CAAయూపీ ఖాకీ వేసిన ఫైన్‌పై బాధిత కుటుంబాల ఆవేదన
– తమ బిడ్డలను విడిచిపెట్టాలంటూ మొర

లక్నో : సీఏఏ నిరసనలతో అట్టుడికిన రాష్ట్రం బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌. అక్కడ నిరసనల నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో.. బుల్లెట్‌ గాయాలకు బలైనవారి సంఖ్యా ఈ రాష్ట్రంలో ఎక్కువే. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించటం సంగతి పక్కనపెడితే.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేశారంటూ హక్కుల కార్యకర్తలతోపాటు, సామాన్యులకూ యూపీ సర్కార్‌ నోటీసులు పంపింది. రాంపూర్‌ జిల్లా షాబాద్‌ గేట్‌ వద్ద, హతిఖనా కూడలి వద్ద డిసెంబర్‌ 21న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. పోలీసులు రెచ్చిపోవటంతో… నిరసనలు హింసారూపం దాల్చాయి. ఘటన జరిగిన తరువాత రోజు జమీర్‌ ఖాన్‌ ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు కొట్టటం ప్రారంభించారు. జమీర్‌ భార్య తలుపు తీయటానికి ముందే పోలీసులు దానిని పగులగొట్టి ఇంట్లోకి దూసుకొచ్చి జమీర్‌ను తీసుకెళ్ళారని ఆమె భార్య తెలిపారు.

పోలీసులు తలుపు కొడుతున్న శబ్దం విన్న పక్కింటి వారు మహమ్మద్‌ మెహమూద్‌, పప్పూ బయటకువచ్చారు. బయట నిలబడి వున్న వారినీ పోలీసులు వదల్లేదు. వ్యాన్‌లో వాళ్లనూ ఎక్కించుకెళ్ళారు. ఆ మూడిండ్లకు చెందిన మహిళలు, ఇతర కుటుంబసభ్యులు అడ్డుకునే ప్రయత్నంచేశారు. ‘మారు మాట్లాడితే.. మిమ్మల్నీ జైలులో వేస్తాం’ అంటూ వారిని బెదిరించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారిపై ‘ప్రతీకారం తీర్చుకుంటాం, వారి ఆస్తులను జప్తు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ప్రకటించిన వెంటనే.. పోలీసులు జమీర్‌ ఖాన్‌, మహమ్మద్‌ మెహమూద్‌, పప్పులకు అక్షరాల రూ.26.23 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు పంపారు. ప్రభుత్వం ఆ మొత్తం ఎందుకు పొందకూడదో సమాధానం చెప్పాలని అందులో పేర్కొన్నారు. పోలీసులు ప్రయోగించిన బాష్పవాయుగోళాలు, రబ్బరు, ప్లాస్టిక్‌ బుల్లెట్లు, మున్సిపాల్టీ, పోలీసులు ఏర్పాటుచేసిన బారికేడ్లు తదితర ఖర్చులనూ అందులో కలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటివరకూ 400 మందికి పైగా ఇలాంటి నోటీసులు అందాయి. ఇటువంటి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో ఒక ఉత్తర్వు ఉన్నది.

కొడుకు కోసం ఎదురుచూస్తూ..
జమీర్‌ఖాన్‌ను పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత.. తల్లి మున్నీ బేగం (60) చలిగాలిలో ఇంటి ముందు కూర్చొని కొడుకు కోసం ఎదురుచూస్తున్నది. పోలీసులు ఇంటి తలుపు పగలగొట్టటంతో రాత్రి సమయంలోనూ చలిలో ఎవరో ఒకరు పహరా కాయాల్సిందే. జమీర్‌ఖాన్‌ జైలులో ఉండటంతో తలుపును బాగుచేయించేవారు కూడా ఎవరూ లేరు. ఆయన అరెస్టయిన కొద్దిరోజులకు పోలీసులు ఇంటికి వచ్చారు. ఊరికేరాలేదు… ఓ పేపర్‌ పట్టుకుని మరీ వచ్చారు. ‘దీన్ని ఎవరితోనైనా చదివించుకోండి.. మీరు డబ్బులు చెల్లించాలి’ అని ఆ కాగితాన్ని జమీర్‌ఖాన్‌ భార్య తస్లీమ్‌ జహాన్‌ చేతిలో పెట్టి వెళ్ళారు. ఇంట్లో ఉన్నవారికెవరికీ చదవటం రాదు. జమీర్‌తల్లి మున్నీబేగం ఆ నోటీసును కాజీ వద్దకు పంపింది. అందులో లక్షల రూపాయలు కట్టాలని ఉండటంతో షాక్‌కు గురైంది. ‘నా పిల్లలు పస్తుంటున్నారు. నిత్యాసవరాలు కొనుక్కోవటానికి కూడా డబ్బులేదు. ఇన్ని లక్షల మేం ఎక్కడి నుంచి తేవాలి? ఎలా కట్టాలి?’ అని మున్నీబేగం వాపోయారు. జమీర్‌కు చిన్న కిరాణా దుకాణం ఉన్నది.. దాంతోపాటు, కుట్టు పనికూడా చేసేవాడు. ఇప్పుడు ఆదాయంలేదు.. పస్తులుంటున్నాం.. అని ఆ కుటుంబసభ్యులు చెప్పారు.

