పి. జయలక్ష్మి

ప్రపంచంలో ఆకలితో అలమటించే 117 దేశాలలో మన దేశం 102వ స్థానంలో ఉంది. దేశంలో సగానికి పైగా పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం 2.5 కోట్ల మంది పిల్లలు పుడితే, ఇందులో 1.8కోట్ల మంది పిల్లలు మాత్రమే మొదటి పుట్టినరోజు చేసుకుంటున్నారు. అంటే ప్రతి సంవత్సరం 70లక్షల మంది చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఇది మోడీ పాలనలో మన దేశ అభివృద్ధి. అయినా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గుపడట్లేదు. పైగా 45ఏండ్ల నుండి గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలందిస్తూ, పిల్లల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని 2020 నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో నిర్ణయం చేసింది. దీనినిబట్టి కేంద్ర ప్రభుత్వానికి పసిపిల్లల ప్రాణాల కంటే కూడా ప్రయివేటీకరణ విధానాలు, పెట్టుబడిదారుల లాభాలే ముఖ్యమని మనకు స్పష్టంగా అర్ధమౌతున్నది. అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడితే దేశవ్యాప్తంగా 26లక్షల మంది అంగన్‌వాడీ ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారడమే కాదు, కోట్లాది మంది పేద ప్రజలకు అందుతున్న పోషకాహారం, విద్యా, ఆరోగ్యం లాంటి ఉచిత సేవలు శాశ్వతంగా దూరమవుతాయి.

భారతదేశం మానవ వనరుల అభివృద్ధిలో వెనుకబడుతున్నదని అంతర్జాతీయ సంస్థలు ఒకవైపు చెప్పటం, మరోవైపు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితి ఏంటని ప్రజలనుంచి వ్యతిరేకత పెల్లుబికిన నేపథ్యంలో ఆనాటి ప్రభుత్వానికి ఐసీడీఎస్‌ను ప్రారంభించటం అనివార్యమైంది. ఒక బిడ్డ మెదడు తల్లి కడుపులో సగం, మిగిలిన సగం ఆరేండ్ల లోపు అభివృద్ధి అవుతుంది. బిడ్డ ఎదుగుదలకు ఒక రోజుకు ఎన్ని క్యాలరీల శక్తిగల ఆహారం అవసరమౌతుందో, ఆ ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలు, చిన్న పిల్లలకు ప్రభుత్వమే అందించాలి. ఈ లక్ష్యంతో 1975 అక్టోబర్‌ 2న 22ప్రాజెక్టులతో ఐసీడీఎస్‌ స్కీమ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ విధంగా ప్రారంభమైన ఐసీడీఎస్‌ నేడు 14లక్షల నివాస ప్రాంతాలకు విస్తరించింది. 7,076 ప్రాజెక్టులు, 26లక్షల మంది అంగన్‌వాడీ ఉద్యోగులతో, 8కోట్ల 75లక్షల 60వేల 671 మంది లబ్దిదారులకు (ఇందులో గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు) సేవలను అందిస్తున్నది. ఇంతటి ముఖ్యమైన లక్ష్యంతో ఏర్పడి విస్తరించిన ఐసీడీఎస్‌ పథకాన్ని ఒక్క కలం పోటుతో రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.

ప్రస్తుతం దేశంలో 14లక్షల అంగన్‌వాడీ కేంద్రాలలో 4కోట్ల మంది 3-6ఏండ్ల పిల్లలు చదువుతున్నారు. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు అందిస్తున్న సిలబస్‌, పాఠ్య ప్రణాళిక, ట్రైనింగ్‌, పర్యవేక్షణ, పిల్లల ఎదుగుదల గమనించడం లాంటి అనేక విషయాలను ఎన్‌ఈపీ 2020లో ప్రస్తావించలేదు. ఇప్పుడు కొత్తగా బాలవాటిక, కిండర్‌ గార్డెన్‌ పేరుతో కొత్త కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్తున్నారు. ఐదేండ్ల లోపు అంటే 1వ తరగతి కంటే ముందు వయస్సు పిల్లలు ఈ కేంద్రాలకు పోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నది. దీనినిబట్టి ఇక అంగన్‌వాడీ కేంద్రాలుండవని అర్ధమౌతున్నది. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ స్కూల్స్‌ కిందికి ఒక క్లష్టర్‌గా తీసుకొస్తామని చెబుతున్నారు. 45ఏండ్ల అంగన్‌వాడీల సేవలను పూర్తిగా విస్మరించడంతో పాటు ఇప్పుడు అంగన్‌వాడీ కేంద్రాలనే మూసివేయాలని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం.

అంగన్‌ వాడీ కేంద్రాలను మూసివేసి వీటి స్థానంలో బాలవాటికా, కిండర్‌ గార్డెన్‌ స్కూల్స్‌ను ప్రారంభిస్తామని, ఈ కేంద్రాలలో శిక్షణ పొందిన టీచర్స్‌ను నియమిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను శిక్షణ పొందిన టీచర్స్‌గా పరిగణిస్తారా? అంగన్‌వాడీ వర్కర్లందర్నీ నియమించుకొంటారా? ఈ విషయాన్ని ఎన్‌ఈపీ 2020లో స్పష్టం చేయలేదు. ఇక్కడ ప్రభుత్వం మరో విషయం కూడా చెప్తున్నది. ఈ కేంద్రాల్లో ప్రజల నుంచి టీచర్లుగా చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తే వారిని తీసుకుంటామని చెప్తున్నారు. అంటే అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగానికి గ్యారెంటీ లేదని అర్ధమౌతున్నది. అలాగే పిల్లల సరరక్షణ చూడటంలో విశిష్టమైన సేవలందిస్తున్న హెల్పర్లు, మినీ వర్కర్లకు పని ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని కూడా డాక్యుమెంట్లో ఎక్కడా స్పష్టం చేయలేదు. ఈ అంశాలను గమనించినప్పుడు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు మినీ వర్కర్లందరూ ఉపాధి కోల్పోయి రోడ్డునపడే ప్రమాదముందని అర్ధమౌతుంది.

