రాజమహేంద్రవరం : దేవదాయ శాఖకు చెందిన ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని దేవస్థానం అధికారులు చేసిన నిర్వాకం చూస్తుంటే యావత్తు క్రైస్తవ మతంపై దాడి చేసేలా ఉందని నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడింది. ఆరు రోజులుగా ఒక క్రైస్తవ కుటుంబాన్ని గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. దళిత ఉద్యమ నాయకుడు, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ స్థాయీ సంఘం మాజీ ఛైర్మన్‌ బర్రే కొండబాబు బాధిత క్రైస్తవ కుటుంబానికి మద్దతుగా గృహ నిర్భంధంలోకి వెళ్లారు. దీనిపై పలు దళిత సంఘాల నాయకులు నిజనిర్ధారణ కమిటీగా ఏర్పడి శుక్రవారం సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిజనిర్ధారణ కమిటీ ప్రతినిధులైన డిఎంఆర్‌ శేఖర్‌, మర్రి బాబ్జి, ఎల్‌వి ప్రసాదరావు, దాసి వెంకట్రావు, బోయినపల్లి కరుణాకర్‌ దేవదాయ శాఖ అధికారులు సీజ్‌ చేసిన స్థలాన్ని, గృహ నిర్బంధంలో ఉన్న క్రైస్తవ కుటుంబంతోపాటు, బర్రే కొండబాబును కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చర్చిసభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 70 ఏళ్లుగా అదే ప్రాంతంలో ఉన్న క్రైస్తువులకు చెందిన చర్చికి మార్గం లేకుండా చేయడం దారుణమన్నారు. దేవాదాయ శాఖ అధికారుల తీరు చూస్తుంటే దళితులను, క్రైస్తవులను తక్కువ భావంతో అణిచివేసే ప్రయత్నంగా కనిపిస్తుందన్నారు. ట్రిబ్యునల్‌ ఉత్తర్వుల్లో కేవలం 1,011 గజాల స్థలాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. అధికారులు మొత్తం స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే దళితులపైనా, క్రైస్తవులపైనా కక్షపూరితంగా వ్యవహరించే చర్యలకు దిగారని అర్థమవుతుందన్నారు. ఈ చర్యలను మానుకోకపోతే దళిత, క్రైస్తవ సంఘాలు ప్రతిఘటిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వారు హెచ్చరించారు.
సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన డిఎస్‌పి, తహశీల్దార్‌
క్రైస్తవ కుటుంబాన్ని గృహ నిర్బంధం నేపథ్యంలో శుక్రవారం సెంట్రల్‌ డిఎస్‌పి సంతోష్‌, అర్బన్‌ తహశీల్దార్‌ సుస్వాగతం సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. గృహం, చర్చికి సంబంధించిన సరిహద్దులను వారు పరిశీలించారు. చర్చలకు తహశీల్దార్‌ కార్యాలయానికి రావాలని కొండబాబును కోరారు. దీనిపై కొండబాబు మాట్లాడుతూ తమ ప్రతినిధులుగా నిజనిర్ధారణ కమిటీకి చెందిన ప్రతినిధులను పంపిస్తానని తెలిపారు. సమస్యను పరిష్కరించేంత వరకూ తాను గృహ నిర్భంధంలోనే ఉంటానని వారికి స్పష్టం చేశారు.

Courtesy Prajashakti..