– నల్సార్‌ యూనివర్సిటీ వీసీ ఫైజన్‌ముస్తఫా

”భారతీయ పౌరసత్వం అనేది ప్రభుత్వాలు పెట్టే భిక్ష కాదు. అది ఇక్కడి ప్రజల సంపూర్ణ ప్రాథమిక హక్కు” అని నల్సార్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఫైజన్‌ముస్తఫా అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఆ హక్కును సాధించుకోవడం కోసం పోరాడాలే తప్ప, అడుక్కోరాదని స్పష్టం చేశారు. ‘మంథన్‌’ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ‘జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)’ అంశాలపై మాట్లాడారు. పార్లమెంటు ఆమోదించిన సీఏఏ కేవలం చట్టపరమైన నిర్ణయమే తప్ప, రాజ్యాంగ ఆమోద నిర్ణయం కాదని అన్నారు. ఎన్నార్సీ, సీఏఏ వల్ల భారతదేశంలో పుట్టినవారు భారతీయులు కాకుండా పోతారని, అదే సమయంలో విదేశాల్లో స్థిరపడినవారు భారతీయులు ఎలా అవుతారని ప్రశ్నించారు. 2003లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి ఈ వివాదానికి ఆద్యుడని అభిప్రాయ పడ్డారు. అక్రమ వలసదారుల నివారణకు అనేక కఠిన చట్టాలు ఉన్నాయని, వారిని బూచిగా చూపి, స్వదేశీ ముస్లింలను వేధించడం సరికాదన్నారు. ఎన్నార్సీ జాబితాలో పేర్లు లేనివారు భారతీయులు కాకుంటే, వారు ఏ దేశానికి చెందినవారో స్పష్టంచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, అందుకు భిన్నంగా ‘మేం పేర్లు తొలగిస్తాం…మీ పౌరసత్వాన్ని మీరే రుజువు చేసుకోండని’ చెప్పడం సరికాదన్నారు.

ఎన్నార్సీ, సీఏఏలపై సుప్రీంకోర్టు తీర్పులు కూడా అనేక సందర్భాల్లో పరస్పర భిన్నంగా ఉన్నాయని వివరించారు. ఒక్క అస్సాంలోనే ఎన్నార్సీపై మూడు లక్షల అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. అసలు పౌరసత్వ ధృవీకరణకు ఏ పత్రాలు ప్రామాణికమని ప్రశ్నించారు. ఆధార్‌ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిందన్నారు. కేంద్రప్రభుత్వం న్యాయస్థానంలో, ప్రజల్లోనూ చెప్తున్న మాటలు, వాదనలకు క్షేత్రస్థాయి నిర్ణయాలకు పొంతనే ఉండట్లేదన్నారు. భారతీయ పౌరసత్వం కోసం ఏ ఒక్కరూ దేహీ అనాల్సిన అవసరం లేదని, దాన్ని పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

(Courtesy Nava Telangana)