Image result for తీసివేతలకు జవాబు కూడికలే!"కె. శ్రీనివాస్

పౌరసత్వ చట్టంపై నిరసనల్లో వ్యక్తమైన సజీవ ఐక్యత- ఈ దేశానికి సరికొత్త హామీ ఇచ్చింది. శాంతి, సామరస్యం, సహజీవనం, పరస్పరత- ఈ విలువలు ఈ దేశంలో చాలా లోతుగా పాదుకుని ఉన్నాయి. వాటిని పెకిలించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా, వేళ్లు గట్టిగా ఉన్నాయి. కొత్తగా వస్తున్న విద్యావంతుల తరం, ఈ దేశవృక్షం కొమ్మల నుంచి ఊడలు దిగి, వేళ్లతో సంభాషిస్తున్నది. శరణార్థుల విషయంలో అయినా సరే, మతపరమయిన వివక్ష ఎక్కడా ఉండకూడదనీ, అది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనదని యువత నమ్ముతున్నది, దానికోసం నిలబడుతున్నది.

డిసెంబర్‌ 19 గురువారం. జామియా మిలియా యూనివర్సిటీ కేంపస్‌ లోపలా, ఎదురుగా కూడా నిరసనలు జరుగుతున్నాయి. అంతకు ముందు ఆదివారం నాడే అక్కడ విద్యార్థులపై బీభత్సం జరిగింది. పోలీసులపై రాళ్ల వర్షం కురిసింది. గురువారం నాడు మాత్రం ఒక ప్రశాంతత. క్రమశిక్షణ. రోడ్డంతా కిక్కిరిసిన జనం. ఇంతలో ముస్లిముల ప్రార్థనల వేళ అయింది. ముస్లిమేతర విశ్వాసాల వారంతా, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, సగం రోడ్డు మీద మానవహారంలాగా ఏర్పడి, ముస్లిమ్‌ నిరసనకారుల ప్రార్థనలకు వీలు కల్పించారు. అదొక అద్భుత దృశ్యం. భారతీయత పరవశించే సన్నివేశం. ద్వేషాన్ని అధికారిక ఉద్వేగంగా ప్రజల మీద రుద్దుతున్నవారికి సున్నితమయిన చెంపపెట్టు. ముస్లిములనే కాదు, ఏ మతస్థులైనా సరే తమ విశ్వాసాల ప్రకారం పూజలో ప్రార్థనలో చేసుకోవాలంటే, ఆ సమూహంలోని తక్కిన వారంతా అదే విధంగా సహకరిస్తారు. ఆ పరస్పరత ఆ సేతు హిమాచలం, వీధుల్లో జనంతో పోటెత్తిన ప్రతిచోటా ఒక పతాకంలాగా రెపరెపలాడింది.

జామియా మిలియా విద్యార్థిని అనుజ్ఞ అంటుంది- నా తోటివారు బాధపడుతుంటే, నేనెట్లా ఊరుకుంటాను, నేను చదువుకుంటున్నాను కదా, నా తల్లిదండ్రులు ఇంత ఖర్చుపెట్టి మాకు చదువు చెప్పిస్తున్నారు కదా, ఆ చదువు మాకు నేర్పిన విచక్షణను మేం ఈ సమాజం కోసం దేశం కోసం ఉపయోగించలేకపోతే ఏమి ప్రయోజనం? చదువులలో మర్మమెల్ల చెప్పిన ఆ అమ్మాయి చేత ఈ దేశపు పూర్వపు, ప్రస్తుత మానవవనరుల మంత్రులు తప్పనిసరిగా పాఠం చెప్పించుకోవాలి. మన దేశపు చదువులు ఎంతగా కునారిల్లిపోయినా, ప్రాథమిక విద్యనుంచి పోస్టుగ్రాడ్యుయేట్‌ చదువుదాకా అందించే విద్యాసంస్థలను ప్రభుత్వమే స్వహస్తాలతో గొంతు నులుముతున్నా, మనుషులందరినీ మరలుగా మార్చే ఫ్యాక్టరీలు బడులుగా కాలేజీలుగా చెలామణీ అవుతున్నా- సరే, అందినంత మాత్రం చదువు మనుషులను ఇంకా కదిలిస్తూనే ఉన్నది. తెలుసుకున్న కొంతయినా మంచిచెడ్డల విచక్షణకు అవకాశం ఇస్తున్నది. అమానవీయ ఆలోచనలను కనీసం ప్రశ్నించే శక్తినిస్తున్నది. అందుకే చదువులు ఆగిపోకూడదు. అనుజ్ఞ లాగా, సాటివారి కష్టానికి స్పందించాలని, చదువుకున్నందుకు ప్రశ్నించాలని ఈ దేశంలో కొందరైనా అనుకుంటున్నారు.

దేశమంతా జనప్రవాహాలు ఎవరినో నశించమని శాపనార్థాలు పెట్టడం లేదు. ఏవి వర్థిలాలో ప్రదర్శిస్తున్నాయి. దేశమంతా మువ్వన్నెల జెండాలు ఉద్యమంతో రెపరెపలు కలుపుతూ ఎగురుతూ ఉంటే అంబేడ్కర్‌, గాంధీ బొమ్మలు ప్లకార్డుల్లో మంచి మాటలు చెబుతుంటే, పిల్లలు అడుగుతున్నారు, రాజ్యాంగాన్ని అనుసరించమని, పెద్దలు అడుగుతున్నారు, పౌరసత్వ చట్టాన్ని వెనక్కితీసుకొమ్మని. మరో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‘రావణ్‌‘, జామా మసీదు మెట్ల మీద భారత రాజ్యాంగాన్ని ఒక ఆయుధంగా ధరించి, నిరసనకారులను ఉత్తేజితులను చేశారు. కొత్త తరం, కొత్త రక్తం, అనాగరిక భావాలను, పాలనలను ఇంకెంతకాలం సహించాలంటూ, ఏలికలకు మానవత్వపు ఓనమాలు నేర్పడానికి ఉద్యమిస్తున్నది.

ఏమీ నష్టం లేదంటున్న ప్రభుత్వం ఏమి లాభమో మాత్రం చెప్పలేకపోతున్నది. నీ మనసులో ఉన్న కుట్ర ఇదీ అని నిలదీస్తుంటే, మాటవరస ఖండనలు ఇస్తుంది కానీ మరుక్షణమే మరో విచ్ఛిన్నకర ప్రకటన సిద్ధం. సిఎఎ, ఎన్‌ఆర్సీ కలిసి కదా ప్రమాదం, ఇప్పుడు ఎన్పీఆర్‌ మరో మాయలేడి. జనం వద్దంటున్న కొద్దీ అదే మాట మరో రూపంలో, అదే మోసం మరో వేషంలో. కుట్ర నిజమైనా కాకపోయినా, నీ పూర్వచరిత్ర నీ ప్రతిచర్యను అనుమానాస్పదం చేస్తుంది. బూచి అబద్ధం కావచ్చును కానీ, భయం వాస్తవం. పౌరసత్వపు కాగితాలను తనిఖీ చేస్తూ గెస్టపో పోలీసులు చేసే హంగామా, కాయితాలు లేని వారిని వ్యానుల్లో కుక్కి తరలించిన దృశ్యాలు, నాజీకాలపు ఇతివృత్తాల సినిమాలు చూసినవారికి తెలిసినవే. మనుషులను బానిసల కంటె, మృగాల కంటె హీనంగా పరిగణిస్తూ, వారిని విషవాయు గృహాల్లో తరలించి చంపిన దుర్మార్గం హిట్లర్‌ది. అటువంటి నరహంతకులు చివరకు కాలగర్భంలో చరిత్రహీనులుగా కలసిపోతారని తెలిసినా, ప్రపంచవ్యాప్తంగా నియోనాజీలు పుట్టుకువస్తూనే ఉన్నారు. మన దేశం కూడా హిట్లర్‌ యుగవైభవాన్ని చవిచూడాలా? ఆ వల్లకాటి అధ్వాన శకం వస్తుందేమోనని భయం. ఈ దేశంలోని 20కోట్ల ప్రజల భయాందోళనలను, అవి భ్రమలే అనుకుందాం, ఎట్లా తొలగించకుండా ఉంటావు? అనునయం, ఉపశమనం, వివరణం వంటి మాటలే నీ నిఘంటువులో ఉండవా? ఎన్నిసార్లు ఎన్ని నల్లచట్టాలు తెచ్చి, ప్రజలు భయపడుతున్నారన్న పేరుపెట్టి, ఉపసంహరించుకోలేదు, ప్రజల్లో విశ్వాసం నింపడానికైనా.

అతిశయం పెరిగి, నోరూ కాలూ అన్నీ జారుతున్నాయి. అవరోహణం మొదలయ్యాక ఆగదు. అధినేతలు అసాధ్యులు కదా, వారికి అధికారం ఒక్కటే లక్ష్యం కాదు. కొందరిని చెరబట్టి, కొందరిని అణచిపెట్టి, మరి కొందరిని మాయలో పెట్టి- దేశంలోని ప్రతి ఆత్మనూ ఒక బందీనో, కీలుబొమ్మనో చేయగలిగితే అదే శాశ్వత అధికారాన్నిస్తుంది. అందుకని, కుట్రలు సశేషం. వేగం తగ్గిందని వేడుకపడకూడదు.

