• పరీక్ష కిట్‌లో లోపంతోనే పాజిటివ్‌ రిపోర్టు
  • వైద్యులు వెల్లడించారన్న చిరు

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా సోకలేదని తేలింది. ఆదివారం కరోనా నిర్ధారణ పరీక్షకు సంబంధించి వాడిన కిట్‌లో లోపం కారణంగానే ఆయనకు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చిందని వైద్యులు తేల్చారు. ఈ మేరకు గురువారం చిరంజీవి ట్విటర్‌లో వెల్లడించారు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు పరీక్షలు చేయించుకున్నానని, ఫలితం పాజిటివ్‌ అని తేలిందని చిరంజీవి సోమవారం ప్రకటించారు. తనను నాలుగైదు రోజులుగా కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

అయితే, రెండు రోజులుగా కరోనా లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చి అపోలో ఆస్పత్రి వైద్యులను సంప్రదించానని, వారు సీటీ స్కాన్‌ తీసి ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్‌ లేదని నిర్ధారించారని చిరంజీవి తాజాగా ట్వీట్‌ చేశారు. అక్కడ ఫలితం నెగెటివ్‌ వచ్చాక.. టెనెట్‌ ల్యాబ్‌లో మూడు రకాల కిట్లతో పరీక్షలు చేయించుకున్నానని, అక్కడా నెగెటివే వచ్చిందన్నారు.

ఆదివారం పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన చోట ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించగా, అక్కడా నెగెటివే వచ్చిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. కిట్‌లో లోపంతోనే మొదటి పరీక్ష ఫలితం పాజిటివ్‌ అని చూపినట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చారన్నారు. మరోవైపు తనపై ప్రేమాభిమానాలు చూపి, పూజలు చేసినందుకు ప్రజలకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.

Courtesy Andhrajyothi