యోగేంద్ర యాదవ్

Yogendra Yadav

సుప్రీంకోర్టు ఉత్తర్వుతో సిఏఏ- ఎన్‌ఆర్‌ సి– ఎన్‌పిఆర్ వ్యతిరేక ఉద్యమంలో మొదటి దశ ఇంచుమించు ముగిసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి గౌహతి దాకా వివిధ ప్రాంతాలలో ఈ ఉద్యమ తొలి దశ ఈ నెల 30న మహాత్ముని వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు నిర్వహించనున్న మానవ హారం కార్యక్రమంతో ఒక ముగింపునకు రానున్నది.

మతసామరస్యం, సమ పౌరసత్వం సమసిపోయే ముప్పులో పడిన మన గణతంత్ర రాజ్యాన్ని మనమే రక్షించుకోవాలి. ఎవరైతే భారత పౌరులమని గర్విస్తున్నారో, అలా గర్వంగా చెప్పుకోవడానికి (ఈ అభిజాత్యమే మన జీవితాలకొక ఆభరణం కాదూ?) సహజసిద్ధంగా ఉత్సాహపడుతున్నారో వారే భారత గణతంత్ర రాజ్యాన్ని సంరక్షించుకోవాలి, తప్పదు. ఈ వాస్తవాన్ని ఎల్లరికీ మన సుప్రీం కోర్టు ఇటీవల గుర్తు చేసింది.

నిజానికి ఆ వాస్తవం మన విధ్యుక్త ధర్మం కూడా. సామాజిక సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థాన విచారణ కోసం మీరూ, నేనూ, ప్రతి ఒక్కరూ ఎంతో ఆదుర్దాతో ఎదురు చూశాం కదా! అయితే ఆ విచారణ, చాలామంది న్యాయ నిపుణులు భయపడినట్టుగానే, ఒక సాధారణ కార్యకలాపంగా జరిగింది. 143 పిటిషన్లపై ప్రతిస్పందించడానికి మరి కొంత గడువును ఇవ్వాలని అటార్నీ జనరల్ కె. కె. వేణుగోపాల్ అభ్యర్థించారు.

ఆ మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కోర్టు మరో నాలుగు వారాల వ్యవధినిచ్చింది. పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పిఆర్) అమలుపై స్టే విధించాలని, లేదా, కనీసం వాటి అమలును కొన్ని నెలల పాటు వాయిదా వేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవడానికి విముఖత చూపింది.

ఆ పిటిషన్లపై తొలి విచారణ అనంతరం సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వును తప్పుపట్టవలసిన అవసరమేమీ లేదు. ఎందుకంటే, విచారణ సంబంధమైన అంశాలకే అత్యున్నత న్యాయస్థానం పరిమితమయింది. పిటిషనర్ల ప్రధాన అభ్యర్థనపై ముందుగానే ఒక నిర్ణయానికి రావడానికి కోర్టు నిరాకరించింది. ఈ విషయాన్నే స్పష్టం చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. పౌరసత్వ వివాదాలు రాజ్యాంగ ధర్మాసనం విచారణకు అర్హమైనవి. సంబంధిత పిటిషన్లను అటువంటి ధర్మాసనం విచారణకు నివేదిస్తామని సుప్రీం కోర్టు సూచనప్రాయంగా తెలిపింది.

సిఏఏ, ఎన్‌పిఆర్‌లపై స్టే జారీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించలేదు. దానిపై నిర్ణయాన్ని తదుపరి విచారణ నాటికి వాయిదా వేసింది. పౌరసత్వ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థాన విచారణలో ఉన్నందున సంబంధిత అంశాలపై పిటిషన్లను విచారణకు చేపట్టకూడదని రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది.

పౌరసత్వ సవరణ చట్టం సాధారణ వ్యవహారం కాదు. ఆ చట్టంపై న్యాయపోరాటం భారత రాజ్యాంగ స్ఫూర్తిని, ఆత్మను కాపాడుకోవడానికే అని అనడంలో సందేహం లేదు. నేను న్యాయవాదిని కాను. కానీ, రాజనీతి శాస్త్ర విద్యార్థిగా భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేశాను. భారత రాజ్యాంగం దేనికైతే నిబద్ధమయిందో దాన్ని పౌరసత్వ సవరణ చట్టం నిస్సిగ్గుగా ఉల్లంఘించింది. అయినప్పుడు ఈ అంశంపై సుప్రీం కోర్టు ఒక భిన్నమైన దృక్పథాన్ని అనుసరించాల్సి వున్నదని నేను భావించాను. ఆసేతు హిమాచలం ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రజ్వరిల్లుతున్న ప్రజా నిరసనలకు న్యాయవ్యవస్థ ప్రతిస్పందించాలని నేను ఆశించలేదు.