పౌరసత్వ చట్టంపై నిరసనల్లో వ్యక్తమైన సజీవ ఐక్యత- ఈ దేశానికి సరికొత్త హామీ ఇచ్చింది. శాంతి, సామరస్యం, సహజీవనం, పరస్పరత- ఈ విలువలు ఈ దేశంలో చాలా లోతుగా పాదుకుని ఉన్నాయి. వాటిని పెకిలించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా, వేళ్లు గట్టిగా ఉన్నాయి. కొత్తగా వస్తున్న విద్యావంతుల తరం, ఈ దేశవృక్షం కొమ్మల నుంచి ఊడలు దిగి, వేళ్లతో సంభాషిస్తున్నది. పోరాడవలసిన శత్రువులపై పోరాడతాం, సాంస్కృతికంగా సామాజికంగా సహజీవన విలువలను గౌరవిస్తూ, కొత్త సమీకరణలను నిర్మిస్తాం అని యువతరం చెబుతున్నది. శరణార్థుల విషయంలో అయినా సరే, మతపరమయిన వివక్ష ఎక్కడా ఉండకూడదనీ, అది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైనదని యువత నమ్ముతున్నది, దానికోసం నిలబడుతున్నది. ద్వేషంతో, భేదభావంతో, అజ్ఞానంతో చెడిపోయిన యువత లేదని కాదు. ఏ శక్తి తన సంకల్పంతో, ఐక్యతతో ముందుకు వెళ్లగలుగుతుందో దాన్నే పురోగామి శక్తి అంటాము.

అరుంధతీరాయ్‌ చెప్పినట్టు, శరణార్థులు, ముస్లిములు, వీళ్లే కాదు, దేశస్తులందరినీ పిటిషనర్లుగా మార్చడమే ఈ చట్టం ఉద్దేశ్యం. ప్రతి ఒక్కడిలో అభద్రతను సృష్టించాలి, పక్కవాడి మీద ద్వేషాన్ని కల్పించాలి. ఈ దేశ దారిద్ర్యానికి, పాతాళానికి పడిపోతున్న దేశవృద్ధి రేటుని మరచిపోయి, మతోన్మాదంలోనో జాతీయవాద ఉన్మాదంలోనో ప్రజలు పరవశించేట్టు చేయాలి, మున్ముందు ఒక మతతత్వ నియంతృత్వ కార్పొరేట్‌ రాజ్యాన్ని స్థాపించాలి…ఇదే కదా అసలు అజెండా. అదేదో కనుచూపు మేరలోకి వచ్చిందని భయపడేవాళ్లు భయపడడం, సంతోషించేవాళ్లు సంతోషించడం జరిగాయికానీ, స్టాక్‌మార్కెట్‌కు లాగా, రాజకీయ సంచలనాలకు కూడా కరెక్షన్లు ఉంటాయి. ఎంత పాడైపోయినా, కష్టించి నిర్మించుకున్న ఆధునిక సమాజం మౌలికంగా మంచివైపే ఉన్నదని గ్రహించిన తరువాత, గమనాన్ని సరిదిద్దుకోవడం అసాధ్యమేమీ కాదు. పెనుప్రమాదాన్ని నివారించే ఉత్సాహంలో, తనలోని విలక్షణతను, విభిన్నతను, సామరస్యతను ప్రదర్శిస్తూ, ఈ క్రమంలో మరిన్ని కొత్త విలువలను కూడా సమకూర్చుకుంటున్నది. పాలకులు తమ ప్రయాణంలో ఒక్కో మెట్టు ఎక్కకుండా చూడడమే దేశభక్తుల కర్తవ్యం. సామరస్యపు మాట, శాంతి వచనం ఇవి కూడా సహించని కాలం వచ్చింది కాబట్టి, ఇప్పుడు అంబేడ్కర్‌, రాజ్యాంగం, గాంధీ- అందరూ మంచితనానికి సంకేతాలే. అభిప్రాయభేదాలు పక్కనబెట్టి, మువ్వన్నెలజెండాకు దాని స్ఫూర్తిని తిరిగి అద్దవలసిందే. విడదీసేవాడికి విడిపోనివాళ్లే జవాబు.

(Courtesy Andhrajyothi)