రాజా రవివర్మ కుంచె నుంచి జాలువారిన పెయింటింగ్స్‌లోని అందం గురించి ఇప్పటికీ ఎక్కడో ఒక చోట చర్చ జరుగుతూనే ఉంటుంది. ఆయన బొమ్మల్లోని మహిళా సౌందర్యం, రాజసం వర్ణనాతీతం. ఆయన వేసిన బొమ్మలు సజీవంగా తారకలై మనముందుకు వస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనకు ప్రతిరూపాలే ఇక్కడ మీరు చూస్తున్న చిత్రాలు.

రవివర్మ చిత్రాలను పునఃసృష్టించే సాహసం ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. చేయలేరు కూడా. కానీ ఆయన వేసిన పెయింటింగ్స్‌ను ఫొటోలుగా మలిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు నటి సుహాసిని మణిరత్నం, ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ జి.వెంకట్‌రామ్‌.

ఆలోచనకు అంకురార్పణ…
మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసి, వారిని అభివృద్ధి వైపు నడిపించే లక్ష్యంతో సరిగ్గా పదేళ్ల క్రితం సుహాసిని మణిరత్నం ‘నామ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో మహిళాభ్యున్నతికి ఆమె కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మహిళల కోసం ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. 2015లో చెన్నైని వరదలు ముంచెత్తినప్పుడు కూడా ‘నామ్‌’ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సేవాకార్యక్రమాలు చేపట్టింది. వరద బాధితులను ఆదుకునేందుకు విరాళాల సేకరణలో భాగంగా ఆభరణాలకు సంబంధించిన ఫ్యాషన్‌ షో ఒకటి ఏర్పాటుచేశారు. అందులో 19 శతాబ్దానికి చెందిన చిత్రకారుడు రాజా రవివర్మ ట్రావెన్‌కోర్‌ రాజవంశానికి చెందిన మహిళల పెయింటింగ్స్‌లో వేసిన ఆభరణాల తరహా నగలను మోడల్స్‌కు స్టయిలింగ్‌ కోసం వాడారు. అప్పుడే సుహాసిని, వెంకట్‌రామ్‌లకు ‘క్యాలెండర్‌’ ఆలోచన వచ్చింది. ‘నామ్‌’ సంస్థ స్థాపించి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఒక క్యాలెండర్‌ను తేవాలనుకున్నారు.

అందుకోసం రాజా రవివర్మ చిత్రాలను ఫొటోలుగా రీ క్రియేట్‌ చేయాలనుకున్నారు. ‘‘మహిళల్లోని అనేక కోణాలను కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. వారిలో రాజా రవివర్మ ప్రథములు. ఆయన మహిళల్లోని దర్పాన్ని, రాజసాన్ని, సౌందర్యాన్ని అద్భుతమైన రంగుల కలయికతో ఫ్రేముల్లో బంధించారు. మహిళలు సొంతంగా ఎదగాలని, వారికి స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు చేపడుతున్న నాకు రవివర్మ వేసిన చిత్రాలకు జీవం పోయాలనిపించింది.

దర్పం ఉట్టిపడే దుస్తులు, ఆభరణాలు ధరించి… ఘనమైన బ్యాక్‌డ్రాప్‌లో పన్నెండు మంది భారతీయ మహిళలను చూపించాలనే ఈ క్యాలెండర్‌కు రూపకల్పన చేయడం జరిగింది’’ అని చెన్నైలో సోమవారం జరిగిన క్యాలెండర్‌ విడుదల కార్యక్రమంలో సుహాసిని అన్నారు.

12 చిత్రాలు… 12 మంది తారలు….
రాజా రవివర్మ వేసిన 12 పెయింటింగ్స్‌ తీసుకుని అచ్చంగా వాటిని పోలిన బ్యాక్‌ డ్రాప్‌ క్రియేట్‌ చేసి, దుస్తులు, ఆభరణాలు, లైటింగ్‌తో ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వెంకట్‌రామ్‌ ఈ ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. ఇందులో రమ్యకృష్ణ, ఖుష్బూ, సమంత, శ్రుతీహాసన్‌, ఐశ్వర్యా రాజేశ్‌, నదియా, లిజీ, శోభన, కలర్స్‌ స్వాతి, మంచు లక్ష్మి, నిక్కీ గల్రానీలతో పాటు చాముండేశ్వరీలు రవివర్మ పెయింటింగ్స్‌ను సజీవంగా మన ముందుంచారు. ‘‘మాస్టర్‌ ఆర్టిస్ట్‌ రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో లైటింగ్‌ కోసం ఆయన వాడిన రంగులు నన్ను ఎప్పుడూ విస్మయానికి గురిచేస్తూ ఉండేవి. వాటిని రీ క్రియేట్‌ చేసే అవకాశం నాకు లభించిందనుకున్నా. ఆయన పెయింటింగ్స్‌కు నేను తీసిన ఫొటోలను మ్యాచ్‌ చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. స్టయిలింగ్‌, కాస్ట్యూమ్స్‌, నగలు, బ్యాక్‌డ్రాప్‌లోని ప్రాపర్టీ మొదలైనవి పెయింటింగ్స్‌లో ఉన్నవాటికి దగ్గరగా ఉండేలా చూశాం. సుహాసిని గారి ‘నామ్‌’ సంస్థ కోసం ఈ క్యాలెండర్‌ను తీసుకురావడం మర్చిపోలేని అనుభవం’’ అన్నారు ఫొటోగ్రాఫర్‌ వెంకట్‌రామ్‌. ఆయన అన్నట్టుగానే ‘తాము రవివర్మ చిత్రాలుగా మారడం గొప్ప అనుభూతికి లోనయ్యా’మని పలువురు తారలు ట్వీట్స్‌ చేస్తున్నారు.

Courtesy Andhrajyothi