– నిరుద్యోగం, ధరల పెరుగుదల, మందగమనం
– కప్పిపుచ్చుకునేందుకే సీఏఏ, ఎన్నార్సీ : మెజారిటీ ప్రజల అభిప్రాయమదే
– మైనారిటీలు అభద్రతాభావంలో ఉన్నారన్న 52 శాతం మంది : ఇండియా టుడే-కార్వీ సర్వే

న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే మోడీ సర్కారు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ)లను తీసుకొచ్చిందని దేశంలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే-కార్వీ చేపట్టిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మోడీ పాలనలో నానాటికీ పెరుగుతన్న నిరుద్యోగం, దరల పెరుగుదల, తీవ్రమవుతున్న మందగమనంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం సీఏఏ-ఎన్నార్సీలతో కాలక్షేపం చేస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది డిసెంబర్‌ 21 నుంచి 31 వరకు దేశంలోని 19 రాష్ట్రాల్లో ఈ సర్వేను చేపట్టారు. సుమారు 12,500 మందిని ఇంటర్వ్యూ చేసి దీనిని రూపొందించారు.

సర్వేలో పేర్కొన్న అంశాల ప్రకారం… నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక మందగమనం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కేంద్రప్రభుత్వం సీఏఏ, ఎన్నార్సీలను తీసుకొచ్చిందా..? అనే ప్రశ్నకు 43 శాతం మంది అది నిజమేనని సమాధానమిచ్చారు. 32 శాతం మంది కాదని చెప్పగా.. 25 శాతం మంది ఏమీ చెప్పలేమని అన్నారు. కాగా ఇదే ప్రశ్నకు 42 శాతం మంది హిందూవులు, 55 శాతం మంది ముస్లింలు.. ఆర్థికాంశాలను పక్కకు పెట్టేందుకే మోడీ సర్కారు వీటిని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రాంతాల వారీగా చూస్తే.. ఉత్తరాది నుంచి 40 శాతం మంది, ఈశాన్య భారతం నుంచి 44 శాతం, దక్షిణాది నుంచి 50 శాతం, తూర్పు భారతాన 41 శాతం మంది ప్రజలు అవునని తెలిపారు.
సీఏఏ, ఎన్నార్సీలతో మైనారిటీలు అభద్రతాభావంలో ఉన్నారా..? అనే ప్రశ్నకు 52 శాతం మంది అవుననే సమాధానం చెప్పారు. 14 శాతం మంది వారు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని తెలిపారు. అంతేగాక మైనారిటీలు అభద్రతాభావానికి లోనవడం సమర్థవంతమేనా..? అని అడగ్గా.. 53 శాతం అది సమర్థనీయమేనని చెప్పడం గమనార్హం. దేశవ్యాప్తంగా 97 పార్లమెంటరీ, 194 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ సర్వేను చేపట్టారు.

Courtesy Nava telangana