గర్భిణీ, బాలింతలు, ఆరేండ్ల లోపు పిల్లలకు అందించే పోషకాహారం గురించి కూడా ఎన్‌ఈపీ 2020లో ప్రస్తావించలేదు. కానీ పిల్లలు అనారోగ్యంగా ఉంటే ఆశించినంతగా చదువుకోలేరని, వీళ్ళకు బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాలని చాలా మంచిమంచి మాటలు ఎన్‌ఈపీలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అయితే ఈ ఆహారాన్ని ప్రభుత్వం సప్లయి చేస్తుందా? అంటే ప్రభుత్వం చేయదట. సోషల్‌ వర్కర్స్‌, ప్రజల సహకారంతో అందిస్తామని చెప్తున్నారు. అంటే పోషకాహారం బాధ్యత నుంచి కూడా ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటుందని అర్ధం. విద్యారంగానికి జీడీపీలో 6శాతం బడ్జెట్‌ అవసరమని ప్రభుత్వం ఎన్‌ఈపీలో చెపుతున్నది.

అయితే ఎంత బడ్జెట్‌ కేటాయిస్తారో ఎన్‌ఈపీలో చెప్పలేదు. ఈ ఖర్చులు కూడా ప్రయివేటు మత సంస్థలు పెడతాయని చెపుతున్నారు. ఇదొక్కటే కాదు మొత్తం ఎన్‌ఈపీ 2020 డాక్యుమెంట్లో చూసినప్పుడు అనేకచోట్ల ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యం (పీపీపీ) అని ప్రభుత్వం ప్రస్తావించింది. అంటే ప్రయివేటు దాతృత్వ (మత సంస్థలు) భాగసామ్యం అని అర్ధం. కొత్తగా ప్రారంభించే బాలవాటికా, కిండర్‌ గార్డెన్‌ స్కూల్స్‌ గానీ, పోషకాహారం బాధ్యత గానీ, పాఠ్య ప్రణాళిక గానీ, టీచర్ల నియామకం గానీ అన్నింటినీ ప్రయివేటు మత సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీంతోపాటు 3-6ఏండ్ల పిల్లలకు విద్యా హక్కును తొలగించింది. పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, ఆహారం, విద్య అందించే ఉచిత సేవల నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంటుందని అర్ధం.

ఐసీడీఎస్‌ చాలా ముఖ్యమైన పథకమని, పిల్లల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నదని, ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుతో పాటు కాగ్‌ నివేదిక, యునిసెఫ్‌ లాంటి అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అనేకసార్లు తెలియజేశాయి. 2013లో 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫెరెన్స్‌ సమావేశం ఐసీడీఎస్‌ను ప్రయివేటీకరణ చేయకూడదని, అంగన్‌వాడీ ఉద్యోగులను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని తీర్మానం చేసింది. 2013లో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన ఈసీసీఈ విధానం కూడా ఐసీడీఎస్‌ ఉండాలని చెప్పింది. ప్రపంచంలో 99శాతం దేశాలు ఐసీడీఎస్‌ లాంటి విద్యనే 3-6ఏండ్ల పిల్లలకు అందిస్తున్నాయి. వీటితో పాటు దేశంలోని పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, పోషకాహారలోపం, రక్తహీనత తదితర అనేక అంశాలు ఐసీడీఎస్‌ మరింత అవసరమని తెలియజేస్తున్నాయి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ అంశాలనేవి పరిగణలోకి తీసుకోలేదు. కనీసం రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోలేదు. పార్లమెంట్‌లో కూడా ప్రవేశపెట్టలేదు. కేవలం ఏకపక్షంగా తన మంత్రివర్గంలో ఎన్‌ఈపీ 2020ని ఆమోదించింది.

అనేక సంవత్సరాల నుండి ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ లేదని చెప్తున్న ప్రభుత్వం, పెట్టుబడిదారులకు మాత్రం ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో లక్షల కోట్ల రాయితీలు చెల్లిస్తున్నది. పెట్టుబడిదారులు చెల్లించే ఆదాయం పన్ను శాతాన్ని కూడా 35శాతం నుంచి 25శాతానికి తగ్గించింది. వాళ్ళ పాత బకాయిలన్నింటిని 69వేల కోట్ల రూపాయలను రద్దు చేసింది. అంబానీ ఆదాయం ఒక గంటలకు 90కోట్లంటే కొంతమంది దగ్గర ఎంత సంపద పోగుపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే దేశంలో 75శాతం గ్రామీణ పేదల ఆదాయం నెలకు రూ.5వేలకు మించి లేదంటే అసమానతలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో అర్ధమౌతుంది. ఇప్పుడు ఐడీపీఎస్‌, అంగన్‌వాడీ కేంద్రాల రద్దుతో ప్రజలకు ఈ కాస్త ఉపశమనమూ దూరం అవుతుంది. భావిభారత పౌరుల అభివృద్ధితో ఆటలాడుతున్న కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఈపీ 2020 విధానాలకు వ్యతిరేకంగా అంగన్‌వాడీలు పెద్దఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలి. ఐసీడీఎస్‌ రక్షణ కోసం జరిగే పోరాటాలలో ప్రజలంతా భాగస్వాములు కావాలి.

Courtesy Nava Telangana