న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకుల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా.. ‘దేశద్రోహులను కాల్చిపారేయండి’ అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఠాకూర్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సైతం పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరలవుతున్నది. ప్రధానంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిని ఉద్ధేశిస్తూ బీజేపీ నాయకులు కొంతకాలంగా పదే పదే పై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీలోని షాహీన్‌భాగ్‌లో పోరాటం చేస్తున్న వారందరూ దేశద్రోహులేననీ, వారితో పాటు తుక్డే తుక్డే గ్యాంగ్‌నూ కాల్చిపారేయాలని కేంద్ర క్యాబినెట్‌లోని మంత్రులే వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana