– ఆ మూడు దేశాల గురించే ఎందుకు..?
– శ్రీలంక, నేపాల్‌, మయన్మార్‌ వలసల గురించి మాట్లాడరేం..?
– దేశంలోని శరణార్థులపై ప్రత్యేక కథనం
న్యూఢిల్లీ: లోక్‌సభ ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగపరంగా చెల్లుతుందా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యాంగంలోని అధికరణలు 14, 15 కుల,మతాలకు అతీతంగా పౌరులందరికీ సమాన హక్కులకు హామీ ఇచ్చాయి. సవరణ బిల్లులో మాత్రం మతాన్ని ప్రాతిపదికగా తీసుకొని వలసదారులకు పౌరసత్వాన్ని కల్పించే నిబంధన పెట్టారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, అఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. ఆ దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందు, సిక్కు, బౌద్ధ,జైన, క్రైస్తవ, పార్శీలు మతపరమైన దాడులు, హింస కారణంగా దేశంలోకి వలస వచ్చినందున భారతీయ పౌరసత్వం కల్పించాలనేది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అందుకు అనుగుణంగా పౌరసత్వ చట్టం-1955లోని నిబంధనలను సవరిస్తున్నారు. 1955 నిబంధనల ప్రకారం ఇతర దేశాల నుంచి దేశంలోకి ఎవరు వచ్చినా చట్టవ్యతిరేక వలసదారులుగానే పరిగణిస్తారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన వారందరినీ అక్రమ వలసదారులుగానే చూస్తారు. ఇప్పుడు మోడీ సర్కార్‌ తెచ్చిన సవరణ బిల్లు చట్టంగా రూపొందితే మాత్రం ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం ఇస్తారు. 2014, డిసెంబర్‌ 31లోగా భారత్‌లోకి ప్రవేశించిన ముస్లిమేతరులకు సవరణ చట్టం ద్వారా పౌరసత్వం లభిస్తుంది.
వలసల విషయంలో ముస్లింలకు ఒక న్యాయం, ముస్లిమేతరులకు మరో న్యాయం రాజ్యాంగపరంగా ఎలా సరైందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలకు హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన సమాధానం పొరుగు దేశాల పట్ల అసహనం ప్రదర్శించేవారికి ఊరట కలిగించేలా ఉన్నది. ఆ మూడు దేశాలు ముస్లిం దేశాలైనందున మినహాయించినట్టు అమిత్‌షా తెలిపారు. ముస్లిం దేశాల నుంచి మతపరమైన దాడుల కారణంగా ముస్లింలెందుకు వలస వస్తారు..? అన్న అర్థంలో ఆయన సమాధానమున్నది. కానీ, ముస్లింలంతా ఏకపక్షంగా లేరన్నది కాస్త వివరాల్లోకి వెళితే అర్థమవు తుంది. వారిలోనూ సున్నీలు, షియాలు, అహ్మదీలు అనే విభజన ఉన్నది. చాలా దేశాలు సున్నీల ఆధిపత్యంలో ఉన్నాయి. అలాంటి చోట్ల షియాలు, ఇరత మైనారిటీ ముస్లింలు మతపరమైన దాడులకు గురవుతున్నారు. ముస్లింలు మెజారిటీగా ఉన్న దేశాల నుంచి మైనారిటీలు వలస వచ్చినపుడు మానవత్వ ప్రాతిపదికన పౌరసత్వం కల్పిద్దామన్న వాదన బీజేపీ, దాని అనుకూల పార్టీల నుంచి వస్తోంది. అలాంటపుడు షియాలు, అహ్మదీలను అదే మానవతా దృక్పథంతో చూడాలన్న దానికి బీజేపీ అనుకూల పార్టీలు ఏం సమాధానం చెబుతాయి..?
మరోవైపు పౌరసత్వ సవరణ బిల్లుకు ఈశాన్య రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు మొదలయ్యాయి. పొరుగు దేశాల నుంచి వచ్చే వారికి పౌరసత్వం కల్పిస్తే స్థానికంగా పుట్టి పెరిగిన తమ మనుగడ దెబ్బతింటుందని వారు బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
శ్రీలంక, నేపాల్‌ నుంచి వచ్చిన వలసల గురించి బిల్లులో ఎందుకు ప్రస్తావించలేదన్న ప్రశ్న కూడా ఉన్నది. శ్రీలంకలో జరిగిన అంతర్యుద్ధం కారణంగా అక్కడ మైనారిటీలుగా ఉన్న తమిళులు పెద్ద సంఖ్యలో వలస వచ్చారు. మయన్మార్‌లో జాతి వివక్ష కారణంతో అక్కడ మైనారిటీలుగా ఉన్న రోహింగ్యాలు కూడా వలస వచ్చారు. పొరుగు దేశాల్లో అంతర్యుద్ధాలు, మత, జాతి వివక్ష దాడుల కారణంగా వలస వస్తున్న కాందిశీకుల(శరణార్థుల) పట్ల మన దేశానికి ఓ స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
వలసలపై గత లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అప్పటి హోంశాఖ సహాయమంత్రి కిరెన్‌ రిజీజ్‌ ఇచ్చిన రాతపూర్వక సమాధానం ప్రకారం 2014, డిసెంబర్‌ 31 వరకు దేశంలో ఉన్న శరణార్థుల మొత్తం సంఖ్య 2,89,394. వీరిలో బంగ్లాదేశ్‌ నుంచి 1,03,817మంది, శ్రీలంక నుంచి 1,02,467మంది, టిబెట్‌ నుంచి 58,155 మంది, మయన్మార్‌ నుంచి 12,434మంది, పాకిస్థాన్‌ నుంచి 8799మంది, అఫ్ఘనిస్థాన్‌ నుంచి 3469మంది, వలస వచ్చినట్టు తెలిపారు. వీరిలో తమిళనాడులో 1,02,478 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 62,890మంది, మహారాష్ట్రలో 47,663మంది, కర్నాటకలో 34,348మంది, ఆంద్రప్రదేశ్‌లో 358మంది, తెలంగాణలో 210మంది ఉన్నట్టు తెలిపారు. వీరంతా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పౌరసత్వం కల్పించాలని దరఖాస్తు చేసినవారు మాత్రమే. మొత్తమ్మీద దేశంలోని వలసల సంఖ్య మరింత అధికంగానే ఉన్నది. శరణార్థులకు పౌరసత్వం కల్పించడం లేదా వారి పట్ల ఏవిధంగా వ్యవహరించాలనే విషయంలోనూ ఇప్పటి వరకూ ఎలాంటి చట్టమూ లేదని కూడా మంత్రి తెలిపారు. అందుకు హోంశాఖ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ను అనుసరిస్తోందని తెలిపారు. 1955 చట్టమే ఇప్పటి వరకూ అమలవుతూ వచ్చింది.
ఆ తర్వాత మరో సందర్భంలో హోంశాఖ తెలిపిన ప్రకారం 2018, డిసెంబర్‌ 21 వరకు పాకిస్థాన్‌ నుంచి వచ్చిన 41,331మంది, అప్ఘనిస్థాన్‌ నుంచి వచ్చిన 4,193మంది మతపరమైన మైనారిటీలకు దీర్ఘకాలిక వీసా ఇచ్చారు. ఇప్పుడు ఈ బిల్లు చట్టమైతే వీరందరికీ పౌరసత్వం లభించనున్నది.
(Courtesy Nava Telangana)