మిగిలిన కేబినెట్‌ మంత్రులంతా హాజరు కావటం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రెండు సందర్భాల్లో కేబినెట్‌ భేటీ జరిగిందని సీనియర్‌ రాజకీయ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఒకసారి.. అలిపిరి వద్ద అప్పటి సీఎం చంద్రబాబునాయుడిపై మావోయిస్టులు దాడి చేసినప్పుడు, హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌ నాయకత్వంలో కేబినెట్‌ సమావేశమైంది. రెండోసారి.. సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఆచూకీ లభ్యం కానప్పుడు, మంత్రి రోశయ్య అధ్యక్షతన మంత్రుల భేటీ జరిగింది.

Courtesy Andhrajyothi