* ఆమోదానికి మోడీ సర్కార్‌ పావులు
న్యూఢిల్లీ : సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాలపు సమావేశాల్లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, దేశంలో ఆర్థిక మాంద్యం, ఆకాశాన్నంటుతున్న నిరుద్యోగం తదితర అంశాలు చర్చనీయాంశమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చకు అవకాశం ఉంది. ఇదే సమయంలో మోడీ సర్కార్‌ ముస్లిములే లక్ష్యంగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లును అమోదింపజేసుకునేందుకు అరాటపడుతోంది. ఇది ఆమోదం పొందిన తర్వాత వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి దేశవ్యాప్తంగా నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్ట్రర్‌ (ఎన్‌పిఆర్‌)ను నిర్వహిం చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. పౌరసత్వ సవరణ బిల్లు ప్రకారం పాకిస్థాన్‌, అఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చి భారత్‌లో స్థిరపడిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు పౌరసత్వం కల్పించేందుకు చూస్తోంది. ఇందుకుగానూ 2014, డిసెంబర్‌ 31కు ముందు వచ్చి ఇక్కడ స్థిరపడి ఉంటే వారికి భారత పౌరసత్వం కల్పించేటట్లు నిబంధనలు ఈ సవరణ బిల్లులో ఉన్నాయి. ముస్లిములకు సంబంధించి భిన్న నిబంధనలు తెస్తోంది. వీరు భారత్‌లోనే సంవత్సరాల తరబడి ఉంటున్నట్లు, ఆస్తులకు సంబంధించి ఆధారాలు, తాత ముత్తాతలు ఇక్కడే నివసించినట్లు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ముస్లిములే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకురావాలన్న కేంద్రం యత్నాలపై రాజకీయపక్షాలు, సామాజిక సంస్థలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పలు కారణాలతో తగిన అధారాలను చూపించలేని వారిని దేశం నుంచి పంపించి వేయాలని ఆలోచన బిజెపి చేస్తోందని విమర్శిస్తున్నారు.

బెడిసికొట్టిన ఎన్‌ఆర్‌సి
హిందూ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు మోడీ సర్కార్‌ కుట్రలకు పాల్పడుతోంది. ముస్లిములకు వ్యతిరేకంగా పావులు కదపడం ద్వారా మెజార్టీ హిందువుల సానుభూతి పొందవచ్చనేది వారి ప్లాన్‌. అసోంలో తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ నమోదు(ఎన్‌ఆర్‌సి) ప్లాన్‌ బెడిసికొట్టింది. ముస్లిములను అక్కడి నుంచి పంపించి వేయాలన్న పన్నాగంతో అక్కడ నిర్వహించిన ఎన్‌ఆర్‌సి వ్యతిరేక ఫలితాలను ఇచ్చింది. ఎన్‌ఆర్‌సిలో దాదాపు 18 లక్షల మంది పేర్లను మినహాయించారు. ఈ సంఖ్యలో అధిక భాగం ముస్లిములు ఉంటారని బిజెపి భావించింది. వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అధికంగా హిందువులే జాబితా నుంచి మినహాయించడ్డారన్న విషయం బిజెపికి తలనొప్పిగా మారింది. దీనిపై అసోంలోని హిందువుల నుంచే ఆ పార్టీ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. ఎన్‌ఆర్‌సి తాము అనుకున్న ‘లక్ష్యానికి’ అనుకూలంగా లేదని భావించిన బిజెపి ఇతర దేశాలను నుంచి వలస వచ్చిన హిందువులకు అనుకూల నిబంధనలు తీసుకొస్తోంది.

ప్రతిపక్షాల వ్యతిరేకత
ఈ పౌరసత్వ సవరణ బిల్లు కొత్తగా వచ్చిందేమీ కాదు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ బిల్లును బిజెపి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. మత వివక్ష పాటించేలా నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. వెంటనే 2019 ఎన్నికల షెడ్యూల్‌ కూడా రావడంతో పార్లమెంట్‌ రద్దయింది, బిల్లు కూడా ఆమోదం పొందలేదు. దీంతో బిల్లులో కొన్ని మార్పులు తీసుకువచ్చి తిరిగి ప్రవేశపెట్టాలని కేంద్రం తహతహలాడుతోంది. బిల్లుపై ఇప్పటికే అసోంతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి.

Courtesy Prajasakthi..