అయితే కోట్లాది భారతీయుల, ముఖ్యంగా సామాజికంగా నిమ్న స్థాయిలో వున్న, భౌగోళికంగా దేశ సరిహద్దు ప్రాంతాలలో ఉన్న వారి మనస్సులను ఆవహించిన భయాందోళనలను తొలగించేందుకు సుప్రీం కోర్టు ఒక మార్గాన్ని కనుగొనగలదని ఆశించడం న్యాయవిరుద్ధమా?

పౌరసత్వం విషయమై రాజ్యాంగ వ్యవస్థ నుంచి ఒక స్పష్టమైన భరోసాను కోట్లాది ప్రజలు ఆశిస్తున్న సంక్లిష్ట సమయంలో యథాలాప విచారణ వారిలో విశ్వాసాన్ని ఎలా నింపుతుంది? అయితే, ఒక కచ్చితమైన నిర్ణయానికి వచ్చే ముందు భావి విచారణల కోసం వేచి చూడాలి. ఏమైనా ఒక విషయం మాత్రం స్పష్టం. రాజ్యాంగాన్ని రక్షించడమనేది దేశ సర్వోన్నత న్యాయస్థానం విధ్యుక్త ధర్మం. రాజ్యాంగ నిర్మాతలూ ఈ బృహత్తర బాధ్యతను సుప్రీం కోర్టుకు నిర్దేశించారు. మరి నేటి సుప్రీం కోర్టు అలా రాజ్యాంగ రక్షకునిగా వ్యవహరించడం లేదని, దురదృష్టవశాత్తూ చెప్పక తప్పదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం అప్పుడప్పుడు మాత్రం ప్రజలకు చిన్న చిన్న ఉపశమనాలు కల్పిస్తోన్న మాట నిజమే.

అయితే, మోదీ ప్రభుత్వ దౌర్జన్య పూర్వక రీతి, నీతి నుంచి రాజ్యాంగాన్ని రక్షించే సంకల్పం సుప్రీం కోర్టుకు లేదు. రాజ్యాంగాన్ని పరిరక్షించే పోరాటంలో నేటి సుప్రీం కోర్టు అయిష్టంగా పాల్గొంటున్నట్టుగా కన్పిస్తోంది. అటువంటప్పుడు ఆ పోరాటంలో దాని పాత్ర స్ఫూర్తిదాయకంగా ఎలా వుంటుంది? గౌరవనీయ న్యాయమూర్తులు ఈ పోరాటంలో ఏ పక్షాన వున్నారో చెప్పడం చాలా కష్టంగా వున్నదని అత్యున్నత న్యాయవ్యవస్థ పరిశీలకులు అంటున్నారు.

ఈ వాస్తవాల దృష్ట్యా, మన సమున్నత భారత గణతంత్ర రాజ్యాన్ని కాపాడుకోవడానికి కొనసాగుతున్న పోరాటాల అంతిమ విజయానికి నిర్ణయాత్మకంగా దోహదం చేయగలిగేవి న్యాయస్థానాలు గానీ లేదా పార్లమెంటు గానీ లేదా మరే ఇతర రాజ్యాంగ నిర్దేశిత సంస్థలు గానీ కానే కాదు. ఆ పోరాటాన్ని ప్రజాస్వామిక, అహింసాత్మక పద్ధతులలో వీధులలోకి తీసుకు వెళ్ళవలసి వున్నది. అవును, ప్రజలే తమ గణతంత్ర రాజ్యాన్ని సంరక్షించుకోవాలి. భారత ప్రజలమైన మనం, మనకు మనమే ఇచ్చుకున్న రాజ్యాంగం, భారత గణతంత్ర రాజ్య రక్షణకు ఒక ప్రధాన ఆలంబన కావాలి.

సమ పౌరసత్వం కోసం ప్రస్తుతం జరుగుతున్న పోరాటమంతా అందుకోసమే. పౌరసత్వ వివాదాలపై సుప్రీం కోర్టు విచారణలో ఒక దశ ముగిసింది. భవిష్యత్తులో ఇంకా సుదీర్ఘ పోరాటం చేయ వలసి వున్నది. కనుక ఇంతవరకు జరిగిన పోరాటాన్ని సింహావలోకనం చేసుకుని, దేశ వ్యాప్త పోరాట భావి గతి గురించి నిశితంగా, నిష్పాక్షికంగా ఆలోచించాలి.

సుప్రీం కోర్టు ఉత్తర్వుతో సిఏఏ-–ఎన్‌ఆర్‌సి-–ఎన్‌పిఆర్ వ్యతిరేక ఉద్యమంలో మొదటి దశ ఇంచుమించు ముగిసిందని చెప్పవచ్చు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి గౌహతి దాకా వివిధ ప్రాంతాలలో ఈ ఉద్యమ తొలి దశ ఈ నెల 30న మహాత్ముని వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు నిర్వహించనున్న మానవ హారం కార్యక్రమంతో ఒక ముగింపునకు రానున్నది.