‘నా కొడుకు తప్పు చేసినట్టు రికార్డుల్లేవు. జైలుకుగానీ, పోలీసు స్టేషన్‌కు కానీ వెళ్ళలేదు. అతనికి 10 ఏండ్ల కొడుకు, నాలుగేండ్ల అమ్మాయి ఉన్నారు. అతను రోజూ సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు మేం ఏం చేయాలి? అని జమీర్‌ తల్లి వాపోయారు. నా బిడ్డను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నిస్తే.. పై నుంచి ఉత్తర్వులున్నాయని పోలీసులు చెప్పారని ఆమె అన్నారు. నా బిడ్డను విడిచిపెట్టాలని ఆమె వేడుకుంటున్నారు.

‘నా భర్త నిరసనల్లో పాల్గొనలేదు. ఆ రోజు ఆయన ఇంట్లోనే ఉన్నారు. పక్కింట్లో తలుపుకొడుతున్న శబ్దం విని బయటకు వచ్చాడు. ఆ సమయంలో పోలీసులు అతనిని పట్టుకున్నారు. నేను కేకలు వేశాను. అరవొద్దంటూ.. ఇద్దరు మహిళా పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టారు’ అని మహమ్మద్‌ మెహమూద్‌ భార్య ఆవేదన వ్యక్తంచేశారు. ‘నా భర్తను తీసుకెళ్ళేటప్పుడు అతని జేబులు రూ.4500 వరకూ నగదు ఉంది. పోలీసులు ఆ డబ్బును లాక్కున్నారు. పైగా, లక్షలు జరిమానా చెల్లించాలంటూ నోటీసు పంపారు. మాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ మెహమూద్‌ భార్య చెప్పారు. నా భర్తను వెంటనే విడిచిపెట్టాలి. లేకపోతే మమ్మల్ని కూడా జైల్లో పెట్టండి. పరిహారం చెల్లించమని నోటీసులు ఇచ్చారు. ఇక్కడ సాధారణ ప్రజల ప్రాణాలు పోయాయి.. దానికి పరిహారం చెల్లించేదెవరు? అని షబ్నం ప్రశ్నించారు. పప్పూ కుటుంబసభ్యులదీ అదే పరిస్థితి. రెక్కాడితేగానీ.. డొక్కాడని బతుకుజీవులను జైల్లో వెశారు.. లక్షలు పరిహారం చెల్లించాలని నోటీసులు పంపుతున్నారు.

పెద్ద సంఖ్యలో అమాయకుల అరెస్టు : కాంగ్రెస్‌ నేత
నిరసనకారుల్లో భయాందోళనలను సృష్టించేందుకు ఇష్టంవచ్చినట్టు అరెస్టులకు పాల్పడుతున్నారనీ, పెద్దసంఖ్యలో అమాయకులను కటకటాల వెనక్కి నెట్టారని కాంగ్రెస్‌ స్థానిక నేత ఆరోపించారు. ఒక్క రాంపూర్‌లోనే 40 మందికిపైగా అరెస్టుచేశారు. 116 మందిపై కేసులు పెట్టారు. గుర్తుతెలియని వందలాదిమందిని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎవరైనా నిరసన గళం వినిపిస్తే వారిని లోపల వేసేందుకు ముందస్తు రంగం సిద్ధం చేశారు అని కాంగ్రెస్‌ నేత ఫైసల్‌లాల్‌ విమర్శించారు.

నోటీసులు ఇచ్చేందుకు కూడా ముడుపులు
నోటీసులు ఇవ్వడానికి ఇంటికొచ్చిన పోలీసులు డబ్బులు డిమాండ్‌ చేసినట్టు మూడు కుటుంబాల సభ్యులూ ఆరోపించారు. రూ. 500 అడిగారనీ, కానీ, ఆ సమయంలో తమ వద్ద ఉన్న 100, 50 ఇచ్చామని అన్నారు. పోలీసుల ఈ క్రూరమైన చర్యల తరువాత.. ఏం చేయాలో మాకు పాలుపోవటంలేదని ఆ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

(Courtesy Nava Telangana)