ఈ ఉద్యమం ఏం సాధించింది? ఒక నెల క్రితం అనూహ్యమైనదాన్ని పౌరసత్వ చట్టాల వ్యతిరేక ఉద్యమ తొలిదశ ఇప్పటికే పరిపూర్తి చేసింది. మొట్టమొదట ప్రభుత్వ ధోణులపై ప్రజలు మౌనాన్ని వీడేలా చేసింది. గత ఆరేళ్ళుగా తీవ్ర ఆందోళనతో సతమతమవుతున్న ముస్లింల పట్ల సహానుభూతిని పెంపొందించింది. తమ న్యాయబద్ధమైన హక్కులకై యావత్ ముస్లిం సమాజమూ ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో పోరాడుతోంది. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఉద్యమం ప్రజల మనస్సులపై మరే ఉద్యమం వేయలేని ముద్రను ప్రగాఢంగా వేసింది. ప్రజలు స్వతస్సిద్ధంగా పోరాట పథంలోకి వచ్చేలా చేసింది.

రాజకీయ పార్టీలు, నాయకులు వారిని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. యువజనులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో పాల్గొనడం ఈ పోరాటం సాధించిన ఒక గొప్ప విజయం. ప్రతి చోటా కొత్త తరం నాయకులు ఆవిర్భవించారు భావంలోనూ, ఆచరణలోనూ ఒక అపూర్వ సృజనాత్మక స్ఫూర్తి వెల్లివిరిసేలా చేయడంలో ఈ ఉద్యమం సఫలమయింది.

అయితే ఈ సాఫల్యాలతో మనం సంతృప్తిచెందడానికి వీలులేదు. ఎందుకని? సిఏఏపై వస్తున్న ఆక్షేపణలను మోదీ సర్కార్ అంగీకరించడం లేదు. ఆ చట్టంపై తన వైఖరిని మార్చుకోవడానికి నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. ఈ ఉద్యమం పూర్తిగా అరాచక ముస్లిం మూకల పనేనని మోదీ సర్కార్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదు. ఈశాన్య రాష్ట్రాల వెలుపల విశాల భారతదేశమంతటా ఆ చట్టానికి నిరసన తెలుపుతున్నవారిలో అత్యధికులు ముస్లింలేనన్న మాట ఒక వాస్తవం. అయితే ఈ బాధిత వర్గాల వారు నిర్వహిస్తున్న ర్యాలీలు, ఇతర నిరసన ప్రదర్శనలు సహానుభూతిని గాక భయాన్ని కలిగించే అవకాశమున్నది.

ప్రజలు తమకు తాముగా పాల్గొనడమనేది ఈ ఉద్యమానికి ఒక గొప్పబలం అనడంలో సందేహం లేదు. ఉద్యమకారులల్లో ఎలాంటి అలుపు సొలుపు కన్పించడం లేదు. మొక్కవోని దీక్షతో వారు పోరాడుతున్నారు. ఈ ఉద్యమంలో మూడు స్రవంతులు ఉన్నాయి. అవి: అసోంలో నిరసనలు, ముస్లింల ఆందోళనలు, యువజనుల పోరాటాలు. ఈ మూడూ వేర్వేరుగా జరుగుతున్నాయి. ఇక ముందు అవి సమైక్యంగా జరగాలి. జనవరి 30న దేశవ్యాప్తంగా మానవ హారం కార్యక్రమం నిర్వహణ తరువాత సిఏఏ ఉద్యమం రెండో దశలోకి ప్రవేశించనున్నది. నగరాలలోనే గాక పల్లెలు, చిన్నపట్టణాలలో ప్రజలను సమీకరించి, సంఘటితం చేయడంపై దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయం ఆసన్నమయింది.

కొత్త పౌరసత్వ చట్టాల మూలంగా తమకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాబోవనే భరోసాతో వున్న హిందువులు అందరినీ ఉద్యమంలోకి తీసుకురావడం పై పూర్తిశ్రద్ధ చూపాలి. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, సంచార జాతి ప్రజలను ఈ ఉద్యమంలోకి తీసుకురావాలి. కొత్త పౌరసత్వ నిబంధనల వల్ల ఈ వర్గాల ప్రజలు అపారంగా నష్టపోనున్నారు. షాహీన్ బాగ్ మహిళల నిరసన ప్రదర్శనల తరహాలో దేశ వ్యాప్తంగా పోరాటాలను పెంపొందించాలి. కేవలం ఎన్‌పిఆర్–-ఎన్‌ఆర్‌సి–సిఏఏ ను వ్యతిరేకించడమే గాక తనకొక సొంత సానుకూల, నిర్మాణాత్మక ఎజెండాను రూపొందించుకోవాల్సిన అవసరం ఉద్యమానికి ఎంతైనా వున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగతి విషమ పర్యవసానాలను కూడా తన పోరాట లక్ష్యాలలో భాగంగా చేసుకోవాలి. సమ పౌరసత్వం కోసం సాగుతున్న ఉద్యమం జాతీయోద్యమ మహామహుల సమున్నత, స్ఫూర్తిదాయక భారత్ భావన పునరుద్ధరణకు దోహదం చేయాలి.

స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు

Courtesy Andhrajyothi